ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోమంటారా?

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరిస్తారా?

ఆర్టీసీ విలీనం, సచివాలయ వ్యవస్థలు దండుగని ఎలా మాట్లాడతారు?

సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఫైర్

కాకినాడ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు

పీఆర్సీ కమిషన్‌ కూడా వేయకుండా కూటమి సర్కార్ నిర్లక్ష్యం

రూ.31 వేల కోట్ల బకాయిల చెల్లింపులపై స్పష్టత లేదు

పెన్షన్ స్కీం కోర్ట్‌లో ఉందంటూ తప్పించుకునే కార్యక్రమం

అలవెన్స్‌ల చెల్లింపులపై ప్రకటన ఏదీ?

ఉద్యోగులను నిలువునా దగా చేస్తున్న సీఎం చంద్రబాబు

మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం

కాకినాడ: ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇచ్చి, పండుగ చేసుకోవాలంటూ సీఎం చంద్రబాబు తన అనుకూల మీడియాతో భారీ ప్రచారం చేసుకోవడం ఆయన దివాలాకోరుతనంకు నిదర్శనమని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మండిపడ్డారు. కాకినాడ క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో అన్ని వర్గాలను ఎలా మోసం చేస్తున్నారో, అలాగే ఉద్యోగులను కూడా సీఎం చంద్రబాబు దగా చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డిఏలకు గానూ ఒక్క డీఏను ప్రకటించి, ఉద్యోగులకు గొప్ప మేలు చేసినట్లుగా ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. పీఆర్సీపై కనీసం పదహారు నెలలుగా కమీషన్‌ను వేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.31 వేల కోట్ల బకాయిలను ఎప్పుడు ఇస్తారో కనీసం స్పష్టంగా ప్రకటించలేదని ధ్వజమెత్తారు. పెన్షన్‌ స్కీంపై కోర్ట్‌లో ఉందంటూ తప్పించుకునే కార్యక్రమం చేశారని, ఇన్ని మోసాలు చేసినందుకు ఉద్యోగులు సంతోషంతో పండుగ చేసుకోవాలా అని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే...

నిన్న ఉద్యోగసంఘాలతో కేబినెట సబ్ కమిటీ భేటీ తరువాత కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి థమాకా వంటి కానుకను ఇచ్చిందని ఎల్లో మీడియా పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ఈ వార్త కథనాలను చూసి నిజంగానే ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేసిందేమోనని అనుకున్నాం. కానీ వాస్తవం చూస్తే మరోసారి చంద్రబాబు పబ్లిసిటీ గిమ్మిక్కులు కనిపించాయి. ఉద్యోగులను మాయచేసి, మోసం చేసి వారికి మేలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. నాలుగు కరువుభత్యాలకు గానూ ఒక్కటి ఇచ్చి, పండుగ చేసుకోవాలని పిలుపునిచ్చారు. పండుగ వాతావరణం ఉద్యోగుల్లో మొదలయ్యిందని ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద కథనాలు రాశారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగుల వద్దకు వచ్చి, వారి కుటుంబాలతో మాట్లాడితే వారు ఎంత సంతోషంతో ఉన్నారో, ఎంతగా పండుగ చేసుకునేందుకు సిద్దంగా ఉన్నారో తెలుస్తుంది. 

 అన్ని వర్గాలను మోసం చేసినట్లే... ఉద్యోగులను దగా

ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. అన్నదాత సుఖీభవను మొదటి ఏడాది ఎగ్గొట్టారు. కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మాట తప్పరు. మొదటి విడత అంటూ అరకొర రైతులకు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. నేడు కాలేజీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడం లేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధులను బయటకు పంపుతున్న ఘటనలు అనేకం జరిగాయి. అమ్మ ఒడి కింద కూడా అరకొరగానే అమలు చేసి, గొప్పగా చెప్పుకున్నారు. ఇక విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నాడు-నేడు కింద అభివృద్ది కార్యక్రమాలను నిలిపివేశారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించేశారు. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తనకు కావాల్సిన వారికి ప్రైవేటీకరణ పేరుతో కట్టబెడుతున్నారు. 108, 104 వ్యవస్థలను నామమాత్రంగా మార్చేశారు. పీహెచ్‌సీ వైద్యులు సమ్మెలో ఉంటే, వారిని చర్చలకు పిలిచే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉద్యోగులను నిట్టనిలువునా మోసం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు నమ్మి కూటమి పార్టీలకు ఓటు వేసిన ఉద్యోగులు దగాకు గురయ్యారు. ఇంతగా హైడ్రామా చేసి, చేయని దానిని కూడా చేసేసినట్లు చెప్పుకునే ప్రభుత్వం ఎక్కడా వుండదు. ఉద్యోగులకు ఇప్పటి వరకు రూ.31 వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం బకాయిపడి ఉంది. కేవలం పోలీసులకు మాత్రమే ఈఎల్స్‌ రెండు దఫాలుగా రూ.210 కోట్లు వచ్చే ఏడాదిలోగా ఇస్తామని హామీ ఇచ్చారు. మంత్రివర్గం సమావేశం అయిన ప్రతిసారీ ఉద్యోగులు తమకు సంబంధించిన ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశగా చూస్తూ, మోసపోతూనే ఉన్నారు. ఈ రాష్ట్రంలో తమకు కావాల్సిన వారికి కారుచౌకగా భూములు కేటాయించడానికే కేబినెట్ సమావేశాలు పరిమితమవుతున్నారు. దీనిపై ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి, తప్పుడు కేసులు పెడుతున్నారు. 

 ఎన్నికల ముందు ఉద్యోగాలకు ఇచ్చిన హామీల అమలు ఏదీ?

కంట్రిబ్యూటరీ, గ్యారెంటీ పెన్షన్ పథకాన్ని పున:సమీక్షిస్తామని చెప్పారు. కానీ నేడు ఆ అంశం సుప్రీంకోర్ట్‌లో ఉంది, మేమేమీ చేయలేమని చేతులెత్తేశారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు. అందుకోస వేయాల్సిన పీఆర్సీ కమీషన్‌ను ఇంత వరకు ఎందుకు వేయలేదు. గత ప్రభుత్వం మేం నియమించిన పీఆర్సీ కమిషన్ చైర్మన్‌ను వెళ్ళగొట్టారు. కొత్త పీఆర్సీ కమీషన్‌ను వేయకుండా, పీఆర్సీని ఎలా ఇస్తారు? అలవెన్స్‌ పేపెంట్‌ల మీద సమీక్షిస్తామన్నారు. ఎక్కడైనా ఆ సమీక్ష జరిగిందా? గత అలవెన్స్ బకాయిలన్నా చెల్లించారా? పదహారునెలలుగా నేటికీ ఉద్యోగవర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఒక్క చర్య కూడా తీసుకోలేదు. నిన్న హడావుడిగా ఉద్యోగసంఘాలను పిలిపించి, కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం పెట్టి, ఒక్క డీఏను మాత్రం ప్రకటించారు. ఈ ఒక్క డీఏ కోసం కేటాయించిది ర.160 కోట్లు, కానీ ఇవ్వాల్సిన డీఏలు నాలుగు, గత ఏడాది జనవరి నుంచి డీఏలను అమలు చేయాలి. ఈ బకాయిలను ఇస్తామని కూడా చెప్పలేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జీపీఎస్, జీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ తదితర బకాయిలను ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీలు ఇచ్చారు. ఇక పెన్షనర్ల కోసం అయితే ఏకంగా ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామంటూ కూడా ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ కార్పోరేషన్‌ను ఎందుకు ప్రకటించలేదు? రాష్ట్రంలో ఉద్యోగవర్గాలు కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని, రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని గ్రహించే, ఈ ఒక్క డీఏను ప్రకటించారు. 

 పెద్ద ఎత్తన ఉద్యోగాలను తొలగించిన కూటమి సర్కార్

ఎన్నికలకు ముందు వాలంటీర్లకు నెలకు రూ.10వేలు ఇస్తానని హామీ ఇచ్చి, వారిని అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల మీదికి తెచ్చారు. 1.30 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి, సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి, పాలనను ప్రజల వద్దకు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చేరువ చేసింది. అనేక రాష్ట్రాలకు ఈ వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. అటువంటి వ్యవస్థ వల్ల ప్రయోజనం శూన్యం, ప్రభుత్వంపై భారం మోపారని నేడు సీఎంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే, దాని వల్ల ఖర్చు పెరిగిపోయిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? తీసేసిన ఉద్యోగాలు ఎన్నీ? బేవరేజెస్ కార్పోరేషన్‌లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసేశారు. ఫైబర్‌నెట్ 2000 మంది, నరేగాలో ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారు, ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే ఎండీయు వాహనాల వ్యవస్థను తీసేశారు. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యే నాటికి ఒక అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగం కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. వైయస్ జగన్ సీఎం కాగానే మెరిట్ ప్రకారం ఈ ఉద్యోగాలను భర్తీ చేశారు. ఆప్కాస్ అనే అవుట్ సోర్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి, దళారీలను తొలగించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే మాదిరిగానే వారికి కూడా జీతాలు సక్రమంగా ఇచ్చేలా చేశారు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి లక్ష మంది ఉద్యోగులు ఆప్కాస్ ద్వారా జీతాలు అందుకున్నారు. ఈ రోజు చంద్రబాబు ఆప్కాస్ ను రద్దు చేసేందుకు సిద్దమయ్యారు. సచివాలయ వ్యవస్థను నీరుగారుస్తూ, ఉద్యోగులను ఇతర డిపార్ట్‌మెంట్‌లకు సర్థుబాటు చేస్తామని చెబుతున్నారు. 

  వైయస్ జగన్ పాలనలోనే ఉద్యోగులకు మేలు
 
వైయస్ జగన్ సీఎం అయిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ప్రకటించి, దానిని అమలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బకాయిలు పెట్టిన రెండు డీఏలను కూడా చెల్లించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమమ్ స్కేల్‌ను అమలు చేశారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయిస్‌కు, పారిశుధ్య కార్మికులు, ఆశవర్కర్లకు జీతాలు పెంచారు. ఉద్యోగుల కోసం పీఆర్సీని ఏర్పాటు చేశారు. కరోనా వంటి కష్టకాలంలోనూ పీఆర్సీని అమలు చేస్తూ, న్యాయంగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను ఇచ్చేందుకు మనస్పూర్తిగా ప్రయత్నించారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా ఆయన ఉద్యోగులకు అనుకూలం కాదు. ఆయన మారాడనే భ్రమతోనే ఉద్యోగులు గత ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేసి మోసపోయారు. కనీసం ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని నిర్లక్ష్యం. ఇప్పుడు తాజాగా ఒక్క డీఏ ఇచ్చి, మొత్తం ఉద్యోగులకు అన్ని చేసేశామని తనదైన శైలిలో చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు.

Back to Top