రాజమండ్రి: నగరంలోని దేవి చౌక్ పరిసర ప్రాంతంలో ఉన్న గౌతమీ సూపర్ బజార్ అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ మార్గాని భరత్, రాజమండ్రి పార్లమెంట్ సమన్వయకర్త డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ, గత ఎన్నికల సమయంలో గౌతమీ సూపర్ బజార్ విషయంలో తాను ఐదు కోట్ల ముడుపులు తీసుకున్నానని ప్రస్తుత ఎమ్మెల్యే వేల కరపత్రాలు పంచారని విమర్శించారు. అయితే హైకోర్టులో పిటిషన్ వేసి కూల్చివేతకు ఆదేశాలు తెచ్చుకోవడం ద్వారా తన నిజాయితీని నిరూపించుకున్నానని తెలిపారు. ఇప్పుడు అసలు ముడుపులు తీసుకున్నది ఎవరో ప్రజలకు స్పష్టమైందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా గౌతమీ సూపర్ బజార్ నిర్మాణం జరిగిందని, సెల్లార్ పార్కింగ్ లేకుండా, తూర్పు వైపు 13 అడుగులు, ఉత్తరం వైపు 19 అడుగులు విడిచిపెట్టకుండా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. పోసిషన్ సర్టిఫికెట్ లేకుండానే షాపులను అద్దెకు ఇవ్వడం అప్రజాస్వామ్యమని అన్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించడంలేదని విమర్శించిన భరత్, జిల్లా కలెక్టర్ మరియు మున్సిపల్ ప్లానింగ్ అధికారులను ఉద్దేశించి కోర్టు ఆదేశాలను గౌరవించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో నిరసనలు మరింత ఉధృతం చేసి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. “చట్టానికి గౌరవం లేదు, ప్రజల సమస్యలపై శ్రద్ధ లేదు, అభివృద్ధి శూన్యం – ముడుపుల రాజకీయాలకు ఇది నిదర్శనం” అని భరత్ విమర్శించారు. తదనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో హైకోర్టు ఆదేశాలు అమలు చేసి అక్రమ కట్టడాలను కూల్చివేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, విభాగాల అధ్యక్షులు, వార్డు ఇంచార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.