తాడేపల్లి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు, శ్రీమతి వైయస్ భారతి రెడ్డి దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాతో కార్యక్రమానికి విచ్చేసిన వైయస్ జగన్ గారికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణం కార్యక్రమానికి వచ్చిన జగన్ దంపతులకు పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు ఆహ్వానం పలికారు. ఈ వేడుకల కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక వేదికను పూజా మందిరంలా అలంకరించారు. శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం ప్రముఖ పండితుడు పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం వినిపించారు. అనంతరం వేద పండితులు వైయస్ జగన్ దంపతులకు ఆశీర్వచనం అందించి, తీర్ధప్రసాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలతో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటున్న అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో పంచాంగ శ్రవణం చేసిన పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రితో పాటు వేద పండితులను వైయస్ జగన్ గారు సన్మానించారు.