తుర‌క‌పాలెం మృతుల కుటుంబాల‌కు కోటి చొప్పున‌ ప‌రిహారం ఇవ్వాలి

గుంటూరు :  అంతుచిక్క‌ని వ్యాధితో అకాల‌మ‌ర‌ణం పొందుతున్న తుర‌క‌పాలెం బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్కరికి  కోటి రూపాయలు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. గుంటూరు రూరల్ మండలం తురకపాలెం లో వరుస మరణాలపై గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్  అన్సారియాను ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి,  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు క‌లిశారు. అనంత‌రం మీడియాతో ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ..తురకపాలెం లో ఐదు నెలల నుంచి వరుస మరణాలు జరుగుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. తురకపాలెం లో తాగునీరు కలుషితం అయింద‌ని, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక నిధులు కేటాయించి తురకపాలానికి మంచినీటి సరఫరా చేయాల‌న్నారు. ఏ కార‌ణాల చేత మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయో ఇంత‌వ‌ర‌కు ప్ర‌భుత్వం గుర్తించ‌క‌పోవ‌డం దారుణమ‌ని మండిప‌డ్డారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ..గుంటూరు న‌గ‌రాన్ని ఆనుకుని ఉన్న తురకపాలెంలో కలుషిత నీరు వల్ల 45 మంది చనిపోయారని, ఇటీవ‌ల మ‌రో  మహిళ మృతి చెంద‌డం బాధాక‌ర‌మ‌న్నారు.  వరుస మరణాలు సంభవిస్తున్నా..ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్లు కూడా లేద‌ని ధ్వ‌జ‌మెత్తారు . క‌లెక్ట‌ర్‌ను క‌లిసిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మొండితోక జగన్ మోహన్ రావు, ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ త‌దిత‌రులు ఉన్నారు.

Back to Top