తాడేపల్లి: పవిత్రమైన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాజకీయ ప్రసంగం చేయడమే కాకుండా అందులోనూ పచ్చి అబద్ధాలు చెప్పిన సీఎం చంద్రబాబు, మరోసారి ముస్లింలను దారుణంగా మోసం చేశారని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీఅమలు చేయకపోయినా అన్నీ చేసినట్లు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు ప్రతినెలా ఒకటో తేదీన ఇమామ్‌లు, మౌజమ్‌లకు గౌరవం వేతనం చెల్లించగా, ఇప్పుడు 6 నెలలకు ఒకసారి ఇస్తున్నారని ఆక్షేపించారు. అయినా అన్నీ చేస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారని దుయ్యబట్టారు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో మసీదుల నిర్వహణకు ప్రతి నెలా రూ.10 వేలు ఇవ్వగా, చంద్రబాబు దానికి మంగళం పాడారని అంజద్‌బాషా చెప్పారు. విజయవాడలో వక్ఫ్ భవనం నిర్మాణం పేరుతో పదేళ్లుగా ప్రచారం చేసుకుంటూ కనీసం స్థలం కూడా కేటాయించలేదని గుర్తు చేశారు. మరోవైపు విలువైన వక్ఫ్ బోర్డు స్థలాలను బినామీలకు దోచి పెడుతున్నారని, పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అంజద్‌బాషా దుయ్యబట్టారు.ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఎమ్మెల్సీలు ఇసాక్ బాషా, రుహుల్లా, పార్టీ ముస్లిం మైనారిటీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షేక్ మహబూబ్ షరీఫ్, స్టేట్ బీసీ సెల్ జనరల్ సెక్రటరీ షేక్ దస్తగిరి. ప్రెస్‌మీట్‌లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా ఏం మాట్లాడారంటే..: ఇఫ్తార్ విందులోనూ పచ్చి అబద్ధాలా!: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు. పవిత్రమైన రంజాన్ మాసంలో నిర్వహించిన విందులో ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడి ముస్లిం మైనారిటీలను మోసం చేయాలని చూడటం సిగ్గుచేటు. ముస్లింలు భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు రాజకీయ ప్రసంగాలకు వేదికగా మార్చేశాడు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఎన్నికల్లో ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోయినా వైయస్ జగన్ గారు అమలు చేసిన వాటిని తనవిగా చెప్పుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామన్నారు. ముఖ్యమైన నగరాలు, పట్టణాల్లో ఈద్గాలు, కబరస్థాన్‌లకు స్థలాలు కేటాయిస్తామని చెప్పారు. ఇవేవీ అమలు కాలేదు. విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మిస్తామని 2014 ఎన్నికల నాటి నుంచి చంద్రబాబు చెబుతూనే ఉన్నాడు. పదేళ్లవుతున్నా కనీసం భూమి కూడా కేటాయించలేదు. నూర్ బాషా సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏడాదికి రూ.100 కోట్లు కేటాయిస్తానని చెప్పాడే కానీ మూడు బడ్జెట్ లలో ఎక్కడా రూపాయి కేటాయించలేదు. కానీ ఇఫ్తార్ విందులో మాత్రం రూ.100 కోట్లు కేటాయించినట్లు పచ్చి అబద్ధం చెప్పాడు. షాదీ తోఫా కింద ముస్లిం మైనారిటీలకు రూ. లక్ష ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మైనారిటీ సంక్షేమం కోసం బడ్జెట్‌లో రూ. 6,090 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ గత 2025–26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.4,600 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చూపించాలి. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే ముస్లింలకు మేలు: ఇమామ్‌లు, మౌజమ్‌లకు తానే రూ.10 వేలు గౌరవ వేతనం ఇచ్చానని చెప్పుకోవడం హాస్యాస్పదం. గతంలో 2014–19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు ఇమామ్‌లకు రూ.5 వేలు, మౌజన్‌లకు రూ.3 వేలు గౌరవ వేతనం ఇస్తుండగా, జగన్‌గారు అధికారంలోకి రాగానే ఇమామ్‌ల గౌరవ వేతనం రూ.10 వేలు, మౌజన్‌ల గౌరవ వేతనం రూ.5 వేలకు పెంచడమే కాకుండా, అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టి పోయిన రూ.24 కోట్లు కూడా చెల్లించారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు రూ.60 వేల సాయం అందేది. అంతే కాకుండా, నాడు కేంద్రంతో మాట్లాడి విజయవాడకు ఎంబార్కేషన్ సెంటర్ తీసుకువచ్చారు. దానివల్ల విమాన టికెట్ రేటు పెరగడంతో, ఒక్కో హాజీకి రూ.83 వేల చొప్పున, కేవలం 24 గంటల్లో రూ.14.51 కోట్లు హజ్ యాత్రికుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఆ సాయాన్ని లక్షకు పెంచుతానని చెప్పిన చంద్రబాబు ఆ ఊసే ఎత్తడం లేదు. 2025లో రాష్ట్రం నుంచి 1,870 మంది హజ్ యాత్రకు వెళితే కేవలం 72 మందికి మాత్రమే సాయం అందించి చేతులు దులిపేసుకున్నారు. 2026లో జరగబోయే హజ్ యాత్రకు దాదాపు 2005 మంది వెళ్లబోతున్నారు. వారందరికీ లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలి. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆ 5 ఏళ్లలో మైనారిటీల సంక్షేమం రూ.24,304 కోట్లు ఖర్చు చేయగా, అందులో వివిధ పథకాల్లో లబ్ధిగా ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఏకంగా రూ.13,239.49 కోట్లు జమ చేయడం జరిగింది. ఆ స్థాయిలో ఏ ప్రభుత్వం వ్యయం చేయలేదు. గతంలో దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఎంతోముంది ముస్లిం మైనారిటీలు ఉన్నత చదువులు చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. ముస్లింలకు తీసుకొచ్చిన 4 శాతం రిజర్వేషన్ల వల్ల ఎంతో మంది లబ్ధి పొందారు. ముస్లింలను రాజకీయంగా ప్రోత్సహించింది జగన్ గారే: రాజకీయంగా ముస్లిం మైనారిటీలను ప్రోత్సహించింది కూడా వైయస్ జగన్ గారే. 2019 ఎన్నికల్లో ఐదుగురికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే నలుగురు విజయం సాధించారు. అందులో నాకు (అంజద్ బాషా) ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఓడిపోయిన ఇక్బాల్‌కి రెండుసార్లు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. శాసనమండలిలో నలుగురికి ఎమ్మెల్సీ పదవులిచ్చారు. ముస్లిం మహిళ జకియా ఖానుంను మండలి వైస్‌ఛైర్మన్‌గా నియమించారు. 12 కార్పోరేషన్ చైర్మన్లుగా ముస్లిం మైనారిటీలకు అవకాశం కల్పించారు. కానీ నేడు కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం కల్పించారు. అవి కూడా తప్పనిసరిగా ముస్లింలకు ఇవ్వాల్సినవే కాబట్టి చంద్రబాబుకి ఇవ్వక తప్పలేదు. మైనారిటీ కమిషన్ పోస్టులను ఇప్పటికీ భర్తీ చేయలేదు. జగన్‌గారు జనరల్ కేటగిరీల్లోనూ ముస్లింలకు అవకాశం కల్పించారు. ఏపీపీఎస్సీ బోర్డు మెంబర్ సహా 100 కి పైబడి డైరెక్టర్ పదవుల్లో మైనారిటీలకు అవకాశం కల్పించారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో మైనారిటీలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. విలువైన వక్ఫ్ ఆస్తులను దోచేస్తున్నారు: ఎస్సీ, ఎస్టీల తరహాలోనే ముస్లింలకు సబ్ ప్లాన్ తీసుకురావాలని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన తొలి ముఖ్యమంత్రి జగన్‌గారే. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ మైనారిటీ కాంపోనెంట్ సబ్ ప్లాన్ ప్రవేశపెట్టారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో ఉర్దూను రెండో అధికారిక భాషగా చట్టం చేసిన ఘనత కూడా జగన్‌గారికే దక్కుతుంది. వక్ఫ్‌కి సంబంధించి వేల కోట్ల విలువైన ఆస్తులను కాజేయాలనే దుర్బుద్ధితోనే చంద్రబాబు పని చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళగిరిలో మెగా ఐటీ పార్కు పేరుతో 71.57 ఎకరాలను తన బినామీలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోంది. వక్ఫ్ బోర్డుకి చెందిన ఒక సెంటు భూమి అన్యాక్రాంతమైనా వైయస్ఆర్‌సీపీ చూస్తూ ఊరుకోబోదని అంజద్æబాషా హెచ్చరించారు.