చంద్ర‌బాబు మౌత్ పీస్‌గా ష‌ర్మిల

ఎన్నిక‌ల ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఎవ‌రిచ్చారో ష‌ర్మిల‌మ్మ చెప్పాలి

వైయ‌స్ఆర్‌సీపీ  స్టేట్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సింగారెడ్డి స‌తీష్ కుమార్ రెడ్డి డిమాండ్  

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సింగారెడ్డి స‌తీష్ కుమార్ రెడ్డి

చంద్ర‌బాబు రాజ‌కీయ అవ‌సరాల కోస‌మే వివేకా హ‌త్య కేసు

ష‌ర్మిల, సునీత‌ల‌ను పావులుగా వాడుకుంటున్నాడు

చంద్రబాబు కు ఇబ్బంది వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా వారు మీడియా ముందుకొస్తారు  

కాల‌నాగు ప‌డ‌గ నీడ‌లో ష‌ర్మిల‌, సునీత రాజ‌కీయం

2029 వర‌కు కేసును స‌జీవంగా ఉంచడ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్యం 

స్ప‌ష్టం చేసిన స‌తీష్ కుమార్ రెడ్డి 

తండ్రి సంపాదించిన ఆస్తుల్లో ఎక్కువ వాటా ద‌క్కింది నీకేగా?

రూ. 230 కోట్లు సొంత డ‌బ్బు, స‌రస్వ‌తిలో షేర్లు ఇచ్చినా చాల్లేదా?

వంద‌ల కోట్ల ఆస్తులు రాసిచ్చినా అన్న మీద అక్క‌సు దేనికి? 

ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు రిజిస్ట్రేష‌న్ చేసుకోకూడ‌ద‌ని తెలియ‌దా? 

అయినా తెగించ‌డం అంటే అన్నని ఇబ్బంది పెట్టాల‌నే క‌దా?

ష‌ర్మిల‌కు స‌తీష్ కుమార్ రెడ్డి సూటి ప్ర‌శ్న‌లు 

తాడేప‌ల్లి: ష‌ర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ గా ఉండి కూడా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం క‌ష్ట‌ప‌డుతూ ఆయ‌న మౌత్ పీస్‌గా మారిపోయార‌ని, మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఆమె ఖ‌ర్చు చేసిన ప్ర‌తి రూపాయి చంద్ర‌బాబు నుంచే వ‌చ్చిందో లేదో చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ సింగారెడ్డి స‌తీష్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ వివేకానంద‌ రెడ్డి హ‌త్య కేసు ద‌ర్యాప్తును 2029 ఎన్నిక‌ల వ‌ర‌కు పొడిగించ‌డ‌మే చంద్ర‌బాబు ల‌క్ష్య‌మ‌ని, అందుకోస‌మే సునీతమ్మ‌తో పిటిష‌న్లు వేయిస్తున్నాడ‌ని ఆరోపించారు. తిరుమ‌ల నెయ్యి వ్య‌వ‌హారంలో హెరిటేజ్ పాత్ర‌, టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు అశ్లీల వీడియోలు, టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ యాద‌వ్ డ్ర‌గ్స్ కేసు వంటి వ్య‌వ‌హారాల‌తో దేశ‌ వ్యాప్తంగా టీడీపీ ప్ర‌తిష్ట రోడ్డున ప‌డింద‌ని, దాన్నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌రల్చ‌డం కోస‌మే వివేకా కేసు గురించి ష‌ర్మిల, సునీత‌మ్మ‌ల‌తో చంద్రబాబు మ‌ట్లాడిస్తున్నాడ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. త‌న తండ్రి హ‌త్య కేసు ద‌ర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాల‌ని కాకుండా చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులను కేసులో ఇరికించి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు చేకూర్చ‌డ‌మే ధ్యేయంగా సునీత‌మ్మ ప‌నిచేస్తున్నార‌ని విమ‌ర్శించారు. సునీత‌మ్మ‌, చంద్ర‌బాబు, వివేకాను హత్య చేసిన ద‌స్త‌గిరి.. అంద‌రూ ఒక్క‌టేన‌ని, వారంద‌రికీ సిద్ధార్థ లూథ్రానే లాయ‌ర్‌గా ఉన్నార‌ని వివ‌రించారు. వంద‌ల కోట్ల ఆస్తులు పంచినా అన్న నాశ‌నం కోరుకుంటున్న ష‌ర్మిలను చూసి ఇలాంటి సోద‌రి వ‌ద్దంటే వ‌ద్ద‌ని ప్ర‌తి ఇంట్లో అనుకుంటున్నార‌ని చెప్పారు. కాల‌నాగు ప‌డ‌గ లాంటి చంద్ర‌బాబు నీడ‌లో ఉంటూ రాజ‌కీయం చేస్తున్న ష‌ర్మిల, సునీతమ్మ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స‌తీష్ రెడ్డి సూచించారు.   
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే... 

- చంద్ర‌బాబు ప్ర‌యోజ‌నాల కోస‌మే ష‌ర్మిల ఏపీకి 

వైయ‌స్ జ‌గ‌న్ గారి వ్య‌క్తిత్వాన్ని, ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డ‌మే ల‌క్ష్యంగా వైయ‌స్ వివేకానంద‌ రెడ్డి రెడ్డి గారి హ‌త్య‌ను చంద్ర‌బాబు వాడుకుంటున్నాడు. ఆయ‌న క‌నుసైగ‌ల్లో ప‌నిచేసే ఎల్లో మీడియా వివేకా హ‌త్య గురించి ష‌ర్మిల‌మ్మ‌, సునీత‌మ్మ‌లు మాట్లాడిన‌ప్పుడే కవ‌రేజీ ఇస్తోంది. వైయ‌స్ జ‌గ‌న్ గారి మీద‌, ఎంపీ అవినాశ్‌ రెడ్డి గారి మీద ష‌ర్మిల గారు ఆరోప‌ణ‌లు చేసిన‌ప్పుడే ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, టీవీ5, ఏబీయ‌న్ స‌హా ఎల్లో మీడియాలో ఆమెకి క‌వ‌రేజీ వ‌స్తుందే త‌ప్ప‌, కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలిగా ఆమె చేసిన పోరాటాల‌కు ఎల్లో మీడియాలో అణుమాత్రం చోటు కూడా ఉండ‌దనే విష‌యాన్ని ఆమె గుర్తించారో లేదో. అలాంటిది ఎల్లో మీడియా మొత్తం ఆమె ప‌క్క‌న పెట్టుకుని, వైయ‌స్ జ‌గ‌న్ గారు మీడియా బ‌లం ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని ష‌ర్మిలమ్మ అన‌డం హాస్యాస్ప‌దం. ష‌ర్మిల‌మ్మ తెలంగాణ‌లో పార్టీ పెట్టి న‌ష్ట‌పోతే దానికి ఎవరు బాధ్యులు?  చివ‌రికి ఒక‌ప్పుడు సోనియా గాంధీని కాద‌ని బ‌య‌ట‌కొచ్చిన కాంగ్రెస్ పార్టీ లోనే చేరి ఏపీకి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. వైయ‌స్ జ‌గ‌న్‌ గారికి ఉన్న జ‌న‌బ‌లాన్ని ప్ర‌తిష్ట‌ను లేకుండా చేసి ఓట్లు చీల్చాల‌న్న చంద్ర‌బాబు కుట్ర‌ల్లో భాగంగానే ఆమె ఏపీకి వ‌చ్చారు త‌ప్ప‌, కాంగ్రెస్ పార్టీని ఉద్ధ‌రించడానికి కాదు అనేది ఓపెన్ సీక్రెట్‌. ఆమె ఎన్నిక‌ల్లో పెట్టిన ఖ‌ర్చుల‌కు డ‌బ్బులు ఎవరిచ్చారో ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోవాల్సిన బాధ్య‌త ఆమె పైనే ఉంది. 

- నీలాంటి చెల్లెలు వ‌ద్ద‌ని అనుకుంటున్నారు

వైయ‌స్ఆర్ గారు సంపాదించిన ఆస్తిలో ఎక్కువ భాగం త‌న కుమార్తె ష‌ర్మిల‌కు రాసిచ్చినా, త‌న చెల్లికే క‌దా అని ఏనాడూ వైయ‌స్ జ‌గ‌న్‌ గారు అభ్యంత‌రం చెప్ప‌లేదు. వైయ‌స్ జ‌గ‌న్ గారి స్వార్జితమైన ఆస్తిలో కోరినంత వాటా ఇవ్వ‌లేద‌నే అక్క‌సుతో కుటుంబ శత్రువైన చంద్ర‌బాబుతో చేతులు క‌లిపి వ్య‌క్తిత్వ హ‌న‌నం, ప్ర‌తిష్ట‌ను దిగజార్చే కార్యక్ర‌మాల‌కు పూనుకోవ‌డం చాలా త‌ప్పు. చంద్ర‌బాబు లాంటి కాల‌నాగు ప‌డ‌గ నీడ‌లో ఉండి రాజ‌కీయాలు చేస్తున్నాన‌నే విషయం ష‌ర్మిల‌మ్మ‌కు ఇప్ప‌టికీ అర్థ‌మైన‌ట్టు లేదు. చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోస‌మే ష‌ర్మిల‌మ్మ‌ను వాడుకుంటున్నాడు. ఆమె ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు చేసిన ప్ర‌తి రూపాయి చంద్ర‌బాబు నుంచే వ‌చ్చి ఉంటుంద‌ని ప్ర‌పంచానికి తెలుసు. ఆమెతో పాటు సునీత‌మ్మ వెనుక ఉండి న‌డిపిస్తున్న దుష్ట‌శ‌క్తి కూడా చంద్రబాబేన‌ని ప్ర‌జలంతా ఎప్పుడో గుర్తించారు. ఇప్ప‌టికైనా ఇలాంటి విధానాల‌కు స్వ‌స్తి ప‌లికితే మంచిది. వైయ‌స్ జ‌గ‌న్ గారికి ఉన్న ఇలాంటి చెల్లెల్లు ఎవ‌రికీ ఉండ‌కూడ‌ద‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి ఇంటా అనుకుంటున్నారు. కనీసం ఈ విష‌య‌మైనా ఆమె చెవిన ప‌డిందో లేదో.  

- ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు రిజిస్ట్రేష‌న్ చేసుకోవ‌డం త‌ప్పు కాదా?   

అన్న సంపాదించిన ఆస్తిలో కోరినంత వాటా ద‌క్క‌లేద‌నే కడుపు మంట‌తో ఏ చెల్లికీ వైయ‌స్ జ‌గ‌న్ గారి లాంటి అన్న దొర‌క‌డం బాధాక‌రం అని ఆమె మాట్లాడ‌టం అభ్యంత‌క‌రం. తండ్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు సంపాదించిన ఆస్తిలో త‌న‌కి వాటా ఇవ్వ‌కుండా మోస‌గించి ఉంటే అన్న‌ని త‌ప్పుప‌ట్టొచ్చు.. కానీ పెళ్ల‌యిన త‌ర్వాత‌ వైయ‌స్ జ‌గ‌న్ గారు త‌న క‌ష్టార్జితంతో సంపాదించుకున్న దానిలోనూ కోరినంత కావాల‌న‌డం, ఇవ్వ‌క‌పోతే శాప‌నార్థాలు పెట్టడాన్ని స‌మాజం ఒప్పుకోదు. వివాహం జ‌రిగి 30 ఏళ్లయినా ఇప్ప‌టికీ పుట్టింటి ఆస్తులంటూ అన్న‌ని సాధించ‌డం హేయం. బంజారాహిల్స్ రోడ్ నెంబ‌ర్ 2లో ఉన్న ఇంటిని వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారు షర్మిలమ్మ‌కే ఇచ్చారు. దాంతో పాటు ఇడుపుపాయ‌లో 51 ఎక‌రాలు, 15 మెగా వాట్ల ఎస్ఆర్ఎస్ స్మాల్ హైడ్రో ప్రాజెక్టు, స్వ‌స్తి ప‌వ‌ర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5 శాతం వాటా, విజ‌య‌వాడ‌లోని రాజ్ యువ‌రాజ్ థియేట‌ర్‌లో 35 శాతం వాటా, విజ‌య‌ల‌క్ష్మి మిన‌ర‌ల్స్ అండ్ ట్రేడింగ్‌లో 100 శాతం ఆమెకి ఇవ్వ‌డం జ‌రిగింది. ఇవి కాకుండా చెక్కుల రూపంలో రూ.230 కోట్లు ష‌ర్మిల‌మ్మ‌కి ఇచ్చాడు. స‌ర‌స్వ‌తీ ప‌వ‌ర్‌లో షేర్లు ఇవ్వ‌డానికి ఈడీ కేసులతో ఇబ్బంది అవుతుంద‌ని ఆగాడు. కానీ అడ్డ‌దారిలో పోయి త‌ల్లి సాయంతో రిజిస్ట్రేష‌న్ చేయించుకోవ‌డం త‌ప్పుకాదా. ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ప్రాపర్టీని రిజిస్ట్రేష‌న్ చేస్తే వైయ‌స్ జ‌గ‌న్ గారికి న్యాయ‌ప‌రంగా ఇబ్బందులు వ‌స్తాయ‌ని తెలిసినా ఈ ప‌నిచేశావంటే ఏమ‌నాలి? 

- చంద్ర‌బాబుకి ఇబ్బందులొచ్చిన‌ప్పుడ‌ల్లా వివేకా కేసు  

ఏపీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండి చంద్ర‌బాబు మౌత్ పీస్‌గా ష‌ర్మిల మారిపోయారు. రాజకీయంగా చంద్ర‌బాబు ఇబ్బందుల్లో ప‌డిన ప్ర‌తిసారీ చెల్లెల్లిద్ద‌ర్మీ రంగంలో దింపి వారితో వివేకా హ‌త్య‌పై మాట్లాడించి జ‌గ‌న్ మీద బుర‌ద‌జ‌ల్లే కుట్ర‌లు చేస్తున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ గారితో నేరుగా యుద్ధంలో త‌ల‌ప‌డ‌లేక చంద్ర‌బాబు ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నాడు. ఆయ‌న హ‌త్య‌పై సునీత‌మ్మ కోరిన‌ట్టు సీబీఐ విచార‌ణ జ‌రిపి చార్జిషీట్ దాఖ‌లు చేస్తే ఇంకా పిటిష‌న్లు వేసి జాప్యం చేయాల‌ని కోరడం వెనుక ఆంత‌ర్యం ఏంటి? కేసు విచార‌ణ పూర్త‌యితే చంద్రబాబుకి రాజ‌కీయ ప్ర‌యోజ‌నం నెర‌వేర‌దనే కుట్ర‌తో సునీతమ్మ‌ను సుప్రీం కోర్టుకి పంపించి లోతైన విచార‌ణ పేరుతో కాల‌యాప‌న చేయిస్తున్నాడు. ఎంత లోతుగా విచార‌ణ చేస్తే అంతగా త‌న తండ్రికి అప‌కీర్తి వ‌స్తుంద‌నే విష‌యాన్ని మాత్రం సునీతమ్మ ఎందుకు ఆలోచించడం లేదో అర్థంకావ‌డం లేదు. వివేకానంద‌ రెడ్డి గారిని హ‌త్య చేశాన‌ని ద‌స్త‌గిరి అనే వ్య‌క్తి స్వ‌యంగా అంగీక‌రించాడు. బెంగ‌ళూర్‌ లోని ఒక ల్యాండ్ డీల్ విష‌యంలో వ‌చ్చిన డ‌బ్బుని వాటాలుగా పంచుకునే విష‌యంలో ఎర్రగంగిరెడ్డితో తలెత్తిన విభేదాల‌తోనే ఈ హ‌త్య చేసిన‌ట్టు ద‌స్త‌గిరి వాంగ్మూలంలో చెప్పాడు. త‌న త‌ల్లిని కోరుకుంటున్నాడ‌నే కోపంతో సునీల్ యాద‌వ్ అనే వ్య‌క్తి వివేకా మ‌ర్మాంగాల‌పై కొట్టి చంపిన‌ట్టు వాంగ్మూలం ఇచ్చాడు. గ‌జ్జ‌ల ఉమాశంక‌ర్‌ రెడ్డి, సునీల్ యాద‌వ్‌లు క‌లిసి కొన్ని పేప‌ర్ల కోసం వెతికార‌ని చార్జిషీట్‌లో ఉంది. లోతుగా విచార‌ణ జ‌రిపితే చ‌నిపోయిన వ్య‌క్తికి చెడ్డ‌ పేరు వ‌స్తుంది. ఆ కార‌ణంతోనే వివేకా గురించి మాట్లాడాల్సి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఎంపీ వైయ‌స్ అవినాశ్ రెడ్డి గారు త‌న‌ని తాను నిలువ‌రించుకున్నారు. అలాంటి అవినాశ్ మీద సునీతమ్మ ఆరోప‌ణ‌లు చేయ‌డం బాధాక‌రం. పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఆయ‌న రాజ‌కీయ జీవితంలో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఆరోప‌ణ‌లు లేవు. 

- ఆదినారాయ‌ణ రెడ్డి చెప్పిందీ గుండెపోటు అనేగా..

వివేకానంద‌ రెడ్డి ర‌క్త‌పు వాంతులు చేసుకుని మ‌ర‌ణించిన‌ట్టు అవినాశ్‌ రెడ్డి ప్ర‌చారం చేశాడ‌ని, చ‌నిపోయిన త‌ర్వాత ఆ ప్ర‌దేశంలో ఆధారాలు చెరిపేశాడ‌ని ఆయ‌న మీద ఉన్న అభియోగాలు. స‌రిగ్గా ఇవే విష‌యాల‌ను ఆనాటి మంత్రి ఆదినారాయ‌ణ‌ రెడ్డి సైతం చెప్పాడు. వివేకానంద‌ రెడ్డిగారు గుండెపోటుతో మ‌ర‌ణించాడ‌ని, ర‌క్త‌పు వాంతులు చేసుకుని చ‌నిపోయాడ‌ని చెప్పాడు. ఇదే విష‌యాన్ని త‌న‌కు వివేకా బామ్మ‌ర్ది శివప్ర‌కాష్‌ రెడ్డి చెప్పిన‌ట్టు మీడియా సాక్షిగా వివ‌రించాడు. కానీ ఆయ‌న స్టేట్‌మెంట్‌ను ఎందుకు ప్రామాణికంగా తీసుకోవ‌డం లేదు?  వివేకా గారు చ‌నిపోయే నాటికి అవినాశ్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇచ్చార‌ని, ఆయ‌న గెలుపు కోసం వివేకా గారు ప్ర‌చారం చేస్తున్నార‌ని నిన్న ప్రెస్‌మీట్ లో ష‌ర్మిల గారే అంగీక‌రించారు. పార్టీ అధ్య‌క్షుడిగా అవినాశ్ రెడ్డి గారికి వైయ‌స్ జ‌గ‌న్ గారు ఎంపీ సీటిచ్చాక మ‌ధ్య‌లో మీమాంస ఏముంటుంది? 

- టీడీపీ ప్ర‌తిష్ట రోడ్డున ప‌డ‌టంతో...

తిరుమ‌ల ల‌డ్డూ విష‌యంలో హెరిటేజ్ పాత్ర బ‌య‌ట‌ప‌డింది. హెరిటేజ్‌కి ల‌బ్ధి చేకూర్చ‌డానికే చంద్ర‌బాబు తిరుమ‌ల ల‌డ్డూ ప్ర‌సాదానికి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిపిన‌ట్టు త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేసిన‌ట్టు రుజువులు ల‌భ్య‌మ‌య్యాయి. దీంతో ఆయ‌న ప్ర‌తిష్ట పూర్తిగా దెబ్బ‌తింది. బీఆర్ నాయుడి రాస‌లీల‌ల వీడియో బ‌య‌ట‌కొచ్చింది. ఇప్పుడు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ వ్య‌వ‌హారంతో దేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరువు వీధిన‌ ప‌డింది. వీట‌న్నింటి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి చంద్ర‌బాబు అక్క‌చెల్లెల్లు ష‌ర్మిల‌, సునీత‌ల‌ను రంగంలోకి దించి వివేకా హ‌త్య పేరుతో రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌ని చూస్తున్నాడు. 2029 ఎన్నిక‌ల వ‌ర‌కు కూడా ఈ కేసును స‌జీవంగా ఉంచ‌డమే చంద్ర‌బాబు ల‌క్ష్యం. 

- అవినాశ్ సిద్ధం.. మీరు సిద్ధ‌మా? 

వివేకా హ‌త్య‌పై మీడియా సాక్షిగా సునీత‌, ష‌ర్మిల‌మ్మ‌ల‌తో డిబేట్‌కి వైయ‌స్ అనినాశ్ రెడ్డి గారు సిద్ధం. వారు సిద్ధ‌మా? అలాకాదంటే వారు కోరుకున్న దేవుడి ఎదుట కుటుంబ స‌భ్యుల సాక్షిగా ప్ర‌మాణం చేయ‌డానికి కూడా ఆయ‌న సిద్ధం. అంతేకానీ చంద్ర‌బాబు ఉచ్చులో ప‌డి ఆయ‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం పావులుగా మారొద్ద‌ని చెబుతున్నా. చంద్ర‌బాబు కేసులు వాదిస్తూ గంట‌కు కోట్ల‌ల్లో ఫీజులు తీసుకునే సిద్ధార్థ లూథ్రా సునీత‌మ్మ‌కి లాయ‌ర్‌గా ఉన్నాడు. అత‌డే వివేకాను చంపాన‌ని ఒప్పుకున్న దస్త‌గిరికీ లాయ‌ర్‌గా ఉన్నాడు. ఇదొక్క పాయింట్ చాలు చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఆయ‌న ఆడ‌మ‌న్న‌ట్టల్లా సునీతమ్మ ఆడుతున్నార‌ని. వీళ్లంతా ఒక్క‌టేన‌ని తేలిపోయింది. సునీత‌మ్మ తాను కోరిన‌ట్టుగా విచార‌ణ జ‌ర‌గాలి, కోరిన వారిని ముద్దాయిలుగా చేర్చి విచారించాలి. చెప్పిన వారికి శిక్ష ప‌డాలి అనుకుంటే కోర్టులు, విచార‌ణ దేనికి?  చంద్ర‌బాబు రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు నెర‌వేర్చ‌డానికి సుప్రీంకోర్టు, సీబీఐ ప‌నిచేయ‌డం లేదని ఆమెకి తెలుసో లేదో అని సతీష్ కుమార్ రెడ్డి అన్నారు.

Back to Top