చిత్తూరు జిల్లా: కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే రాసలీలలు, మహిళలపై జరుగుతున్న అవమానకర చర్యలకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరి లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనకు మాజీ మంత్రి ఆర్.కె. రోజా నేతృత్వం వహించగా, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నగరి ఏ.జె.ఎస్. కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు నిర్వహించిన ర్యాలీలో కీచక ఎమ్మెల్యేలను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను అవమానించేలా ప్రవర్తించిన కీచక ఎమ్మెల్యేలను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ, అధికార అహంకారంతో కూటమి ఎమ్మెల్యేలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అయినా, అదే ప్రభుత్వం నేరస్తులను రక్షించడం దుర్మార్గమని అన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న దాడులు, అవమానాలు ప్రజాస్వామ్యానికి మచ్చలాంటివని అన్నారు. న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు పెద్ద ఎత్తున వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నిరసనకు మద్దతు తెలిపారు. మహిళలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు.