తాడేపల్లి: అధికారంలోకి వచ్చిన దాదాపు ఏడాదిన్నర తర్వాత ఉద్యోగులకు కేవలం ఒకే ఒక డిఏ ప్రకటించి, ఆర్భాటంగా ప్రచారం చేస్తూ, వారందరినీ పచ్చి దగా చేస్తున్న సీఎం చంద్రబాబు తీరుపై మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేరుగు నాగార్జున సంయుక్త ప్రకటన చేస్తూ ఏమన్నారంటే.. ఎన్నికలకు ముందు మీరు ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీలు ఏమిటి? ఇప్పుడు మీరు చేస్తున్నదేమిటి? తీపితీపి మాటలతో అరచేతిలో వారికి వైకుంఠం చూపి, తీరా ఇప్పుడు వారిని మోసం చేస్తారా? నడిరోడ్డు మీద నిలబెడతారా? ఇందుకేనా మీరు అధికారంలోకి వచ్చింది?. మంత్రివర్గ సమావేశం జరిగిన ప్రతిసారి, ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీల అమలు గురించి, వారికి చెల్లించాల్సిన బకాయిల గురించి మీ నుంచి ప్రకటన వస్తుందని వాళ్లు ఆశగా ఎదురు చూడడం, చివరకు ఉసూరు మనిపించడం మీకు అలవాటుగా మారింది. కేబినెట్ సమావేశాల్లో మీ శ్రద్ధ అంతా భూ పందేరంమీద తప్ప, ప్రజల మీద, ఉద్యోగస్తుల మీద కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ప్రజల మీద, ఉద్యోగస్తులమీద మీకున్నది కపట ప్రేమే. వారిని నమ్మించి వెన్నుపోటు పొడవటం, మీకు అలవాటే. మీరుపెట్టే బాధలు భరించలేక ఇప్పుడు వారంతా రోడ్డుమీదకు వస్తున్నారు. చంద్రబాబుగారుం మీరు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఉద్యోగులకు మీరిచ్చిన హామీలు ఏమిటో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. అందులో ఒక్కటైనా నెరవేర్చారా? అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఖఅన్నారు. మరి ఇచ్చారా? మెరుగైన పీఆర్సీ అంటూ ఊదరగొట్టారు. మరి ఆ సంగతి ఏమైంది?. నాడు మేం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించా. అంతే కాకుండా అంతే కాకుండా మా హయాంలోనే పీఆర్సీ వేసి, దానికి ఛైర్మన్‌ను కూడా నియమిస్తే, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఐఆర్ ఇవ్వకపోవడం ఒక మోసమైతే, ఉద్యోగులకు జీతాలు పెంచాల్సి వస్తుందని ఉద్దేశ పూర్వకంగా పీఆర్సీ ఛైర్మన్‌ను వెళ్లగొట్టారు. ఆ తర్వాత కొత్తగా ఎవ్వరినీ నియమించకుండా ఉద్యోగస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా వారికి పెరగాల్సిన జీతాలను కావాలనే ఆపుతున్నారు. ఉద్యోగస్తులకు ఇచ్చే అలవెన్స్ పేమెంట్స్ పెంచుతామంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఇప్పుడు దాని గురించి కూడా ప్రస్తావించడం లేదు. సీపీఎస్, జీపీఎస్ రెండింటినీ సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారం అంటూ ఎన్నికల ముందు కబుర్లు చెప్పారు. కానీ, వాటిపై ఒక్కసారి కూడా సమీక్షించలేదు. ఇప్పుడేమో సీపీఎస్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి, అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని కబుర్లు చెబుతున్నారు. మా హయాంలో సీపీఎస్‌కు ప్రత్యామ్నాయంగా జీపీఎస్ తీసుకొచ్చాం. ఇప్పుడు అదే విధానంలోకి కేంద్ర ప్రభుత్వం సహా పలు రాష్ట్రాలు వెళ్తున్నాయి. మరోవైపు ఓపీఎస్ తీసుకొస్తామని మీరు ఎన్నికల ముందు చెప్పారు. మా కంటే గొప్పగా అన్నీ చేస్తామని నమ్మించి, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయకపోగా, ఉద్యోగస్తులను త్రిశంకు స్వర్గంలోకి నెట్టారు. ఇంకా ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ మాటెత్తడం లేదు. పోలీసులకు మాత్రం ఈఎల్ ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తామంటున్నారు. మొత్తం మీద ఉద్యోగులకు బీకె ఏకంగా రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు. ఇప్పుడు ఒక్క డీఏ ప్రకటించి, దీపావళి కానుక అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగులందరినీ దగా చేస్తున్నారు. నిజానికి ఈ డీఏ కూడా గత ఏడాది జవనరి 1 నుంచి ఇవ్వాలి. మరి ఆ బకాయిల చెల్లింపుపై మీ నోటి నుంచి ఏ మాట రాలేదు. ఇది మరో మోసం. పోలీసులకు మాత్రం ఒక విడత ఈఎల్ ప్రకటించారు. అది కూడా మొత్తం ఒకేసారి కాకుండా నవంబరులో సగం, వచ్చే జనవరిలో సగం రూ.105 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పారు. ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు ఏ తేదీన జీతాలు, పెన్షన్లు ఇస్తారో తెలియడం లేదు. ప్రతినెలా జీతాల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి. కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ మేం ఉద్యోగులకు జీతాలు సకాలంలోనే ఇవ్వగలిగాం. ఆరోజు మాపై మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. ఇవాళ అలాంటి దారుణమైన పరిస్థితులు లేకపోయినా జీతాలు ఇవ్వలేకపోతున్నారు. మరోవైపు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలను వర్తింప చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీదాన్ని అమలు చేయడం లేదు. మీరు అధికారంలోకి రాగానే వాలంటీర్లకు ఇచ్చే జీతాలు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చి, కుట్రపన్ని, వారి పొట్టకొట్టి, రోడ్డు మీద పడేశారు. ఇప్పుడేమో అలాంటి వ్యవస్థ దేశంలోనే ఎక్కడా లేదని కబుర్లు చెబుతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీలో పని చేస్తున్న దాదాపు 52 వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేశాం. ఇతర శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ను కూడా మొదలుపెట్టాం. అర్హులైన 10,117 మందిని గుర్తించాం. వీరిలో 3,400 మందికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు కూడా మా హయాంలోనే ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్రక్రియలు ముగిసినా కూడా ఇప్పటి వరకు అపాయింట్ మెంట్లు ఇవ్వకుండా, వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కష్టాన్ని దోచుకునే అరాచక విధానాలకు స్వస్తి పలుకుతూ, వారి కోసం ‘ఆప్కాస్’ ను తీసుకు వచ్చి దళారీ వ్యవస్థను అంతం చేశాం. దాదాపు లక్ష మందికి సకాలానికే ఎలాంటి కత్తిరింపులు లేకుండా వారి జీతాలను, క్రమం తప్పకుండా ప్రతినెలా ఒకటోతారీఖునే ఇచ్చేవాళ్లం. ఇప్పుడు ఆప్కాస్‌ను రద్దుచేసి మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకు వస్తున్నారు. ఇంతకంటే అన్యాయం ఏముంటుంది? మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారందరికీ జీతాలు పెంచాం. మేం రాకమునుపు వరకూ, వీరి జీతాల చెల్లింపుల బిల్లు నెలకు రూ.1,100 కోట్లు అయితే, మేం వచ్చిన తర్వాత దాన్ని రూ.3 వేల కోట్లకు పెంచాం. మా ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు చేశాం. కానీ, మీరు వచ్చాక సామాన్య ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులకు ఒరగబెట్టిందేమీ లేదు. అయినా ఈరోజు కూడా గత మా ప్రభుత్వాన్ని నిందిస్తూ, బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రభుత్వ హయాంలో డీబీటీ అంటూ విపరీతంగా అప్పు చేశామని విమర్శించారు. మా హయాంలో డీబీటీ, నాన్ డీబీటీ కింద రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రజలకు అందించాం. వారి కోసం ఖర్చు చేశాం. కానీ, మీరు ఏ ఒక్క పథకం అమలు చేయకపోయినా, ఈ 16 నెలల్లోనే రూ.2 లక్షల కోట్లకు పైగా అప్పు చేశారు. కానీ, దాని గురించి మాత్రం మాట్లాడరు. సంపద సృష్టించి, పథకాలు అమలు చేస్తామన్న మీరు చేస్తోంది ఏమిటి? వారం వారం అప్పులు చేయడం తప్ప అని ఆ ప్రకటనలో మాజీ మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, మేరుగు నాగార్జున ఆ ప్రకటనలో ధ్వజమెత్తారు.