'రైతుల జోలికి వస్తే సహించం'

వైఎస్సార్ సీపీ రాజధాని రైతు హక్కుల కమిటీ హెచ్చరిక
గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న నేతలు


తాడేపల్లి: రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో భూములు ఇవ్వాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని రాజధాని రైతులు, కౌలు రైతులు, కూలీల హక్కుల పరిరక్షణ కమిటీ పునరుద్ఘాటించింది. రాజధాని ప్రాంతంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన హక్కుల కమిటీ సభ్యులు శుక్రవారం ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉండవల్లి రామాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న తంతుపై వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి వద్ద పూర్తి సమాచారం ఉందనీ, తాము కూడా భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నామని చెప్పారు. విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద రైతులతో భారీ ధర్నా నిర్వహించేందుకు వ్యూహ రచన చేస్తున్నామని తెలిపారు. అనంతరం పెనుమాక రామాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ రెండో పంటకు రుణాలు మంజూరు చేయవద్దని బ్యాంకర్లను కలెక్టర్ ఆదేశించడం న్యాయం కాదని మండిపడ్డారు.

రైతులు ధైర్యంగా రెండో పంట వేసుకోవచ్చని, అవసరమైతే న్యాయపోరాటానికి వైఎస్సార్ సీపీ ముందుంటుందని చెప్పారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు(నాని) మాట్లాడుతూ రైతుల భూములను సొమ్ము చేసుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంత రైతులు, పేదల జీవితాలపై ప్రభుత్వం కక్ష కట్టిందని, బెదిరించైనా బలవంతంగా భూ సమీకరణకు పాల్పడుతుందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి  రాజశేఖర్, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, పార్టీ నేతలు మేరుగ నాగర్జున, దొంతిరెడ్డి వేమారెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, బండారు సాయి బాబు, తాడేపల్లి మండల ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి, మున్సిపల్ చైర్ పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి పాల్గొన్నారు.
Back to Top