తాడేపల్లి: విశాఖపట్నంలో గీతం విద్యాసంస్థల కబ్డాలో ఉన్న ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదను జీవీఎంసీ కౌన్సిల్ లో అడ్డగోలుగా ఆమోదించడంపై వైయస్ఆర్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు,చట్టాలకు విరుద్ధంగా రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను జీవీఎంసీ కౌన్సిల్‌లో ఆమోదించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ.. వైయస్ఆర్‌సీపీ నేతలు ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కుంబా రవిబాబుతో పాటు విశాఖ మాజీ మేయర్ జి హరికుమారి, వైయస్ఆర్‌సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం కూటమి నేతల భూదోపిడీకి అడ్డాగా మారిందని మండిపడ్డారు. గీతం విద్యాసంస్థల కబ్జాలో ఉన్న రూ.5వేల కోట్ల విలువైన భూమిని రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను వెనక్కి తీసుకునేంతవరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే.. ● కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ, వైయస్ఆర్‌సీపీ జనవరి 30 న విశాఖ కార్పొరేషన్ లో జరిగిన సర్వసభ్యసమావేశం ప్రజాస్వామ్య విరుద్ధం. ఆ సమావేశంలో మేయర్ తో పాటు కూటమి కార్పొరేటర్లు ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా వ్యవహరించారు. కౌన్సిల్ లో 15 అంశాలను పొందుపరిచి.. 15వ అంశంగా విశాఖలో గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమభద్దీకరణ చేయడానికి పూనుకున్నారు. ఇది చట్ట విరుద్ధం. అసైన్డ్ ల్యాండ్ తో పాటు, 22 ఏలో వాగులు, గెడ్డలతో ఉన్న ఆ భూమిని క్రమబద్దీకరణ చేయడానికి కార్పొరేషన్ కి ఎలాంటి అధికారం లేదు. కార్పొరేషన్ కు ఆ అధికారం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ ను గట్టిగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరించాల్సిన మేయర్ కూటమి కార్పొరేటర్లతో కలిసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. కౌన్సిల్ సమావేశం జరగకపోయినా.. కౌన్సిల్ లో ఆ తీర్మానాలను ఆమోదించినట్లు మేయర్ ప్రకటించడం అప్రజాస్వామికం. కౌన్సిల్ సమావేశం ప్రారంభంలో కోరం ఉందా? లేదా? అన్న విషయాన్ని కూడా అధికారులు పరిశీలించలేదు. తొలి ఉల్లంఘన అక్కడే ప్రారంభమైంది. రెండోది అజెండాలోని అంశాలను మేయర్ గారు ప్రస్తావిస్తూ సభ ముందు ఉంచాల్సిన అవసరం ఉంది. అవేవీ జరగకుండానే కూటమి సభ్యులు విపక్ష వైయస్ఆర్‌సీపీ సభ్యులపై దాడి చేస్తూ.. గందరగోళం సృష్టించారు.ఆ క్రమంలో మేయర్ అన్ని అంశాలను సభ ముందు ఉంచకుండానే వరుసగా ఆమోదించామని ప్రకటించారు. దీన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది సరైన విధానం కాదు. మున్సిపల్ కార్పొరేషన్ లో చేర్చి ఆమోదించాల్సిన అంశం కాకుండానే ఆమోదించారు. గతంలో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో గీతం కాలేజీ భూములలో దాదాపు 54.79 సెంట్లు ప్రభుత్వ, గెడ్డల భూమితో పాటు అసైన్డ్, 22 ఏ భూములున్నాయని వారికి చెప్పి కంచె వేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత గీతం సంస్థలు దాన్ని ఉల్లంఘించి, ఆక్రమించిన భూములను క్రమబద్దీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నారు.వాస్తవానికి ప్రభుత్వం కంచె వేసిన తర్వాత గీతం సంస్థలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. కోర్టులో ఉన్న అంశాన్ని కార్పొరేషన్ పరిధిలో ఉన్న కౌన్సిల్ సమావేశంలో పెట్టి క్రమబద్దీకరణకు ఆమోదించడం సరికాదు. - ఎంపీ భరత్ పై ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖను కేంద్రంగా చేసుకుని సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులకు, అనుయాయులకు పంచిపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. గీతం ఆక్రమణలో ఉన్న 54.79 ఎకరాల భూమి దాదాపు రూ.5వేల కోట్ల విలువ చేస్తుంది. దాన్ని గీతం యాజమాన్యం ఆక్రమించే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత ఎవరికైనా కేటాయించాలి. కానీ చంద్రబాబు బంధువు, విశాఖ ఎంపీ భరత్ మాత్రం వారి ఆధీనంలో ఉన్న 54.79 ఎకరాల భూమిని క్రమబద్దీకరణ చేయడంలో తప్పేముందని మాట్లాడుతున్నారు. అసలు అసైన్డ్, ప్రభుత్వ భూములు మీ ఆధీనంలోకి వచ్చాయని చెప్పడమే చట్టవిరుద్ధం. ఆ నేరాన్ని అంగీకరించిన విశాఖ ఎంపీ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేస్తోంది. ఒక బాధ్యతగల ఎంపీ తన విద్యాసంస్థల పేరిట ఏకంగా రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే.. దాన్ని క్రమబద్దీకరణకు సిద్దమైన ప్రభుత్వం, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను పర్యవేక్షించడానికి వెళ్లిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణతో సహా పలువులు ఎమ్మెల్సీలను పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వ్యక్తులకు పోలీసులు కాపలా కాస్తున్నారు. విశాఖపట్నంలో ఉన్న వందలు ,వేలు కోట్ల విలువైన బూములను చంద్రబాబు పప్పుబెల్లాల్లా పంచిపెడుతున్నారు. తాను ఎప్పుడు అధికారంలోకి వచ్చినా విశాఖలో భూములు కొల్లగొట్టడం చంద్రబాబుకి అలవాటు. - విశాఖలో చంద్రబాబు అడ్డగోలు భూదోపిడీ... రహేజా, టీసీఎస్ వంటి సంస్థలకు 99 పైసలకే ఎకరా చొప్పున కట్టబెడుతున్నారు. ఎకరా రూ.100 కోట్ల పై చిలుకు విలువ చేసే భూములను రియల్ ఎస్టేట్ కంపెనీలకు అడ్డగోలుగా కట్టబెడుతున్నారు హెచ్ ఎం టీవీ యాజమాన్యానికి ఎండాడ సమీపంలో అతి విలువైన 30 ఎకరాలు అంటే దాదాపు రూ.3వేల కోట్ల ఖరీదు చేసే భూమిని కారుచౌకగా అప్పజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ రకంగా కట్టబెట్టడాన్ని వైయస్ఆర్‌సీపీ తో పాటు కమ్యూనిస్టులు, ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీవీఎంసీ కౌన్సిల్ లో మేయర్ సహా కూటమి సభ్యులు కనీస చర్చలేకుండా, వైయస్ఆర్‌సీపీ సభ్యులపై దాడి చేసి ఆమోదింపజేసుకున్నారు. నిబంధనలకు విరుద్దంగా ఆమోదించిన భూములు రెగ్యులైజేషన్ ను ఆపే వరకు వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది. ఇందులో భాగంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి దీనిపై ఫిర్యాదు చేశాం. ● వరుదు కల్యాణి, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం రాష్డ్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ. - చంద్రబాబు బంధువుల భూకబ్జా... విశాఖపట్నం ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యా సంస్థలు 54.79 ఎకరాల ప్రభుత్వ భూమని కబ్జా చేయడంతో పాటు ఆ భూమిని రెగ్యులరైజ్ చేయాలని జీవీఎంసీ కౌన్సిల్ లో నిబంధలకు, చట్టానికి వ్యతిరేకంగా ఆమోదించేందుకు అజెండాలో చేర్చారు. దీన్ని వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్త చేశారు. అయినా కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా మేయర్ ఈ తీర్మానాన్ని ఆమోదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారమిచ్చింది చంద్రబాబు కుటుంబం భూములు కబ్జా చేయడానికా అని ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న గీతం విద్యాసంస్థల అధిపతి, కూటమి పార్టీల తరపున విశాఖపట్నం ఎంపీ మాత్రమే కాకుండా, చంద్రబాబు కుమారుడు లోకేష్ కి తోడల్లుడు కూడా. అంటే సాక్షాత్తూ సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యుడైన అధికార పార్టీ ఎంపీ ఏకంగా రూ.5వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేయడమే కాకుండా..దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ప్రయత్నించడం సిగ్గుచేటు. తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని పదే, పదే చెప్పే చంద్రబాబు తీరా గెలిచిన తర్వాత విశాఖపట్నంలో వేలాది కోట్ల రూపాయుల విలువైన ప్రభుత్వ సంపదను తన కుటుంబ సభ్యులకు, అనుయాయులకు కట్టబెడుతున్నాడు . - విశాఖను దోపిడీకి రాజధాని చేసిన చంద్రబాబు.. విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తానన్న చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దోడిపీకి క్యాపిటల్ గా మార్చారు. ఎంపీ భరత్ కు విశాఖ ప్రజలు 5 లక్షలకు పైగా మెజారిటీ గెలిపిస్తే.. అదే ప్రజలకు ఆయన రిటర్న్ గిఫ్ట్ గా రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటున్నారు. ఇదే భరత్, కూటిమి నేతలు విశాఖలో ఏళ్లతరబడి చిన్న చిన్న దుకాణాలతో జీవనం సాగిస్తున్న పేదవాళ్ల బడ్డీలు, దుకాణాలను పోలీసు బలగం సహకారంతో బుల్‌డోజర్లు పెట్టి మరీ కూలదోశారు. విశాఖపట్నానికి బ్రతుకు తెరువుకు వచ్చిన చిన్న చిన్న పేదల ఇళ్లను కూలదోశారు. కానీ ఏకంగా 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని చంద్రబాబు కుటుంబ సభ్యులు కబ్జా చేస్తుంటే అధికారులు వారికి సహకారం అందించడం అత్యంత దుర్మార్గం. కూటమి పాలనలో పేదలు, పెద్దలకు వేర్వేరు రకాలుగా న్యాయం ఉంటుందా ? గీతం విద్యాసంస్థలకు ఎదురుగా ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వానికి అత్యంత విలువైన భవనాలు నిర్మిస్తే... ఆ రోజు వీరంగం చేసిన కూటమి నేతలు, ఇవాళ తమ ప్రైవేటు సంస్థల కోసం వేలాది ఎకరాల భూమని ప్రభుత్వంలోని వారే కబ్జా చేస్తుంటే పవన్ కళ్యాణ్ కి ఎందుకు కనబడ్డం లేదు? ప్రజలు మీకు అధికారమిచ్చింది మీ కబ్జాలు క్రమబద్దీకరించుకోవడానికా? - కోర్టు తీర్పులను సైతం కాదని.. 2012లో ప్రభుత్వం ఇచ్చిన జీవో 571 ప్రకారం ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వడానికి లేదు. 2012లో సుప్రీంకోర్టు కూడా స్థానిక సంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థలకు ఇవ్వరాదని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు వేటినీ పాటించకుండా.. ఏకపక్షంగా ఎంపీ భరత్ కు చెందిన గీతం సంస్థకు కట్టబెడుతున్నారు. ఒక ఎంపీ నేరుగా తమ ఆధీనంలో 54 ఎకరాల భూమి ఉందని ఆయనే స్వయంగా ప్రకటించిన నేపధ్యంలో.. ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలి. కూటమి నాయకులు కూడా దీనిపై సమాధానం చెప్పాలి. ఇలా అధికార పార్టీ నేతలు ప్రభుత్వ భూమి కబ్జా చేసి... దాన్ని రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే.. ప్రజల అవసరాలకు సెంటు ప్రభుత్వ భూమి కూడా మిగిలే పరిస్థితి లేదు. దీన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో మా పార్టీకి చెందిన మహిళా మేయర్ ను అడ్డగోలుగా పదవి నుంచి దించేసిన కూటమి నేతల కుట్ర వెనుకున్న కారణం ఇప్పుడు అర్ధమయింది. తమ ఆక్రమణలోని భూములు అడ్డగోలు క్రమబద్దీకరణకు అడ్డు తొలగించుకోవాడనికే ఆ రోజు మహిళా మేయర్ ను పదవి నుంచి తప్పించి తమకు అనుకూలమైన వ్యక్తిని ఆ స్ధానంలో పెట్టుకున్నారు. అందుకు బదులుగానే కూటమి మేయర్ కనీసం నిబంధనలు పాటించకుండా, కోరమ్ లేకుండా గీతం సంస్థల భూకబ్జాను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ఆమోదించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. వీరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఒకవైపు చంద్రబాబు 20 నెలల్లో తన బినామీ సంస్థల దగ్గర ముడుపులు తీసుకుని 99 పైసలకే ఎకరం చొప్పున కేటాయించగా.. ఇప్పుడు మరింత బరితెగించి తన కుటుంబ సభ్యుల కబ్జాలో ఉన్న రూ.5వేల కోట్ల విలువైన భూమిని రెగ్యులరైజ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై రానున్న రోజుల్లో ప్రజలతో కలిసి వైయస్ఆర్‌సీపీ పోరాటం చేస్తుంది. ఈ కబ్జాకు సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, కబ్జాకు గురైన భూమిని తిరిగి ప్రభుత్వ పరం చేయడం ఖాయం. దీనిపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం.