నోటా ఓట్లు కూడా రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా?

క‌డ‌ప ఎన్నిక‌ల ప్ర‌చారంలో  సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

వచ్చే ఎన్నికలు అయిదేళ్ల భవిష్యత్తును నిర్ణయించేవి.

 మరో మూడు రోజుల్లో బ్యాలెట్‌ బద్దలు కొట్టడానికి సిద్ధమా?

 రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకొచ్చాం

వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్‌ నొక్కాడు.

అక్కాచెల్లెమ్మలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు.

అక్కాచెల్లెమ్మల కోసం ఆసరా, సున్నావడ్డీ,చేయూత.కాపు నేస్తం, ఈబీసీ నేస్తం

 పెట్టుబడి సాయంతో రైతన్నకు తోడుగా ఉన్నాం

 ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్‌

 14 ఏళ్లు సీఎంగా చేశానని చెప్పుకునే చంద్రబాబు ఏం చేశాడు?

 చంద్రబాబుది ఊసరవెళ్లి రాజకీయం 

ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారు.

ఆరునూరైనా ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందే. 

మైనార్టీల మనోభావాలకు అండగా మీ బిడ్డ తోడుగా ఉంటాడు.

మైనార్టీ సోదరి శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా కూడా ఉంది.

175 స్థానాల్లో మైనార్టీలకు ఏడు అసెంబ్లీ స్థానాలు ఇచ్చాం.

 కడప రాజకీయాల్లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు
 
వైయ‌స్ఆర్ చనిపోయిన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందులు పెట్టింది.

వైయ‌స్ఆర్ జిల్లా: నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన ద్రోహులతో ప్రజలు జతకట్టాలా? అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌శ్నించారు. రాజకీయంగా వైయ‌స్ఆర్‌  కుటుంబాన్ని అణగదొక్కాలని దేశంలోని అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి అదే కాంగ్రెస్‌, అదే టీడీపీతో కలిసిపోయి వైయ‌స్ఆర్‌ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్ర జరుగుతోంద‌న్నారు. వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి నాకన్న 13 ఏళ్లు చిన్నవాడు . ఈయన భవిష్యత్తును నాశనం చేయడానికి ఈనాడు, చంద్రబాబు, ఆంధ్రజ్యోతి నుంచి కుట్రలు వేస్తున్నారు. వీళ్లంతా మనుషులేనా? అని ప్ర‌శ్నించారు. అవినాష్‌ ఎలాంటి వాడో నాకు, మీ అందరికి తెలుసు. గొప్ప మెజార్టీతో గెలిపించాలని సీఎం వైయస్ జ‌గ‌న్ కోరారు. శుక్ర‌వారం సాయంత్రం క‌డ‌ప న‌గ‌రంలోని ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమ‌న్నారంటే..

 

 

కడప...సిద్ధమా...!!

మీ ప్రేమానురాగాలకు కృతజ్ఞుడిని*

ఈ గడ్డ మీదకు నేను ఎప్పుడు వచ్చినా కూడా...మీ చిక్కటి చిరునవ్వుల మధ్య ఎప్పుడు నిలబడ్డా కూడా...మీ ఆప్యాయతలకు, మీ ప్రేమానురాగాలకు...మీ బిడ్డ ఎప్పటికీ కూడా రుణపడి ఉంటాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

చెరగని చిరునవ్వులతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ, ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తూ, చెరగని చిరునవ్వులతో ఇంతటి ఆత్మీయతను పంచిపెడుతున్న నా ప్రతి అక్కకూ,ప్రతి చెల్లెమ్మకు,నా ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, నా ప్రతి సోదరుడికీ,ప్రతి స్నేహితుడికీ ముందుగా మీ బిడ్డ ..మీ జగన్ రెండు చేతులూ జోడించి...పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాడు. 

 

 

*బ్యాలెట్ బద్దలు కొడదాం.*

మరో 3 రోజుల్లో బ్యాలెట్‌ బద్దలు కొట్టడానికి సిద్ధమా? జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటం. ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని ఆయన మేనిఫెస్టోలకు అర్థం. చంద్రబాబుకు ఓటు వేయడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమే అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. 

 

 

*మేనిఫెస్టోకు అర్థం చెబుతూ..*

ఈరోజు నేను 4 విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. మీ బిడ్డ రాకమునుపు వరకూ కూడా ఎన్నికలు వచ్చేసరికి ఒక మేనిఫెస్టో అంటూ రాజకీయపార్టీలు ఇచ్చేవారు. రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ, పేదలతో ఆడుకునే కార్యక్రమం,ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని కార్యక్రమం, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కార్యక్రమం జరిగేది.మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ... ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో విశ్వసనీయత అనే పదానికి అర్థం తీసుకు వచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అంటే అది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి గర్వంగా ఉంది. 

 

*99 శాతం హామీల అమలు చేస్తూ..*

మొట్టమొదటిసారిగా... దేశచరిత్రలో కూడా బహుశా ఎప్పుడూ జరక్క పోయి ఉండొచ్చు. రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఏకంగా  99శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి, ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్‌గా, ఒక బైబిల్‌గా భావిస్తూ, 99శాతం హామీలు అమలు చేసి, ఆ అమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కచెల్లెమ్మల ఇంటికి పంపించి, వారి ఆశీస్సులు తీసుకుంటున్న ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 

 

 

*ఉద్యోగాల విప్లవం తెచ్చాం*

మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా, ఏకంగా 2.31 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు అందించాం. రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు ఉన్న మొత్తం ఉద్యోగాలు 4 లక్షలు అయితే..మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక  ఈ 59 నెలల కాలంలో ఓ చరిత్ర సృష్టిస్తూ.. ఎప్పుడూ జరగని విధంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ అందరి ఆశీస్సులతో, దేవుడి ఆశీస్సులతో ఇవ్వగలిగాం. మన తమ్ముళ్లూ, మన చెల్లెళ్లూ 1.30 లక్షల మంది మన సచివాలయాల్లో కనిపిస్తారు. 

 

*లంచాలు, వివక్ష లేని పాలన అందిస్తూ...* 

మీ బిడ్డ రాకమునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నవాడు ఎవ్వరూ పట్టించుకున్న పరిస్థితి లేదు. మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని మీ బిడ్డ ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు, నా అక్కచెల్లెమ్మల చేతికి నేరుగా వెళ్లిపోతోంది. వివిధ పథకాలకు 130 సార్లు బటన్‌ నొక్కి నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మీ బిడ్డ తోడుగా ఉన్నాడు. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగాయా? అని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడైనా ఇలా చూసారా? అని అడుగుతున్నాను. ఇలా బటన్లు నొక్కడం, నా అక్కచెల్లెమ్మల ఖాతాలకు డబ్బు నేరుగా వెళ్లిపోవడం చూసారా? గతంలో ఎప్పుడైనా జరిగిందా?

 

 

*విద్యా సంస్కరణలు*

మొట్టమొదటిసారిగా, రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా  నా అక్కచెల్లెమ్మల పిల్లలు ఎలా చదువుతున్నారు? నా అక్కచెల్లెమ్మల పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఏం చేయాలి? అన్న ఆలోచనలు జరిగింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా నాడునేడుతో బాగుపడ్డ గవర్నమెంట్‌ స్కూళ్లు. గవర్నమెంటు బడులలో ఇంగ్లిషు మీడయం, 6వ తరగతి నుంచే ప్రతి క్లాస్ రూమ్‌లో డిజిటల్ బోధన, 8వతరగతికి వచ్చేసరికి పిల్లల చేతిలో ట్యాబులు, మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతిలో బైలింగ్వల్‌ టెక్స్ట్‌బుక్స్‌. అంటే ఒకపేజీ ఇంగ్లీషు, మరో పేజీ తెలుగుతో అందించాం. మొట్టమొదటి సారిగా 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫెల్ క్లాసులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు. మన పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం నుంచి మొదలుపెడితే ఐబీ వరకు ప్రయాణం. 

మొట్టమొదటి సారిగా బడులు తెరిచేసరికే పిల్లలకు విద్యాకానుక, బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లలను బడికి పంపే తల్లులను ప్రోత్సహిస్తూ గతంలో ఎప్పుడూ చూడనివిధంగా ఓ అమ్మఒడి. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా పెద్ద చదువులకు పూర్తి అండనిస్తూ, ఏ పిల్లాడి తల్లిదండ్రులు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఏ తల్లీతండ్రీ తమ పిల్లల కోసం, వారి చదువులకోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకు, డాక్టర్‌ చదువుతున్న పిల్లలకు, డిగ్రీలు చదువుతున్న పిల్లలకు ఈరోజు రాష్ట్రంలో   93 శాతం పిల్లలు పూర్తి ఫీజ్‌ రీయంబర్స్మెంట్‌తో జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెనను ఈరోజు నా అక్కచెల్లెమ్మలకు అందిస్తున్నాం.

 

మొట్ట మొదటిసారిగా పెద్ద చదువులల్లో, డిగ్రీలల్లో ఇంటర్నేషనల్‌ యూనివర్సిటీలతో ఆన్‌లైన్‌ సర్టిఫైడ్ కోర్సులు ఈరోజు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారిగా ఈరోజు డిగ్రీల్లో మాండేటరీ ఇంటర్న్‌షిప్‌ తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని అడుగుతున్నాను.

 

 

*అక్కచెల్లెమ్మలకు తోడుగా,అండగా...*

గతంలో ఏ ప్రభుత్వం కూడా అక్కచెల్లెమ్మలు ఎలా ఉన్నారు, వారి కుటుంబాలు ఎలా ఉన్నాయని ఏరోజూ ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారిగా చరిత్రను మారుస్తూ, నా అక్కచెల్లెమ్మలకు అండగా, తోడుగా...నా అక్కచెల్లెమ్మలకు ఓ ఆసరా..ఓ సున్నా వడ్డీ, ఓ చేయూత, ఓ కాపునేస్తం, ఓ ఈబీసీ నేస్తం..నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌. అందులో కడతూ ఉన్నా 22 లక్షల ఇళ్ల నిర్మాణం. ఇంతగా అక్కచెల్లెమ్మలను పట్టించుకుని, వారి కోసం ఇన్నిన్ని పథకాలు తీసుకువచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? గతంలో ఈ పథకాలు ఉన్నాయా? 

 

రైతన్నలకు అండగా ఉంటూ పెట్టుబడి కోసం సహాయంగా రైతుభరోసా. ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్‌ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటిపూటే 9 గం.ల నాణ్యమైన ఉచిత విద్యుత్‌. గ్రామంలో రైతన్నను చేయిపట్టి నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థ. ఇన్నిన్ని పథకాలతో రైతన్నను చేయి పట్టి నడిపించే కార్యక్రమం గతంలో జరిగిందా?

 

*శ్రమజీవుల స్వయం ఉపాధికి అండగా*

స్వయం ఉపాధికి అండగా...ఎప్పుడూ రాష్ట్రంలో చూడని విధంగా...సొంత ఆటోలు, టాక్సీలు నడిపుకుంటున్న నా డ్రైవర్ అన్నదమ్ములకు తోడుగా వాహనమిత్ర, నేతన్నలకు ఓ నేతన్ననేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా అందిస్తున్నాం.ఎప్పుడైనా ఫుట్‌పాత్‌ మీద అమ్ముకుంటున్నవారి జీవితాలు ఎలా ఉన్నాయి..వారికేదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా? పుట్ పాత్‌ల మీద కూరగాయలు అమ్ముకుంటున్న నా అన్నదమ్ములు, నా చెల్లెమ్మలు, ఫుట్‌ పాత్‌ మీద ఇడ్లీలు వేసుకుంటున్న నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు...అటువంటి శ్రమజీవులకు, కష్టజీవులకు ఒక తోడు, ఒక చేదోడు. లాయర్లకు కూడా ఒక లా నేస్తం. టైలర్లకు, రజకులకు, నాయీబ్రాహ్మణులకు అందరికీ అండ. స్వయం ఉపాధికి ఇంత తోడుగా ఉండి ఇన్నిన్ని పథకాలు తెచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? గతంలో ఈ పథకాలన్నీ ఉన్నాయా? అని అడుగుతున్నాను. 

 

 

*పేదవాడి ఆరోగ్యానికి అండగా ఉచితంగా రూ.25 లక్షల వరకు విస్తరించిన ఆరోగ్యశ్రీ*

వైద్యం అందని పరిస్థితిలో ఏ పేదవాడు ఉండకూదు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికీ రాకూడదు. ఇంత తపన తాపత్రయం పడుతూ ఈ 59 నెలల కాలంలో.. విస్తరించిన ఆరోగ్యశ్రీ. ఏకంగా రూ.25 దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ. పేదవాడికి ఆపరేషన్ తర్వాత కూడా పేదవాడు ఇబ్బంది పడకూడదని రెస్ట్ పీరియడ్‌లో కూడా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా, గ్రామంలోనే  విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ.. అన్నా, అక్కా మీ ఆరోగ్యం బావుందా అని అడుగుతూ...టెస్టులు చేస్తూ, మందులు ఇస్తూ ఇంటికే ఆరోగ్య సురక్ష.. ఇంతగా పేదవాడి ఆరోగ్యం మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా? అని అడుగుతున్నాను. 

 

*గ్రామ స్వరాజ్యం మన ప్రభుత్వంతోనే సాధ్యం*

ఏ గ్రామానికి వెళ్లినా ఆ గ్రామంలో 600 రకాల సేవలందిస్తున్న గ్రామ సచివాలయం. అదే గ్రామంలో 60-70 ఇళ్లకు ఇంటికే వచ్చి సేవలందించే వాలంటీర్ వ్యవస్థ..... అదే గ్రామంలోనే ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా అవ్వాతాతలకు ఇంటికే అందుతున్న పెన్షన్‌, ఇంటివద్దకే రేషన్‌, ఇంటివద్దకే పథకాలు. ఇంటి వద్దకే పౌరసేవలు. అదే గ్రామంలో రైతన్నను చేయిపట్టుకుని నడిపిస్తూ ఆర్బీకే వ్యవస్థ, మరో నాలుగు అడుగులు వేస్తే ఓ విలేజ్ క్లినిక్, మరో నాలుగు అడుగులు వేస్తే నాడు నేడుతో బాగుపడ్డ ఓ ఇంగ్లిషు మీడియం బడి, అదే గ్రామంలోనే ఫైబర్ గ్రిడ్, నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఓ మహిళా పోలీస్‌. అదే గ్రామంలోనే  నా అక్కచెల్లెమ్మల ఫోన్‌లో ఆపదలో ఉంటే చాలు ఒక్క బటన్‌ నొక్కితే చాలు ఒక దిశా యాప్.. ఆ బటన్ నొక్కిన వెంటనే, పదినిమిషాల్లో పోలీసు సోదరుడు వచ్చి అక్కా ఏం అయింది అని అడుగుతున్న పరిస్థితి. నేను అడుగుతున్నాను.  ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? ఇలా లంచాలు వివక్ష లేని పాలన ఎప్పుడైనా జరిగిందా? ఇంటికే వచ్చే పెన్షన్‌, ఇంటికే వచ్చే పథకాలు, ఇంటికే వచ్చే పౌరసేవలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. 

 

 

*కుల,మత,ప్రాంతం, పార్టీలకతీతతంగా- పేదరికాన్ని దూరం చేయడమే లక్ష్యంగా*

మీ బిడ్డ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వం. ఏనాడైనా కూడా మీ బిడ్డ ఏమి చెబుతూ వచ్చాడు...ఏం చేస్తూ వచ్చాడు అంటే..మీ బిడ్డ పేదవాడిని పేదవాడిగానే చూసాడు. ఏ రోజూ పేదవాడి కులం అడగలేదు, మతం అడగలేదు, పేదవాడి విషయంలో రాజకీయాలు చూడలేదు..మీరు ఏ పార్టీకి ఓటు వేసారు అని మీ బిడ్డ పాలనలో ఎప్పుడూ కూడా అడగలేదు. మీ బిడ్డ ప్రతి పేదవాడిని ఆ పేదరికం నుంచి బయటకు ఎలా తీయాలా అని బయటకు ఎలా అడుగులు వేయించాలని ఆలోచన చేసి, ఆ పేదవాడి భవిష్యత్తు కోసం అడుగులు పడింది కేవలం ఈ 59 నెలల కాలంలోనే అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

 

 

*బాబుది ఊసరవెల్లి రాజకీయం.*

మరోవంక చంద్రబాబు రాజకీయం చూడండి. చంద్రబాబు రాజకీయాల్లో ఊసరవెల్లి రాజకీయం కనిపిస్తుంది. ఈ చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీతో జతకడతాడు. మరోపక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు దొంగ ప్రేమ చూపిస్తూ డ్రామాలు మొదలుపెడతాడు. మరో పక్క 4శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న అదే ఎన్డీయేలో కొనసాగుతాను అంటాడు. నేను అడుగుతున్నాను...ఇంత దొంగ ప్రేమ చూపిస్తూ, ఇంత మోసాలు చేస్తూ ఇలాంటి దగుల్బాజీ రాజకీయాలు చేసే వ్యక్తి ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉంటారా? 

 

 

*మైనారిటీలకు అండగా.*

మీ బిడ్డ చెబుతున్నాడు..ఆరు నూరైనా సరే మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్‌ మాట. ఇది మీ వైఎస్సార్‌ బిడ్డ మాట. మరి చంద్రబాబు మోదీగారి సమక్షంలో, మోదీగారి మీటింగ్‌లో చెప్పగలడా? అని అడుగుతున్నా. మరి వారు మైనారిటీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పినా కూడా మరి ఎందుకు చంద్రబాబు ఎన్‌డీఏలో కొనసాగుతున్నాడు. మైనారిటీ రిజర్వేషన్ అంటే చాలు రాజకీయాలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరికీ అర్థం అవ్వడానికి మీ అందరి సమక్షంలో ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 

రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది కనుక ఇక్కడ నుండే చెబుతున్నాను. 4 శాతం రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కానేకావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఈ రిజర్వేషన్లు వర్తింపచేయటం లేదు. పఠాన్లుకు, సయ్యద్‌లకు, మొఘల్‌లకు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనకబాటుతనం ప్రాతిపదికగా ఇస్తున్న రిజర్వేషన్లు. అందరూ గమనించవలసినది ఏమిటీ అంటే అన్ని మతాల్లో కూడా బీసీలు ఉంటారు. ఓసీలు ఉంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడటం ధర్మమేనా? రాజకీయాల కోసం వారి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా అని అడుగుతున్నాను. 

 

అందుకే మీ బిడ్డ చెబుతున్నాడు...ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఈ 4శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కొనసాగుతాయి. ఖచ్చితంగా కొనసాగాలి. 4 శాతం రిజర్వేషన్ల విషయంలో అయినా కానీ, ఎన్‌ఆర్‌సీ విషయంలో అయినా కానీ, సీఏఏ విషయంలో అయినా కానీ ఏ విషయంలో అయినా మైనారిటీల మనోభావాలకు, వారి ఇజ్జత్‌ ఔర్ ఇమాన్‌కు అండగా, వారికి మద్దతుగా, మైనారిటీలపట్ల ప్రేమ చూపిస్తూ మీ బిడ్డ ఎప్పటికీ వాళ్లకు తోడుగా ఉంటాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

 

 

మైనారిటీలకు ప్రేమ చూపించే విషయంలో ఒక్క డీబీటీనే కాదు, ఒక్క స్కీములే కాదు, ఒక్క ఇళ్ల పట్టాలు, ఇళ్లనిర్మాణమే కాదు, షాదీతోఫా వంటివి మాత్రమే కాదు..ఉర్దూను రెండో అధికార భాషగా ప్రకటించడం మొదలు...నలుగురు మైనారిటీలను ఎమ్మెల్సీలుగా, నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలను గెలిపించుకోవడం మాత్రమే కాదు, ఐదేళ్లుగా నా మైనారిటీ సోదరుడు ఉపముఖ్యమంత్రిగా నా పక్కనే ఉన్నాడు. నా మైనారిటీ సోదరి కూడా శాసన మండలి ఉపాధ్యక్షురాలిగా ఉంది. నా అక్క, నా తల్లి లాంటిది శాసనమండలి ఉపాధ్యక్షురాలిగా  ఉంది. మైనారిటీ సబ్‌ ప్లాన్‌ బిల్లు తేవడం మొదలు..ప్రతి సందర్భంలో కూడా వారికి సముచిత స్థానం ఇస్తున్నాం. ఆ దివంగత నేత మన ప్రియతమ నేత రాజశేఖర్‌ రెడ్డిగారు, నాన్నగారు.. మైనారిటీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చి అడుగులు ముందుకు వేస్తే...ఆయన బిడ్డ మీ జగన్ మరో నాలుగు అడుగులు ముందుకు వేసి మన రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలుంటే అందులో 7 ఎమ్మెల్యే స్ధానాలు మైనార్టీలకు ఇవ్వడం ద్వారా.. ఈరోజు వారికి 4 శాతం రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇచ్చినట్టయింది. అలా ఇచ్చిన పార్టీ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గర్వంగా చెబుతున్నాను.  

 

*బలహీన వర్గాల ఆత్మ స్థైర్యాన్ని పెంచుతూ*

నేను ప్రతి సందర్భంలో నా ఎస్సీలు, ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని ఎందుకు అంటానో తెలుసా...ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎప్పుడైతే ఇంత బాహాటంగా నా..నా...నా అంటూ పిలుచుకుంటూ...బలహీన వర్గాల మీద ప్రేమ చూపిస్తాడో... అప్పుడు ఆ బలహీన వర్గాలకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా వాళ్లకు గౌరవం, ఆత్మగౌరవం, ఆత్మ స్థైర్యం పెరుగుతుంది. అది జరగాలి అన్న తపన తాపత్రయంతోనే మీ బిడ్డ ఒక యజ్ఞాన్ని చేసాడు. 

 

 

*నాకు అండగా నిలబడ్డ నా కడపగడ్డ...*

ఈరోజు కడప జిల్లా రాజకీయాలు కాబట్టి...ఇక్కడ ఏం జరుగుతోందో మీ అందరికీ తెలుసు కాబట్టి. మరొక్క విషయం కూడా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. కడప జిల్లాలో ఉన్నంత రాజకీయ చైతన్యం ఆంధ్రరాష్ట్రంలో బహుశా అతికొద్ది జిల్లాలకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నాకు బాగా గుర్తుంది. నాన్నగారు చనిపోయిన తర్వాత...కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా ఇబ్బందులు పెట్టిందో..ఆ ఇబ్బంది పెట్టే సమయంలో మీ బిడ్డ ఇదే కడప గడ్డమీద నుంచి ఇండిపెండెంట్ గా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి, సింబల్ కూడా రానప్పుడు...కేవలం 14 రోజులు మాత్రమే ఆ సింబల్ వచ్చిన పరిస్థితులు ఉన్నప్పుడు...ఇదే గడ్డ మీద మీ బిడ్డతో మీరు నిలబడి మీరు 5,45,000 మెజారిటీ ఇచ్చారు.

మీరు ఇచ్చిన ఆ మెజారిటీతో మీ బిడ్డ ఆరోజు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే పార్లమెంట్‌ భవనంలో ఉన్న ప్రతి తలకాయి కూడా ఎవరీ జగన్‌ అని చెప్పి చూసారు. అంతటి చైతన్యం ఉన్న జిల్లా నా కడప.... ఇటువంటి కడప రాజకీయాన్ని, మన ప్రజల ప్రయోజనాలను, వైఎస్సార్ మీద అభిమానం ఉన్న మన ప్రజలు నిర్ణయించాలా? లేక వైఎస్సార్‌ అనే పేరే కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వైఎస్సార్‌ శత్రువులు చేయాలా? అన్నది మీరంతా ఆలోచన చేయాలని కోరుతున్నాను.

నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలతో, రాష్ట్ర విభజన చేసిన దుర్మార్గులతో మన ప్రజలు జత కట్టాలా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రాజకీయంగా వైఎస్సార్‌ కుటుంబాన్ని అణగదొక్కాలని...దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి...మీ బిడ్డ మీద ప్రయోగించిన వారితో కలిసిపోయి..అదే కాంగ్రెస్‌తో, అదే టీడీపీతో కలిసిపోయి, ప్రత్యక్షంగా ఒకరితోనూ, పరోక్షంగా ఇంకొకరితోనూ కలిసిపోయి..వైఎస్సార్ అనే పేరే కనపడకుండా చేయాలనే కుట్రలో వీరందరూ క్రియాశీలంగా పాత్ర పోషిస్తుంటే...ఇలాంటి వాళ్లా వైఎస్సార్ వారసులు అని ఒక్క సారి మీరందరూ ఆలోచన చేయమని కోరుతున్నాను. 

 

 

*దుర్మార్గంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు.*

వైఎస్సార్‌ మరణం తర్వాత ఆయన పేరును, ఆ రెప్యుటేషన్‌ను సమాధి చేయాలని చూసిన పార్టీ, ఆయన పేరును ఛార్జ్‌ షీట్‌లో పెట్టిన పార్టీ, ఆయన కొడుకును అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టారు...నా 16 నెలలు నాకు ఎవరు ఇస్తారు...ఇంత అన్యాయంగా జైల్లో పెట్టిన పార్టీ...ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం మరింత బరితెగించి...ఆ ఛార్జ్‌షీట్‌లో నాన్నగారి పేరును మనంతట మనమే పెట్టించామట...ఇంతటి దుర్మార్గంగా ఆలోచన చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు అంటే...అసలీ పార్టీకి మానవతా విలువలు ఉన్నాయా? అసలు ఈ పార్టీకి కృతజ్ఞత అనే పదానికి అర్థం తెలుసా అని అడుగుతున్నాను.

ఇప్పుడు ఇన్నాళ్లకట...ఇన్ని సంవత్సరాలకు..నాన్న చనిపోయింది 2009 ఆ తర్వాత...ఆ కుటుంబాన్ని వాళ్లు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మీ అందరికి తెలుసు.  

ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు నాన్న సమాధి దగ్గరకి వస్తారట...ఇడుపులపాయ దగ్గరకు వస్తారట. చూడటానికి వస్తారట...ఢిల్లీ నుంచి వస్తారట..ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్నికల వేళ వస్తారట..ఎన్నికల కోసం వస్తారట...ఆలోచన చేయమని అడుగుతున్నాను.ఆ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వైఎస్సార్‌ గారి అభిమానులు ఏనాడో సమాధి కట్టారు. కాంగ్రెస్‌కి ఓటు వేస్తే ప్రతి ఓటూ మనంతట మనమే వైఎస్సార్‌ గారి పేరు కనపడకుండా చేసే కుట్రలో భాగస్తులం అయినట్టే. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే మన కళ్లను మనమే పొడుచుకున్నట్టు కాదా అని అడుగుతున్నాను. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ఆ నోటు నేరుగా మన ఓట్లను చీల్చి టీడీపీని, ఎన్‌డీఏని గెలిపించడం కాదా అని అడుగుతున్నాను. 

ఈరోజు ఎందుకు వీళ్లు ఎన్నికల వేళ మన రాష్ట్రానికి వచ్చారు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. చంద్రబాబును గెలిపించడం కోసం ఏ రకంగా కుట్రలు జరగుతున్నాయన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతున్నాను. చంద్రబాబును గెలిపించడం కోసం మన ఓట్లను చీల్చడం కోసం ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రరాష్ట్రంలో రంగప్రవేశం చేసింది అంటే చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉన్నాయని ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను. ఇదే చంద్రబాబు మనిషి రేవంత్‌ రెడ్డి. ఇదే రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి. ఒకవైపున పట్టపగలు బీజేపీతో కాపురం చేస్తాడు, రాత్రి పూట కాంగ్రెస్‌తో కాపురం చేస్తాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో ఆలోచన చేయండి. 

 

నాన్నగారు బ్రతికున్నప్పుడు ఆయన ఎవరితో అయితే విబేధించాడో, ఎవరితో అయితే యుద్ధం చేసాడో, నాన్నగారే కాదు...నాన్నను అభిమానించే ప్రతి కార్యకర్తా...ఎవరితో అయితే యుద్ధం చేసాడో..ఇవాళ వైఎస్సార్‌ వారసులు అని చెప్పుకుంటున్న వాళ్లు అదే ఈనాడుతో, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతోనూ, చంద్రబాబుతోనూ చెట్టాపట్టాలు వేసుకుని, ఈరోజు వాళ్లను గెలిపించడం కోసం మన ఓట్లను విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఇంతకంటే హేయమైన రాజకీయాలు రాష్ట్ర చరిత్రలో ఉంటాయా అన్నది ఆలోచన చేయమని అడుగుతున్నాను. 

మరో విషయం కూడా చెబుతున్నా...

నా పక్కన అవినాష్‌ ఉన్నాడు. మాకన్నా చాలా చిన్నపిల్లోడు. నాకన్నా 13 ఏళ్ల చిన్నపిల్లోడు. మనందరికన్నా చిన్నోడు..ఈ పిల్లోని జీవితం నాశనం చేయడం కోసం..చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి కుట్రలు పన్నుతున్నారు..ఈనాడు నుంచి, ఆంధ్రజ్యోతి, టీవీ 5 నుంచి కుట్రలు పన్నుతున్నారు. వీళ్లందరి కుట్రల్లో భాగంగా కడప జిల్లాలో ఒక రాజకీయ వాక్యూమ్‌ క్రియేట్‌ చేయాలని..ఆ రాజకీయ వాక్యూమ్‌లోకి వాళ్లు రావాలని...ఈరోజు కుట్రలు పన్నుతూ ఈ పిల్లాడి జీవితం నాశనం చేయడానికి ఇన్నిన్ని అడుగులు వేస్తాఉన్నారంటే వీళ్లంతా మనుషులేనా అని మీ అందరి సమక్షంలో అడుగుతున్నాను. అవినాష్‌ ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు. అవినాష్‌ ఎలాంటివాడో నాకూ తెలుసు. అవినాష్‌ మీద నాకు నమ్మకం ఉంది...అవినాష్ మీద మీ అందరికీ నమ్మకం ఉంది. అవినాష్‌కు గొప్ప మెజారిటీతో గెలిపించమని మీ అందరినీ కోరుతున్నాను. 

 

రాజకీయాలు దిగజారిపోయాయి. రాజకీయాల్లో మోసాలు, కుట్రలు ఎక్కువైపోయాయి. 

 

*చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దామా?*

14 సంవత్సరాలు, 3 దఫాలు సీఎంగా చేసాను అంటాడు చంద్రబాబు.మరి నేను అడుగుతున్నాను..

చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్క స్కీమ్‌గానీ, ఒక్క మంచికానీ గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. 

 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సార్లు సీఎం అని చెప్పుకుంటున్న వ్యక్తి ఆయన పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన ఒక మంచి గానీ, ఆయన చేసిన ఒక స్కీమ్ గానీ ఏ పేదవాడికి కూడా గుర్తుకు రావడం లేదంటే ఆయన పాలన ఎలాంటిదో ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను.

 

అధికారం వచ్చేదాకా అబద్ధాలు, అధికారం వచ్చేదాకా మోసాలు. అధికారం ఒక్కసారి దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఇది చూడమని అడుగుతున్నా (టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ). 2014లో మీ అందరికీ పంపిన ఈ పాంప్లెట్‌ చూస్తే మీ అందరికీ అర్థం అవుతుంది. గుర్తుందా ఈ పాంప్లెట్‌ 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి, కూటమిలో ఉన్న ముగ్గురి ఫొటోలూ పెట్టుకుని, ఎన్నికలకు ముందు ముఖ్యమైన హామీలు అంటూ మీ ప్రతి ఇంటికీ పంపాడు ఈ పాంప్లెట్‌. అప్పట్లో మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఈనాడు చూసినా, ఆంధ్రజ్యోతి చూసినా, టీవీ5 చూసినా అక్కడ వాళ్లు చేసిన అడ్వర్టైజ్‌‌మెంట్లు మీ అందరికీ గుర్తున్నాయా...ఊదరగొట్టేశారు అడ్వర్టైడ్ మెంట్లలో...ప్రజలు చంద్రబాబు మాట నమ్మారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబుకు అధికారం ఇచ్చారు.  2014 నుంచి 2109 వరకు మధ్య ముఖ్యమంత్రి అయిన ఈ చంద్రబాబు ఆయన స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి... కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని మీ బిడ్డ అడుగుతున్నాడు. ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన వాటిలో ఒక్కటైనా కూడా చేశాడా? లేదా? అన్నది మీరే చెప్పండి.

 

 

*చంద్రబాబు విఫల హామీలు.*

మొదటిది.. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ఈ పెద్దమనిషి చంద్రబాబు. నేను అడుగుతున్నాను రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేసాడా? రెండో హామీ.. పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు. చంద్రబాబు హయాంలో రూ.14,205 కోట్ల పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ అయ్యిందా? 

 

మూడో హామీ, అక్కా మూడో హామీ కూడా ఆడవాళ్లదే. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25వేలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఒక్కరికైనా ఒక్క రూపాయైనా మీ బ్యాంకుల్లో వేశాడా? అని అడుగుతున్నాను.

 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, అంటే ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా ?. 

 

అర్హులందరికీ మూడు సెంట్లు స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు ఇస్తామన్నారు. మూడు సెంట్లు స్థలం కథ దేవుడెరుగు, ఇక్కడ ఇన్ని వేలమంది ఉన్నారు కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు.

 

 

ఏటా రూ.10 వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలుమాఫీ అన్నాడు. ఉమెన్ ప్రొటెక్షన్ పూర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు.  సింగపూర్ ని మించి అభివృద్ధి చేస్తామన్నాడు. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తా అన్నాడు. ఇవన్నీ చంద్రబాబు అన్నమాటలు. ఇందులో చెప్పనవాటిలో ఒక్కటంటే ఒక్కటైనా అమలు అయ్యాయా అని అడుగుతున్నాను. ఇలాంటి వాళ్లను నమ్మచ్చా? 

 

 

మరి ఏమంటున్నారు వీళ్లు ముగ్గురూ ఇప్పుడు...ఇప్పుడు ఇదే ముగ్గురు కలిసి ఏమంటున్నారు...సూపర్ సిక్స్ అంటున్నారు నమ్మొచ్చా? సూపర్ సెవెన్ అంటున్నారు... నమ్మొచ్చా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తానంటున్నారు. నమ్ముతారా? ఇలాంటి వాళ్లతో యుద్ధం చేస్తున్నాం...అందుకే ఆలోచన చేయమని అడుగుతున్నాను.

 

 

*పేదల భవిష్యత్ బాగుండాలంటే ఫ్యాను గుర్తుకే ఓటేయండి.*

మీ అందరికీ మళ్లీ చెబుతున్నాను.వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్లీ ఇంటికే రావాలన్నా... బటన్లు నొక్కిన సొమ్ము మళ్లీ అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి రావాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా..పథకాలన్నీ కొనసాగాలన్నా..పేదవాడి భవిష్యత్ మారాలన్నా, మన పిల్లల బడులు, చదువులూ బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పటళ్లు మెరుగుపడాలన్నా...ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాను మీద నొక్కాలి. రెండు బటన్లు నొక్కి 175కి 175 అసెంబ్లీ స్ధానాలు, 25కి 25 ఎంపీ స్ధానాలు ఒక్కటి కూడా తగ్గేందుకే వీలు లేదు. సిద్ధమేనా?

 

ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే.. మన గుర్తు ఫ్యాన్‌. మంచి చేసిన ఈ ఫ్యాను ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్‌లోనే ఉండాలి.

 

నా పక్కన మన ఎమ్మెల్యే అభ్యర్థిగా అంజాద్ భాయ్ నిలబడుతున్నాడు. మళ్లీ పేదవాడి భవిష్యత్‌ కోసం మళ్లీ మన పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని చూడండి. మీ అందరికీ మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు. 

నా పక్కనే అవినాష్ ఉన్నాడు. నా తమ్ముడు. యువకుడు, ఉత్సాహవంతుడు. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వీరిపై  ఉంచవలిసిందిగా మీబిడ్డ సవినయంగా...పేరుపేరునా ప్రార్థిస్తున్నాడు అని తెలియజేస్తూ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్ తన ప్రసంగం ముగించారు.

Back to Top