శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సీనియర్ జర్నలిస్టు, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి(మీడియా) పూడి శ్రీహరి అరెస్టుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టుల సమాఖ్యలు, ప్రజా సంఘాలు ఈ అరెస్టును అప్రజాస్వామికంగా పేర్కొంటూ వెంటనే కేసులు రద్దు చేసి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాకుళంలో జర్నలిస్టుల సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదని ఆరోపించారు. అరెస్టు సమయంలో నోటీసులు ఇవ్వకపోవడం, విధివిధానాలు పాటించకపోవడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల విధి నిర్వహణకు రక్షణ కల్పించాలని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా జర్నలిస్టు సంఘాలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టాయి. శ్రీహరి అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫారంలో లేకపోవడం, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకపోవడం వంటి అంశాలు మానవ హక్కుల ఉల్లంఘనగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విస్మరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇప్పటికే Arnesh Kumar vs State of Bihar కేసులో 7 ఏళ్లలోపు శిక్ష ఉన్న కేసుల్లో నేరుగా అరెస్టు చేయకుండా ముందుగా నోటీసులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే D.K. Basu vs State of West Bengal తీర్పులో అరెస్టు సమయంలో పోలీసులు తప్పనిసరిగా గుర్తింపు వివరాలతో, విధి నియమాలను పాటించాలని పేర్కొంది. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించడం రాజ్యాంగ విరుద్ధమని జర్నలిస్టు సంఘాలు పేర్కొంటున్నాయి. జర్నలిజం ప్రజాస్వామ్యంలో నాల్గవ స్తంభమని గుర్తుచేస్తూ, సోషల్ మీడియా కార్యకర్తలు, మీడియా ప్రతినిధులపై జరుగుతున్న చర్యలు మానవ హక్కులకు విరుద్ధమని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అక్రమ కేసులను ఉపసంహరించుకుని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.