కొనసాగుతున్న టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి దాష్టీకం 

వెన్నపూసపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడి.. వాహనాలకు నిప్పు, కార్ల అద్దాలు ధ్వంసం

అనంతపురం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా యల్లనూరు మండలం వెన్నపూసపల్లిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై దాడులకు పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో రామేశ్వర్‌రెడ్డి, మల్లాగుండ్ల పెద్దిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఒక బొలెరో వాహనానికి నిప్పు పెట్టడంతో పాటు రెండు కార్ల అద్దాలను ధ్వంసం చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన జేసీ వర్గీయులు ఈ దాడులకు పాల్పడ్డారు. 

ఇదే సమయంలో యాడికి మండల కేంద్రంలోనూ జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయులు బీభత్సం సృష్టించారు. వైయ‌స్ఆర్‌సీపీ నేత రమేష్‌ ఇంటిపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థుల ఇళ్లలో ఫర్నీచర్‌, టీవీలను ధ్వంసం చేశారు. వరుస దాడులు, ఆస్తుల ధ్వంసంతో జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.

Back to Top