హైదరాబాద్: నకిలీ లిక్కర్ వ్యవహారంలో నా పాత్ర లేదని, అవసరమైతే లై డిటెక్టర్ టెస్టుకైనా సిద్ధమని ప్రకటించినా ప్రభుత్వంలో చలనం లేదని, ఇప్పుడు అవసరమైతే చంద్రబాబు ఇంటికైనా వచ్చి భగవద్గీత మీద ప్రమాణం చేయడానికైనా సిద్దమని మాజీ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర ఉందని స్పష్టంగా బయటపడటంతో దాన్నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే అద్దేపల్లి జనార్దన్‌రావుతో తన పేరు చెప్పించి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కేసులో నిజాయితీగా విచారణ జరిపించి నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలన్న ఆలోచన చేయకుండా వైయస్సార్సీపీ మీదకు ఎలా నెట్టాలనే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జయచంద్రారెడ్డికి ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... - రిమాండ్ రిపోర్టులో నా పేరు లేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, తెనాలి, ఏలూరు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలనే ఏర్పాటు చేసి బెల్ట్ షాపులు, పర్మిట్ రూములు, బార్లు, మద్యం షాపుల ద్వారా ఆ మద్యాన్ని విచ్చలవిడిగా తాగిస్తున్నారు. భారీ స్థాయిలో నకలీ మద్యం గుట్టురట్టయితే ప్రభుత్వం ఎక్కడా మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించిన పాపానపోలేదు. ములకలచెరువు నకిలీ మద్యం మాఫియా వెలుగుచూసి 16 రోజులవుతున్నా నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించే కార్యక్రమం ఏ ఒక్కటీ జరగడం లేదు. నకిలీ మద్యం మాఫియాలో నిందితులంతా టీడీపీ నాయకులే కావడంతో దాన్ని వైయస్సార్సీపీ మీదకు ఎలా నెట్టాలనే ఆలోచన తప్పించి వాస్తవాలు ప్రజలకు చెప్పాలన్న ఆలోచన ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతో డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతోంది. ఆఖరుకి లిక్కర్ దందాలో కీలక నిందితుల్లో ఒకడైన అద్దేపల్లి జనార్దన్‌రావుకి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వకుండానే, పోలీసులు ఎవరూ అరెస్ట్ చేసే ప్రయత్నం చేయకుండానే.. ఆయన ఆఫ్రికా నుంచి చాలా సంతోషంగా ముంబై ఎయిర్‌పోర్టులో దిగి అక్కడ్నుంచి గన్నవరం చేరుకున్నాడంటే ఎవరికైనా అనుమానం కలగకమానదు. జనార్దన్‌రావు రిమాండ్ రిపోర్టులో వైయస్సార్సీపీ నాయకుల పేర్లు చెప్పకపోయినా, అతడు కోర్టులో జడ్జి ఎదుట కూడా చెప్పకపోయినా డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా నన్ను ఈ అక్రమ కేసులో ఇరికించారు. ఫోన్ పోతే వీడియోలు, చాటింగ్ ఎలా ? ఇబ్రహీంపట్నంలో తయారవుతున్న నకిలీ మద్యం గుట్టును ప్రపంచానికి తెలియజేస్తే వాటి వెనుక ఎవరెవరు ఉన్నారు, నకలీ మద్యం ఎప్పట్నుంచి తయారు చేస్తున్నారు? ఎక్కడెక్కడికి సరఫరా జరుగుతోంది అనే దిశగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోకుండా వైయస్సార్సీపీకి మీదకు ఎలా నెట్టాలా అనే ఆలోచనలు చేస్తున్నారు. ములకలచెరువు నకిలీ లిక్కర్ దందాలో అడ్డంగా దొరికిన తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డికి ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదు. పిలిపించి విచారణ చేయలేదు. ఆయన పీఏ, ఆయన బామ్మర్దిని కూడా అరెస్ట్ చేయలేదు. ఇంకోపక్క అద్దేపల్లి జనార్దన్‌రావు కలిసే జయచంద్రారెడ్డి నకిలీ లిక్కర్ దందా నడుపుతున్నాడని ఎక్సైజ్ పోలీసులే చెబుతున్నారు. ఈ కేసులో నిందితుడిగా అదుపులోకి తీసుకున్న అద్దేపల్లి జనార్దన్‌రావుని అరెస్ట్ చేసి రాచమర్యాదలు చేస్తున్నారు. ఆయన ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారా అని ప్రశ్నిస్తే జనార్దన్‌రావు ఫోన్ ముంబైలో పోయిందని చెబుతున్నారు. కానీ అదే ఫోన్ నుంచి జోగి రమేష్ చేసిన వాట్సాప్ చాట్ లీకైనట్టు ఎల్లో మీడియాలో కథనాలు ప్రచురిస్తున్నారు.