అనంతలో టీడీపీ అంతరించింది

సభకు రావాలని అంగన్‌వాడీ, ఉపాధి కూలీలకు బెదిరింపులు
పేరూరు డ్యామ్‌ పునాధి రాయి వేసేందుకు అర్భాటాలు
నాలుగున్నరేళ్లలో చంద్రబాబు అనంతకు చేసిందేమీ లేదు
అనంతను సెంట్రలైజ్డ్‌ టౌన్‌షిప్‌ చేస్తాననడం శోచనీయం
పేరూరు పరిటాల రవి కల అనడం విడ్డూరం

అనంతపురం: అనంతపురంలో తెలుగుదేశం పార్టీ అంతరించుకుపోతోందనడానికి చంద్రబాబు పర్యటన నిదర్శనమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఇతర జిల్లాల నుంచి అంగన్‌వాడీలు, ఉపాధి కూలీలను బెదిరింపులకు గురిచేస్తూ అనంత సభకు తరలించుకున్నాడన్నారు. అనంతపురం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేరూరు ప్రాజెక్టుకు పునాధి రాయి వేసేందుకు చంద్రబాబు అనేక రకాల ప్రచారాలు చేసుకున్నారన్నారు. తనపై కేసులు పెడతారంట.. అరెస్టు చేస్తారంట.. ప్రజలంతా రక్షణ కవచంగా ఉండాలని చంద్రబాబు అంటుంటే.. తనను తాను రక్షించుకోలేని ముఖ్యమంత్రి మనల్నేం రక్షిస్తాడని సభకు వెళ్లిన అంగన్‌వాడీలు, ఉపాధి కూలీలు వాపోతున్నారు. పేరూరు డ్యామ్‌కు శిలాఫలకం వేసేందుకు వచ్చిన ముఖ్యమంత్రికి రైతుల మద్దతు కనిపించకపోవడం శోచనీయమన్నారు. రైతులు రావడం లేదని ఇంటలీజెన్స్‌ వర్గాలు తెలియజేడంతో గత వారం రోజులుగా ఉపాధి హామీ కూలీలు, అంగన్‌వాడీలను అధికారులతో బెదిరింపులకు గురిచేసి మీరంతా సభకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేయించారన్నారు. ముఖ్యమంత్రి సభకు రాకపోతే గ్రూపులో నుంచి రూ. 400లు కట్‌ చేస్తామని డ్వాక్రా సంఘాల మహిళలను బెదిరించిన వాయిస్‌రికార్డింగ్‌ సోషల్‌ మీడియాలో వైరలైందన్నారు. 

అనంతపురానికి చంద్రబాబు చేసిందేమీ లేదని తోపుదుర్తి ప్రకాష్‌ అన్నారు. ఇంత వరకు అనంతకు ఒక్క పరిశ్రమ రాలేదు.. ఒక్కరికీ కూడా ఉద్యోగం రాలేదన్నారు. ఇప్పటి వరకు ఏమీ చేయని ముఖ్యమంత్రి ఇప్పుడోదో చేస్తానంటే ప్రజలు నమ్మడానికి సిద్ధం లేరన్నారు. అనంతకు విమానాశ్రయం తీసుకొస్తా.. బెంగళూరు విమానాశ్రయానికి దగ్గరలో ఉన్నాం.. అనంతను సెంట్రలైజ్డ్‌ టౌన్‌షిప్‌ చేస్తానని ప్రకటించడం శోచనీయమన్నారు. జిల్లాలో హంద్రీనీవాకు సంబంధించి 3.5 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా.. ఇవాల్టికి డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి నీరు ఇవ్వలేకపోయారన్నారు. నిన్న శంకుస్థాపన చేసిన పేరూరు ప్రాజెక్టుకు హంద్రీనీవా నుంచి లింక్‌కెనాల్‌ కూడా కేవలం రూ. 10 కోట్లతోనే తుక్కలాపట్నం నుంచి నీరు ఇవ్వొచ్చు అన్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగానైనా పేరూరు నింపుతారేమోనని ప్రజలంతా సంతోషపడ్డారన్నారు. తర్కలపట్నం వంక దగ్గర నుంచి డ్యామ్‌కు నీరు వస్తాయని, దీనికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదన్నారు. పేరూరు డ్యామ్‌ నింపి నీరు వదులుతారంట.. టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేస్తారంట అని టీడీపీ ప్రచారం చేస్తే సభకు వచ్చిన మహిళలు దాన్ని చూసేందుకు వెళ్లి అబద్ధాలు చెప్పారని విస్తుపోయారన్నారు. 

చంద్రబాబు శిలాఫలకం వేసిన ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడని ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. గతంలో హింద్రీనీవాకు ఆత్మకూరు, ఉరవకొండ దగ్గర 1997, 1999లో శిలాఫలకాలు వేశారన్నారు. అదే విధంగా 40 టీఎంసీల సాగునీటి ప్రాజెక్టును 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చాడన్నారు. పేరూరు డ్యామ్‌ పరిటాల రవీంద్ర కల అని చంద్రబాబు మాట్లాడడం శోచనీయమన్నారు. పరిటాల ఎక్కడ నుంచి నీరు తీసుకురావాలని కల కన్నారని ప్రశ్నించారు. హంద్రీనీవాను దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చారని, జీడిపల్లి నుంచి పేరూరు డ్యామ్‌కు నీరు ఇవ్వమని సర్వే నిర్వహించి వైయస్‌ఆర్‌కు నివేదిక ఇస్తే వైయస్‌ఆర్‌ ప్రకటించిన ప్రాజెక్టును పరిటాల రవి కలగా అభివర్ణించడం చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. 5 వేల ఎకరాల పేరూరు ప్రాజెక్టుకు రూ. 8 వందల కోట్లు ఇస్తామన్న గొప్ప ఆలోచనపరుడు హిందూపుర పార్లమెంట్‌లోని 2.42 లక్షల ఎకరాల పిల్ల కాల్వల నిర్మాణాన్ని ఎందుకు టేకప్‌ చేయడం లేదని చంద్రబాబును ప్రశ్నించారు. రోజు రోజుకు టీడీపీ ప్రజల్లో ఉనికి కోల్పోతుందన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ప్రజలు సభకు తరలివెళ్లే పరిస్థితి లేదని, కళ్యాణదుర్గం, కదిరి, ఇతర జిల్లాల నుంచి ప్రజలను బెదిరింపులకు గురిచేసి సభకు తీసుకొచ్చారన్నారు.
Back to Top