తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుచి డిస్మిస్ చేయడం దుర్మార్గమని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖరరెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం కాకర్ల వెంకటరామిరెడ్డిని సర్వీసు నుండి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సహాయ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న వెంకటరామిరెడ్డిపై కూటమి ప్రభుత్వం అన్యాయంగా “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాన్ని పూర్తిగా డిస్మిస్ చేయడం అత్యంత కఠిన చర్యగా అభివర్ణించిన చంద్రశేఖరరెడ్డి, ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. “ఇంకా 14 సంవత్సరాలపాటు ప్రభుత్వ సేవ మిగిలి ఉన్నప్పటికీ ఇంత పెద్ద శిక్ష విధించడం అమానుషం. ఇది కేవలం పరిపాలనా చర్య కాదు, రాజకీయ వేధింపుల భాగం” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఉద్యోగులపై ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవడం వల్ల భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే పునఃపరిశీలించి, వెంకటరామిరెడ్డిని తిరిగి సేవలోకి తీసుకోవాలని ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల సంఘాలు ఆందోళనలకు దిగే అవకాశం ఉందని చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.