ఎన్టీఆర్ జిల్లా: జగ్గయ్యపేటలో మొక్కజొన్న రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల వద్దకు వెళ్లి పంట పరిస్థితిని పరిశీలించిన ఆయన, ప్రభుత్వాన్ని తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన క్వింటాకు రూ.2400 మద్దతు ధర రైతులకు అందకపోవడం ప్రధాన సమస్యగా మారింది. దళారులు మాత్రం రూ.1600–1700కే కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని ఆరోపించారు. రైతుల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, మార్కెఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధరల స్థిరీకరణ నిధి అమలు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎకరాకు సగటున 50 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నప్పటికీ సరైన ధర లేక రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని పేర్కొన్నారు. దళారుల దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని నాయకులు, రైతులు కోరుతున్నారు.