సమైక్యవాదైతే రాజీనామా చేసి ఉద్యమించాలి

హైదరాబాద్, 5 సెప్టెంబర్ 2013:

గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు ప్రజలే తప్పనిసరిగా బుద్ధి చెబుతారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశానని గొప్పలు చెబుతున్న చంద్రబాబు‌ ప్రస్తుత పరిస్థితిపై ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబు నాయుడు సమైక్యవాది అయితే వెంటనే రాజీనామా చేయాలని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. తాను సమైక్యవాదినని చెప్పుకుంటూ ప్రజలను గందరగోళ పరిస్థితు‌ల్లోకి నెడుతున్న ఆయన ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని అంబటి సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.

ఆ బాబు ఇట్టా, ఈ బాబు అట్టా అంటూ చెబుతున్న చంద్రబాబూ నీ లోకేష్‌బాబు సంగతేంటి? అని రాంబాబు నిలదీశారు. లోకేష్‌ కథ చెప్పదలచుకుంటే పుంఖానుపుంఖాలు చెప్పొచ్చన్నారు. డాక్టర్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలుకు ఎందుకు వెళ్ళారో అందరికీ తెలుసన్నారు. తన కొడుకు వయస్సు ఉన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ప్రతిసారీ చంద్రబాబు నాయుడు రోజూ ఆడిపోసుకుంటున్నారని అంబటి విమర్శించారు.  అంతే తప్ప ఈ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న దాఖలాలు చంద్రబాబులో కనిపించడం లేదన్నారు.

అనేక సందర్భాల్లో కాంగ్రెస్, వైయస్ఆర్‌ కాంగ్రెస్, టిఆర్ఎస్‌ పార్టీలను చంద్రబాబు దూషిస్తున్నారని, అయితే మీ పార్టీ విధానం ఏమిటని అంబటి ప్రశ్నించారు. రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు చంద్రబాబు సమైక్యాన్ని కోరుకుంటున్నారా? లేక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారో కూడా చెప్పలేని అగమ్యగోచరమైన స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు వింటుంటే ఆయనకు కొంచెం బ్యాలన్సు తప్పినట్టుగా అనిపిస్తోందన్నారు. చంద్రబాబు నాయుడికి మతి భ్రమించినట్లు అంటే పిచ్చెక్కినట్లు అనిపిస్తోందన్నారు. తొమ్మిదేళ్ళ క్రితం అధికారం కోల్పోయిన చంద్రబాబుకు కనుచూపు మేరలో  అది దక్కే అవకాశం లేదని తెలిసిన తరువాత పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారన్నారు. తెలుగు క్లాసుకు వెళ్ళి ఇంగ్లీషు, ఇంగ్లీషు క్లాసుకు వెళ్ళి తెలుగు మాట్లాడిన చందంగా చంద్రబాబు తీరు ఉందన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు మతిచెడి మాట్లాడుతున్నారన్నారు. అరవై ఐదేళ్ళ వృద్ధుడు కాబట్టి ఆయనకు చాదస్తం కూడా వచ్చినట్టు ఉందన్నారు. చంద్రబాబు బస్సు యాత్రను నేరుగా విశాఖపట్నం మెంటల్‌ ఆస్పత్రికి గాని, హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఆస్పత్రికి కాని తరలించి వైద్యం చేయించాలని ఎన్టీ రామారావుగారి కుటుంబ సభ్యులకు అంబటి సూచించారు.

గతంలో కాంగ్రెస్‌కు సహకారం అందించిన బాబు ద్వంద్వ వైఖరిపై అంబటి మండిపడ్డారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆయనే కట్టారంట.. ఎయిర్‌ పోర్టు ఆయనే కట్టారంట.. పివి నర్సింహారావు ఎక్సుప్రెస్‌వే కూడా ఆయనే కట్టారంట.. హైదరాబాద్‌ అంతటినీ నిర్మించింది ఆయనే అని కబుర్లు చెబుతున్నారని అంబటి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను ఆయన నిర్మించినా.. నిర్మించకపోయినా కాలానుగుణంగా హైదరాబాద్‌ ఒక మహానగరంలా అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్‌ను ఏం చేయాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉండాలి.. హైదరాబాద్‌ సీమాంధ్రుల హక్కు అని ఒక్కసారి అయినా చంద్రబాబు మాట్లాడారా? అని అంబటి నిలదీశారు. ఇటలీకి - ఇడుపులపాయకు కనెక్షన్‌ ఉందంటూ దుర్భాషలాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఇటలీకి - ఇడుపులపాయకు కనెక్షన్‌ ఉంటే శ్రీ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేయాలని అన్నారు. అవిశ్వాస తీర్మానం పెడితే.. కాంగ్రెస్‌ పార్టీని మోసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అవిశ్వాసానికి అనుకూలంగా టిడిపి ఓటు వేసి ఉంటే రాష్ట్రానికి ఇప్పుడు ఈ గతి ఉండేదా? చంద్రబాబు నాయుడుగారూ అన్నారు. ఎటూ ఓటు వేయకుండా కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరించింది చంద్రబాబే కదా అన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ వెళ్ళి కాంగ్రెస్‌లో చేరిపోతోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

Back to Top