కాంట్రాక్ట్ లెక్చరర్ల ఆందోళనకు సంఘీభావం

విజయవాడః నగరంలో  కాంట్రాక్ట్ లెక్చరర్ల దీక్షకు వైయస్సార్సీపీ నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కనబెట్టి రైతుల భూములు లాక్కోవడం, రియల్  ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప బాబుకు ప్రజాసమస్యలు, అభివృద్ధే పట్టడం లేదని మండిపడ్డారు. బాబు హామీలు నెరవేర్చని కారణంగా రైతులు, మహిళా సంఘాలు, నిరుద్యోగులు అందరూ రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు సహా టెంపరరీ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తానని మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు..ఇవాళ వాళ్ల ఉద్యోగాలు ఊడగొడుతూ నోటీసులు గేట్లకు అంటించడం దుర్మార్గమని అన్నారు.

ఇలాంటి ప్రభుత్వం దేశంలో మరెక్కడా ఉండదని ఎత్తిపొడిచారు. బాబు ఇచ్చిన మాట మీద ఒక్క పర్సంట్ కూడా నిలబడలేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతుంటే... 4500 కుటుంబాలను నడిరోడ్డున పడేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబు ఇందుకు ప్రతిఫలం అనుభవిస్తాడని హెచ్చరించారు. మా నాయకుడు చెప్పినట్టుగా వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక  కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అప్పటివరకు లెక్చరర్లకు వైయస్సార్సీపీ పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. 
Back to Top