20న రాజధానిలో పాదయాత్ర, ధర్నా: శోభానాగిరెడ్డి

హైదరాబాద్ 18 సెప్టెంబర్ 2013:

తెలంగాణకు అనుకూలంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోవలసిందేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి స్పష్టంచేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 20న తెలుగు తల్లి విగ్రహం నుంచి అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాదయాత్ర చేస్తామని చెప్పారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌పై కాంగ్రెస్, టీడీపీల ప్రజా ప్రతినిధులు తమ వైఖరిని విస్పష్టంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి, గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేసిన మాదిరిగానే చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో రాజీనామాలు చేయించి సీమాంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం కార్యరూపం దాల్చకముదే టీడీపీ నేత మేలుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కూడా రెండు వైపులా డ్రామాలు ఆడకుండా స్పష్టమైన విధానంతో రాజీనామాలు చేసి ముందడుగు వేయాలని కోరారు.
సీమాంధ్ర ప్రాంతంలో సోదరులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఏపీ ఎన్జీవోలు సమ్మె ప్రారంభించి నలబై రోజులయ్యింది. నెలజీతం రాక వారు ఇక్కట్లు పడుతున్నారు. విద్యా సంస్థలు, చిన్న దుకాణాల వారు... ఇలా అన్ని వర్గాల వారు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తున్నారన్నారు. టీడీపీ ఇచ్చిన లేఖ ఆధారంగానే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణపై నిర్ణయం తీసుకుందనీ, దీనిపై తెలంగాణ ప్రాంతంలోని గ్రామాల్లో ప్రచారం చేసుకోవాలని చెప్పిన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కోరారు. అందరూ రాజీనామాలు చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ,  ఆంటోనీ కమిటీ మీ దగ్గరకు వస్తుందని, రాష్ట్రం ఎలా విడిపోతుందో అప్పుడు చూద్దాం అని ఆమె అన్నారు.

టీడీపీ ప్రజాప్రతినిధులు పదవులు వీడాలి, ప్రజాభీష్టాన్ని గౌరవించాలన్నారు.  తమ లేఖ వల్లే తెలంగాణ వచ్చిందని టీటీడీపీ నేతలు అంటున్నారు. సీమాంధ్రలో మాత్రం విభజనకు వ్యతిరేకం అంటున్నారు. తెలంగాణలో ఒక విధంగా, సీమాంధ్రలో మరోవిధంగా వ్యవహరించడం మీ విధానమా? అని అడిగారు.  చంద్రబాబూ.. అసలు మీ పార్టీ వైఖరేంటి? అని ప్రశ్నించారు. ఇల్లు గడవకపోయినా సీమాంధ్ర ప్రజలు రోడ్డపైకి వచ్చి ఉద్యమం చేస్తున్నారు. సీమాంధ్ర ప్రజల ఆవేశాన్ని అర్ధం చేసుకోవాలన్నారు. తన విధానాలతో చంద్రబాబు సీమాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబూ.. మీ అనుభవమంతా ఏమైంది? అని అడిగారు. మీ అనుభవమంతా కుట్రలు చేయడానికి ఉపయోగపడుతుందని విమర్శించారు. మీ అనుభవమంతా ఉపయోగించి విభజన ఆపండని శోభానాగిరెడ్డి కోరారు.

చంద్రబాబు తన అనుభవాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలు బయటకు రాకుండా ఎలా చూడాలి... ఎలా ఇబ్బంది పెట్టాలి  అని చూస్తున్నారనీ, కానీ ఆయన తన అనుభవాన్ని తెలుగు ప్రజల ప్రయోజనాలను ఎలా కాపాడాలి అనే అంశానికి ఉపయోగించాలనీ హితవు పలికారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చామని చెబుతున్న చంద్రబాబు నదీ జలాలలు, తదితర అంశాలను ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీలు ఆడుతున్న వీధి నాటకాలను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం నాడు కేంద్ర మంత్రి కావూరిని అడ్డుకోవడం దీనికి పరాకాష్ట అన్నారు. తెలంగాణపై ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కు తీసుకునే వరకూ ఇలాంటి నాటకాలు ఆడద్దనీ, ఒకవేళ ఆడినా ప్రజలు సహించరనీ స్పష్టంచేశారు. ఈ దీక్షలు, ధర్నాలు, అడ్డుకోవడాలు.. చంద్రబాబు ఇంటిముందు చేయాలని సూచించారు. సీమాంధ్రలో ఉద్యమిస్తున్న వారికి ఎలాంటి స్వప్రయోజనాలు లేవన్నారు.

తాజా వీడియోలు

Back to Top