16 స‌ర్వీసుల‌కూ ఉచిత బ‌స్సు వ‌ర్తింప‌జేయాలి

5 ఆర్టీసీ స‌ర్వీసుల‌కే వ‌ర్తింప‌జేయ‌డం హేయం

దివ్యాంగుల సంక్షేమంపై చిత్త‌శుద్ధి ఉంటే అమలు చేయండి 

కూట‌మి ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేసిన వైయ‌స్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు పులిపాటి దుర్గారెడ్డి 
తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన  వైయ‌స్ఆర్‌సీపీ  దివ్యాంగుల విభాగం రాష్ట్ర 
అధ్య‌క్షుడు పులిపాటి దుర్గారెడ్డి 

దివ్యాంగుల జీవితాల‌ను మార్చేసిన‌ట్టు చంద్ర‌బాబు ప్ర‌చార ఆర్భాటం

ఇప్ప‌టికే ఆర్టీసీ చార్జీలో 50 శాతం స‌బ్సిడీ అమ‌ల్లో ఉంది 

ఇంద్ర‌ధ‌న‌స్సు పేరుతో ఇచ్చిన 7 హామీలు నెర‌వేర్చాలి 

రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న‌ బ్యాక్‌లాగ్ పోస్టులు భ‌ర్తీ చేయాలి

స‌ద‌రం స‌ర్టిఫికెట్‌ల వెరిఫికేష‌న్‌ పేరుతో వేధింపులు ఆపండి

ఎన్నిక‌ల హామీలు త‌క్ష‌ణం నెర‌వేర్చ‌క‌పోతే ఉద్య‌మ‌మే 

ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించిన పులిపాటి దుర్గారెడ్డి  

తాడేప‌ల్లి: కేవ‌లం 5 స‌ర్వీసుల్లో మాత్ర‌మే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తూ దివ్యాంగుల జీవితాల‌ను మార్చేసిన‌ట్టు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నారా లోకేష్‌లు బ‌స్సెక్కి హ‌డావుడి చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు పులిపాటి దుర్గారెడ్డి స్ప‌ష్టం చేశారు. తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఇప్ప‌టికే దివ్యాంగుల‌కు ప్ర‌యాణ చార్జీలో 50 శాతం సబ్సిడీ ఉంద‌ని ఆయ‌న చెప్పారు. చంద్ర‌బాబుకి దివ్యాంగుల సంక్షేమం ప‌ట్ల చిత్తశుద్ధి ఉంటే మొత్తం 16 బ‌స్సు స‌ర్వీసుల్లోనూ ఉచిత బ‌స్సు ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని, దివ్యాంగుల‌తోపాటు స‌హాయ‌కుల‌కు కూడా 50శాతం స‌బ్సిడీ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక దివ్యాంగుల బ‌తుకు భారంగా మారింద‌ని, ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం అమ‌లు చేయ‌క‌పోగా సద‌రం స‌ర్టిఫికెట్‌ల పేరుతో వేధిస్తున్నార‌ని మండిప‌డ్డారు. దివ్యాంగుల‌కు హ‌క్కుగా అమ‌లు చేయాల్సిన కార్య‌క్ర‌మాల‌ను సైతం చేయ‌క‌పోగా ఉద్ధ‌రించేసిన‌ట్టు ప్ర‌చారం చేసుకోవ‌డం సిగ్గుచేట‌ని చెప్పారు. ఇంద్ర‌ధ‌న‌స్సు పేరుతో ఇచ్చిన ఏడు హామీల‌ను త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని పులిపాటి దుర్గారెడ్డి  డిమాండ్ చేశారు. 
ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే

ప్ర‌చార ఆర్భాటంతో స‌రి
కేవ‌లం 5 ఆర్టీసీ స‌ర్వీసుల్లోనే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసిన‌ట్టు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌చారం చేసుకుంటోంది. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మంత్రి నారా లోకేష్ దివ్యాంగుల‌కు మేలు చేసిన‌ట్టు ఆర్భాటంగా మంగ‌ళ‌గిరిలో బ‌స్సెక్కి హ‌డావుడి చేశారు. ఇప్ప‌టికే దివ్యాంగుల‌కు ఆర్టీసీ బ‌స్సు చార్జీలో 50 శాతం స‌బ్సిడీ ప‌థ‌కం అమ‌ల్లో ఉంది. ఇప్పుడు చంద్ర‌బాబు క‌ల్పిస్తున్న‌ది కేవ‌లం 50 శాతం మాత్ర‌మే. అది కూడా 5 స‌ర్వీసుల‌కే వ‌ర్తింప‌జేస్తున్నారు. చంద్ర‌బాబుకి దివ్యాంగుల సంక్షేమం ప‌ట్ల చిత్త‌శుద్ధి ఉంటే మిగిలిన 11 స‌ర్వీసుల్లోనూ ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించేవాడు. వారితోపాటు వ‌చ్చే స‌హాయ‌కులకు 50 శాతం రాయితీని అన్ని ఆర్టీసీ స‌ర్వీసుల్లో వ‌ర్తింప‌జేసేవారు. టిడ్కో ఇళ్ల‌లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఇళ్లు కేటాయిస్తామ‌ని చెప్పినా రెండేళ్ల‌లో ఒక్క ఇల్లు ఇచ్చింది లేదు. అమ‌రావ‌తిలో దివ్యాంగుల‌కు దివ్యాంగ భ‌వ‌న్ క‌డ‌తామ‌ని చెప్పారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌డం లేదు. కానీ చంద్ర‌బాబు, ప‌వ‌న్ కళ్యాణ్‌లు రాజ‌భ‌వ‌నాలు నిర్మించుకుంటున్నారు. 

2016 చ‌ట్టం అమ‌లు చేయాలి

ఇప్ప‌టికే మూడు బడ్జెట్‌లు ప్ర‌వేశ‌పెట్టిన కూట‌మి ప్ర‌భుత్వం, వాటిలో ఎక్క‌డా దివ్యాంగుల ఊసే ఎత్త‌లేదు. 2016 చ‌ట్టం ప్ర‌కారం రాష్ట్ర బ‌డ్జెట్‌లో 4 శాతం నిధులు అంటే రూ.12వేల కోట్లు దివ్యాంగుల సంక్షేమానికి కేటాయించాలి. కానీ రెండేళ్ల‌లో కనీసం రూ.100 కోట్లు కూడా కేటాయించ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గానికి 5 ట్రై మోటార్ సైకిళ్లు ఇస్తామ‌ని చెప్పినా అర‌కొర‌గా పంపిణీ చేయ‌డానికి అధికారులు సిద్ధ‌మయ్యారు. ఆ ఇచ్చే వాటిని కూడా అర్హులైన వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది. ఇంద్ర ధ‌నస్సు పేరుతో దివ్యాంగుల‌కు ప్ర‌క‌టించిన ఏడు వ‌రాలను త‌క్ష‌ణం నెర‌వేర్చాలి.  

దివ్యాంగులు ఎక్క‌డికెళ్లినా ఇబ్బందులు

చంద్ర‌బాబు దివ్యాంగుల‌కు ఎన్నిక‌ల్లో ఇచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చ‌క‌పోగా అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఎన్నో విధాలుగా వేధిస్తున్నాడు. గ‌తంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హ‌యాంలో 365 రోజుల‌పాటు ఎప్పుడైనా సద‌రం స‌ర్టిఫికెట్‌ల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వ‌లంటీర్ వ్య‌వ‌స్థ ద్వారా డాక్టర్లు నేరుగా ఇంటికొచ్చి వైద్య ప‌రీక్ష‌లు నిర్వహించి స‌ర్టిఫికెట్‌లు అంద‌జేసేవారు. కానీ నేడు కూట‌మి పాల‌న‌లో సోమ‌, మంగ‌ళ‌వారాలు మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకునే నిబంధ‌న పెట్టారు. పైగా వైద్య ప‌రీక్షల కోసం సొంత జిల్లాల‌కు కాకుండా ప‌క్క జిల్లాల‌కు వెళ్లే నిబంధ‌న పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పైగా సద‌రం స‌ర్టిఫికెట్‌ల‌లో త‌ప్పులు దొర్లితే వాటిని స‌రిచేసుకునే అవ‌కాశం కూడా ఉండటం లేదు. డిజెబిలిటీ శాతం త‌క్కువగా చూపించి పింఛ‌న్లలో కోత‌లు విధిస్తున్నారు. పింఛ‌న్ల మీద ఆధార‌ప‌డి బతుకుతున్న దివ్యాంగులకు పింఛ‌న్లు తీసేసి వారి బ‌తుకుల‌ను చంద్ర‌బాబు అంధ‌కారంలోకి నెట్టేశాడు. రెండేళ్ల‌లో పింఛ‌న్లు తీసేయ‌డ‌మే కానీ, దివ్యాంగుల‌కు కొత్త‌గా ఒక్క పింఛ‌న్ ఇచ్చిన పాపాన‌పోలేదు. గ‌తంలో దివ్యాంగుల‌కు అందజేసే ట్రై మోటార్ సైకిళ్లు, హియ‌రింగ్ యంత్రాలు, బ్లైండ్ ప‌ర్స‌న్స్ కి స్టిక్స్ వంటివి ఇవ్వడం ఆపేశారు. దివ్యాంగుల పిల్ల‌ల‌కు ప్ర‌త్యేకమైన స్కూల్స్, ప్ర‌త్యేక వైద్య‌సేవ‌లు చేస్తామ‌ని మేనిఫెస్టోలో ప్ర‌క‌టించి మోస‌గించారు. దివ్యాంగ విద్యార్థుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో అందే స్కాల‌ర్ షిప్‌లు కూడా అంద‌కుండా చేశారు. ప్ర‌భుత్వ కాలేజీలు, స్కూల్స్‌, ఆస్ప‌త్రులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ర్యాంపులు, వీల్ చైర్లు ఉండ‌టం లేదు. దివ్యాంగుల‌కు హ‌క్కుగా ద‌క్కాల్సిన సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం లేదు. దివ్యాంగులు ఆల‌యాల‌కు వెళ్లినా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. కూట‌మి పాల‌న వ‌చ్చాక దివ్యాంగుల బ‌తుకులు భారంగా గ‌డుస్తున్నాయి. అధికారులు తిప్పించుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. 

బ్యాక్ లాగ్ పోస్టుల భ‌ర్తీ ఎప్పుడు? 
వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున రోడ్డెక్కి ఉద్య‌మిస్తే కానీ 2024-25, 2025-26 బ్యాక్ లాగ్ ఉద్యోగాల కోసం ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ ఇవ్వ‌లేదు. తూతూమంత్రంగా క‌డ‌ప‌, అనంత‌పురం, కృష్ణా జిల్లాల్లో నోటిఫికేష‌న్ ఇప్పించారు. కానీ ఇంత‌వ‌ర‌కు ఆ ప్ర‌క్రియ మొదలుకాలేదు. 3 జిల్లాల్లో నోటిఫికేష‌న్ ఇచ్చేస్తే మిగ‌తా జిల్లాల ప‌రిస్థితి ఏంటో ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో రుణ స‌బ్సిడీలు ఇచ్చి స్వ‌యం ఉపాధికి స‌హ‌క‌రించ‌డంతోపాటు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహ‌కాలు క‌ల్పించ‌డం జ‌రిగింది. కానీ నేడు ఆ ప‌రిస్థితి ఎక్కడా క‌నిపించ‌డం లేదు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నిర్వీర్యం చేయ‌డంతో దివ్యాంగుల‌కే ఎక్కువ న‌ష్టం జ‌రిగింది. ప్రైవేట్ ఆస్ప‌త్రులకు వెళ్లి వైద్యం చేయించుకోవాలంటే బిల్లులు గురించి ఆలోచిస్తే గుండెలు అదిరిపోతున్నాయి. దివ్యాంగుల‌కు ఇచ్చిన హామీల‌ను త‌క్ష‌ణం నెర‌వేర్చ‌క‌పోతే వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తామ‌ని పులిపాటి దుర్గారెడ్డి ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

Back to Top