ఇబ్రహీంపట్నం: ప్రభుత్వ అరాచకాలు ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారని, నాగరిక సమాజం తల దించుకునేలా చంద్రబాబు చర్యలు ఉన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు హేయం అన్న ఆయన, అందరూ చూస్తుండగా గంటలకొద్దీ సర్వం విధ్వంసం చేశారని వెల్లడించారు. అక్కడ అంబటి రాంబాబు, ఇక్కడ జోగి రమేష్ తండ్రిపై హత్యాయత్నం జరిగిందని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే రెండు చోట్ల దాడులు జరిగాయని, టీడీపీ గుండాలకు వారు అండగా ఉంటున్నారని ఆక్షేపించారు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారని, కానీ చంద్రబాబువి అబద్దాలని సీబీఐ ఛార్జ్‌షీట్ తేల్చేసిందని శ్రీ వైయస్ జగన్ గుర్తు చేశారు. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతుకొవ్వు లేదని, దాన్నే ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్‌లు నిర్థారించాయని గుర్తు చేసిన ఆయన, రాజకీయం కోసం దేవుణ్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని చురకలంటించారు. చేసిన తప్పు ఒప్పుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని, ఇప్పుడు వన్‌మ్యాన్ కమిషన్‌తో అనుకూల నివేదిక కోసం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని, అయితే ఆ కమిషన్‌కు ఏ మాత్రం విలువ ఉండదని తేల్చి చెప్పారు. తప్పు చేసిన, చేస్తున్న ఎవ్వరినీ వదలి పెట్టబోమన్న ఆయన, సుప్రీంకోర్టు తలుపు కూడా తడుతామని చెప్పారు. మరో మూడేళ్లలో వచ్చేది తమ ప్రభుత్వమే అని, ఇప్పుడు తప్పు చేస్తున్న అందరినీ బోనులో నిలబెడతామని, వారికి శిక్ష తప్పదని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో శ్రీ వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..: నాగరిక సమాజం తలదించుకునేలా: గుంటూరులో కూడా ఇలాంటి ఘటన జరిగింది. అక్కడ, ఇక్కడ చేసిన విధ్వంసం చూసి, రెండు కుటుంబాల సభ్యులను పరామర్శించడం జరిగింది. రాష్ట్రంలో జంగిల్‌రాజ్ పరిపాలన సాగుతోంది. నాగరిక ప్రపంచం అంతా తలవంచుకునేలా చంద్రబాబునాయుడు చేశారు. అక్కడ అంబటి రాంబాబు ఇంట్లో 5 కార్లను ధ్వంసం చేశారు. ఇంట్లోకి చొరబడ్డారు. అద్దాలను పగలగొట్టారు. ఇంట్లో ఆడవాళ్లను అందరిని కూడా దుర్భాషలాడారు. ఇంటి పక్కనే ఉన్న ఆఫీసులోకి వెళ్లారు. అక్కడా అంతా విధ్వంసం చేసి ఆఫీసును తగలబెట్టారు. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలో జరగడం చూశాం. అక్కడ సా.5 గం. నుంచి అర్ధరాత్రి వరకు దహనకాండ జరిగింది. ఆ మర్నాడే ఇక్కడ కూడా సాయంత్రం అదే పరంపర కొనసాగింది. జోగి రమేష్ ఇంటిపైనా దారుణంగా దాడి చేశారు. చంద్రబాబువి అబద్దాలని సీబీఐ తేల్చింది: చంద్రబాబునాయుడు అనే వ్యక్తి తాను నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతున్నాడని, నిస్సిగ్గుగా ప్రజలను పెడదోవ పట్టించాడని, సాక్షాత్తూ సీబీఐయే అన్నీ తేటతెల్లం చేస్తూ ఛార్జిషీట్ దాఖలు చేసింది. చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ, గొడ్డు మాంసం కానీ, పందికొవ్వు కానీ, చేప నూనె కాని కలపలేదని సీబీఐ స్పష్టం చేసింది. కానీ, శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా చంద్రబాబునాయుడు అన్యాయమైన దుష్ప్రచారం చేశాడు. అబద్ధాన్ని సృష్టించి రెక్కలు కట్టి దుష్ప్రచారం: చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కానంత వరకు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఎవరైనా ఇస్తే కళ్లు మూసుకుని రెండు కళ్లకూ ఇలా అద్దుకుని ఇలా తినే పరిస్థితి నుంచి వెంకటేశ్వర స్వామిని అగౌరవపర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. అలా శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని, ఆ ప్రతిష్టను దిగజార్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబే. ఒక అబద్ధాన్ని సృష్టించి, ఆ అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేశారు. కేవలం రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు ఈ ప్రపంచంలో అంటే అది ఒక్క చంద్రబాబునాయుడు మాత్రమే. ప్రతిష్టాత్మక ల్యాబ్‌లూ అవే నిర్థారించాయి: తిరుమలలో వాడిన నెయ్యిపై చంద్రబాబు చెబుతున్నవి అబద్ధాలని దేశంలోనే ప్రతిష్టాత్మకమైన నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్‌డీఆర్‌ఐ), నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ)కి చెందిన ల్యాబ్‌లు నిర్థారించాయి. ఆ మేరకు నివేదికలు ఇచ్చాయి. అవి రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. వారు పరీక్షించిన నెయ్యి శాంపిల్స్ అన్నీ కూడా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆయన మనిషి టీటీడీ ఈఓగా ఉండగా సేకరించినవే. సీబీఐ వాళ్ల ఆధ్వర్యంలో ఎన్‌డీడీబీకి, ఎన్డీఆర్‌ఐకి ఆ శాంపిల్స్ పంపారు. ఆ నెయ్యి శాంపిల్స్‌లో ఎలాంటి కల్తీ లేదని ల్యాబ్ పరీక్షల్లో తేలింది. తిరుమలలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని, గొడ్డుమాంసం లేదని, పందికొవ్వూ లేదని, ఎలాంటి చేపనూనె కూడా కలవలేదని ఆ ల్యాబ్‌లు ధృవీకరించాయి. ఆ రిపోర్టులను సీబీఐ కూడా సర్టిఫై చేసింది. సీబీఐ సిట్ ఆ మేరకు ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్‌షీట్ ఇంకా ఏమేం ప్రస్తావించింది?: ఆ ఛార్జ్‌షీట్‌లో సీబీఐ మరో విషయం కూడా చెప్పింది. గతంలో టీటీడీ చైర్మన్లుగా వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఉన్నప్పుడు, వాళ్లు ఎలాంటి తప్పు చేయలేదని, అన్యాయమైన పనులు చేయలేదని స్పష్టం చేసింది. అందుకే వారి పేర్లు ఛార్జ్‌షీట్‌లో పెట్టలేదు. వారిలో ఎవరినీ అరెస్టు చేయలేదు. అంటే సీబీఐ వారికి క్లీన్‌చిట్ కూడా ఇచ్చింది. ఇదొక్కటే కాదు సీబీఐ చేసింది. ఆ ఛార్జ్‌షీట్‌లో మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. అందులోని పేజీ నెం:62లో ఒక విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత, 2024, జూలై 25న, నెయ్యిలో నాణ్యత లేదని టీటీడీ 4 ట్యాంకర్లను రిజెక్ట్ చేసింది. (అంటూ ఆ రిపోర్టు చదివి వినిపించారు) ఇంకా అదే ఛార్జ్‌షీట్ పేజీ నెం:64, పేజీ నెం:44లో రాసిన అంశాలను కూడా చదివి వినిపించారు. అంటే, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా.. 2024, జూలై 25న టీటీడీ వాళ్లు నాలుగు ట్యాంకర్లను రిజెక్ట్ చేశారు. ఆ రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్లీ ఇదే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్న ఇదే పీరియడ్లోనే, దొడ్డిదారిన వేరేవాళ్ల పేరుతో తిరిగి వస్తే, వాటిని టీటీడీ ఆమోదించింది. అవే ట్యాంకర్ల నెయ్యిని లడ్డూ తయారీకి వాడారని, స్వయంగా సీబీఐ వెల్లడించింది. అలా చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వం మీద, వాళ్లు చేసిన తప్పు మీద, వాళ్లు చేసిన అన్యాయం మీద ఛార్జ్‌షీట్‌లో రాశారు. మరి పాపం చేసింది ఎవరు?: ఏకంగా సీబీఐయే చంద్రబాబునాయుడుగారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జిషీట్లో ఫైల్ చేసిన తర్వాత చూస్తే.. అసలు పాపం చేసిన వాళ్లు ఎవరు? అని నేను చంద్రబాబును, ఆయన కొడుకును, కూటమిలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నాను. ఇదే టీటీడీ నెయ్యిలో చేపల నూనె కలిసిందని, గొడ్డు కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు? సీబీఐ చెప్పిందా? ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ ల్యాబ్ రిపోర్టులు చెప్పాయా?. ఎవరు చెప్పారు అంటే.. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్, పవన్‌కళ్యాణ్‌తో పాటు, రోజూ వారి పల్లకి మోస్తున్న ఎల్లో మీడియా (ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5) ప్రచారం చేశాయి. వీళ్లు తప్ప ఎవరైనా చెప్పారా?. లేని ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం కన్నా హేయమైన చర్య ఇంకోటి ఉంటుందా?. సీబీఐ సిట్ ఛార్జిషీట్ వేసిన తర్వాత అయినా చంద్రబాబు చేయాల్సిన పని ఏంటంటే.. శ్రీవేంకటేశ్వరస్వామి ముందు లెంపలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. కనీసం మానవత్వం ఉన్న మనిషైతే చంద్రబాబునాయుడు అలాంటి పని ఎందుకు చేయడం లేదు?. పూజలు చేయడం తప్పా?: మానవత్వం లేని చంద్రబాబుని ప్రశ్నిస్తూ ఆయనకు దేవుడు జ్ఞానోదయం కలిగించాలని ప్రార్థిస్తూ మా నాయకులు ఆలయాల్లో పూజలు చేశారు. ఆయనకు, ఆయన కొడుకు లోకేష్‌కి, కూటమిలోనే ఉన్న పవన్‌కళ్యాణ్‌తోపాటు ఇతర నాయకులకు బుద్ధి జ్ఞానం కలగాలని, వారి చిప్ రిపేర్ చేయాలని మా నాయకులంతా గుళ్లల్లో పూజలు చేశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి దుష్ప్రచారం చేస్తూ శ్రీవారి ప్రతిష్టను మంట కలిపేస్తుంటే మా వాళ్లు గుళ్లలో పూజలు చేయడం తప్పా?. చంద్రబాబు ఆ పని చేయడం న్యాయమా? ధర్మమా?: చంద్రబాబు ఆరోపణలు పచ్చి అబద్దమని అంత స్పష్టంగా అన్ని విధాలుగా తేలిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబునాయుడు ఫ్లెక్సీలు కట్టి తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా దుష్ప్రచారం చేయడం న్యాయమేనా? ధర్మమేనా?. ఆ ఫ్లెక్సీల్లో అన్యాయమైన మాటలు రాసి దుష్ప్రచారం చేయడం న్యాయమేనా?. ఇంకా సీబీఐ సిట్ ఛార్జిషీట్‌లో పొందుపరిచిన వాస్తవాలను చూపించి ఎవరైనా చంద్రబాబుని ప్రశ్నిస్తే ఆయనకు అసహనం వచ్చి మా నాయకుల మీద దాడులు చేయించే నీచ స్థాయికి దిగజారిపోయాడు. అందులో భాగంగానే వరుసపెట్టి మా నాయకులు విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి మీద దాడి చేయడమే కాకుండా అంబటి రాంబాబు ఇంటి మీద కూడా దాడి చేశారు. సలహా ఇవ్వడం తప్పా? అందుకు ఇంత విధ్వంసమా?: చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రశ్నిస్తూ మా నాయకుడు జోగి రమేష్.. మీ చిప్ రిపేర్ చేసుకోమని సలహా ఇచ్చాడు. దానికి ఇంత అన్యాయమైన పని చేయడం ధర్మమేనా? సలహా ఇవ్వడం మినహా జోగి రమేష్ ఏమీ చేయలేదు. దానికే చంద్రబాబుకి అసహనం ఏస్థాయిలో వచ్చింది అంటే.. ఏకంగా యాసిడ్ బాటిల్స్, పెట్రోల్ బాంబులతో జోగి రమేష్ ఇంటి మీద దాడులు చేయించాడు. ఆ యాసిడ్ పడిన ప్రాంతంలో బండలు కూడా తీవ్రంగా కాలిపోయాయి. గోడల నిండా యాసిడ్ మరకలు కనిపిస్తున్నాయి. యాసిడ్ పడి డోర్లు కాలిపొయాయి. ఆ పక్కనే ఉన్న స్విచ్చ్ బోర్డుల మీద పడి షార్ట్ సర్క్యూట్ జరిగి ఉంటే పెద్ద ఘోరం జరిగి ఉండేది. ఇంట్లో ఉన్న కర్టెన్లు, ఉడెన్ ఫర్నీచర్లు కాలిపోతే పరిస్థితి తీవ్రరూపం దాల్చేది. ఇంట్లో లేవలేని పరిస్థితిలో 80 ఏళ్ల వయసున్న జోగి రమేష్ నాన్న నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా? ఇలా చేయడం ధర్మమేనా?. బీసీ నాయకుడిగా జోగి రమేష్ ఎదుగుతుంటే, ఆయన ప్రభుత్వ తప్పులపై తన వాయిస్ బలంగా వినిపిస్తుంటే ఆ గొంతు నొక్కే కుట్రలో భాగంగానే చంద్రబాబు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో దాడులు చేయిస్తున్నాడు. ఇది ధర్మమేనా అని ఆలోచించమని అడుగుతున్నా. పోలీసులతో కలిసి టీడీపీ కుట్ర. వారి సమక్షంలోనే అంతా: జోగి రమేష్ ఇంటి మీద సా. 5 గం,కు దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పోలీసులు, తెలుగుదేశం వ్యక్తులు ఏ రకంగా కుట్రలు చేశారనే దానికి ఈ ఫోటోనే సాక్ష్యం. (అంటూ పోలీసులతో టీడీపీ నాయకులు మంతనాలు జరుపుతున్న ఫొటో చూపారు). ఇదే సర్కిల్‌లోనే డీసీపీ రామకృష్ణ, ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్‌తో టీడీపీ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు దాడులకు సంబంధించి వ్యూహరచన చేశాడు. జోగి రమేష్‌ను హత్య చేసి, ఇంటి మీద దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసే కుట్రలకు ఇక్కడే పోలీసులతో టీడీపీ నాయకుడు మంతనాలు జరిపాడని క్లియర్ గా తెలిసిపోతుంది. హత్యా ప్రయత్నం ఎలా చేయాలి? ఆ దాడికి పోలీసులు ఎలా సహరించాలో దాడి చేయడానికి ముందు పథక రచన చేశారు. ఏకంగా పోలీసులే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్నం 2 గం. సమయంలో మంతనాలు జరిపారు. ఆ తర్వాత పోలీసులతో కలిసి టీడీపీ నాయకులు జోగి రమేష్ ఇంటి మీద దాడులకు కుట్ర చేశారు. టీడీపీ నాయకులు ఏకంగా పోలీసులనే వెంటబెట్టుకుని కలిసికట్టుగా జోగి రమేష్ ఇంటికే వచ్చి దాడికి దిగారు. ఇవిగో పచ్చి నిజాలు. సాక్ష్యాలు: టీడీపీ నాయకుడు ఫతావుల్లా ఏకంగా యాసిడ్ బాటిల్, పెట్రోల్ బాంబులతో దాడి చేశాడు. ఇతడు దాడికి ముందే వాటితో వచ్చిన ఫొటోలు కూడా క్లియర్‌గా చూడొచ్చు. పోలీసుల సమక్షంలోనే ఇంటి మీదకు పెట్రోల్ బాంబులు విసిరి నిప్పంటించాడు. ఫతావుల్లాతోపాటు ఆశా అనే టీడీపీ కార్యకర్త కూడా వచ్చి జోగి రమేష్ ఇంటి మీద పోలీసుల సమక్షంలోనే రాళ్ల దాడి చేసింది. ఆ ఆశ కూతురి పెళ్లికి చంద్రబాబు కూడా హాజరయ్యాడు. (అంటూ చంద్రబాబు, లోకేష్, హోంమంత్రితో వారు దిగిన, ఆశా కూతురు పెళ్లికి హాజరైన చంద్రబాబు ఫోటోలు చూపించారు) (ఇంకా పోలీసులతోనే వచ్చి వారి సమక్షంలోనే టీడీపీ నాయకులు దాడికి దిగిన వీడియోలు కూడా చూపారు) టీడీపీ నాయకుడు సుబ్బారావు, డీసీపీ, సీఐ మంతనాలు జరుపుతున్న దృశ్యాలు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోలీసులతో కలిసి టీడీపీ శ్రేణులు వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. టీడీపీ నాయకుడు బాటిల్ ఎగరేస్తూ, పోలీసులతో కలిసి జోగి రమేష్ ఇంటి వద్దకు వచ్చిన వీడియో క్లిప్పింగ్స్‌ను మీకు చూపిస్తున్నాం.. అంటూ ప్రతి ఒక్కటీ శ్రీ వైయస్ జగన్ వివరించారు. నాగరిక ప్రపంచంలో ఉన్నామా? జంగీల్‌రాజ్‌లో ఉన్నామా?: మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా? లేక జంగిల్ రాజ్‌లో ఉన్నామా? అన్నది ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. జోగి రమేష్ అక్రమ కల్తీ లిక్కర్ కేసుకు సంబంధించి తంబళ్లపల్లె కోర్టుకు హాజరయ్యేందుకు వెళ్తుండగా, ఇక్కడ ఇబ్రహీంపట్నంలోని తన ఇంటిపై దాడి జరిగినట్టు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విజయవాడ సీపీకి ఫిర్యాదు చేయాలని జోగి రమేష్ ఫోన్ చేసినా స్పందించలేదు. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఇటీవల జరిగిన దాడి కూడా ఇలాగే జరిగింది. సా. 5 గం. నుంచి అర్ధరాత్రి వరకు అధికార పార్టీ శ్రేణులు పోలీసుల సమక్షంలోనే దాడి చేసి ఐదు కార్లు ధ్వంసం చేశారు. ఇంటి అద్దాలు పగులగొట్టారు. అన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ఎవ్వరినీ వదిలిపెట్బం: ఈ ఘటనలన్నింటికీ ఆధారాలు ఉన్నాయి. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రతి గడప తొక్కుతాం, న్యాయ పోరాటం చేస్తాం.. రాష్ట్రంలో జరుగుతున్న జంగిల్‌రాజ్‌ను దేశానికి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే రెండేళ్లు పూర్తయ్యాయి. ఇంకా మూడేళ్లే ఉంటాయి. ఆ తరువాత వచ్చేది మా ప్రభుత్వమే. ఇవాళ మా పార్టీ నాయకుల ఇళ్లపై గూండాగిరి చేసిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతాం. ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదు. అసలు చంద్రబాబుకు చిప్ సరిగ్గా ఉంటే ఇలాంటి పనులు చేయిస్తారా? తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ క్లిన్‌చిట్ ఇచ్చినా, ఎన్‌డీడీబీ, ఎన్‌డీఆర్‌ఐ ల్యాబ్‌లు ఎలాంటి జంతు కొవ్వు లేదని «ధృవీకరించినా.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, లోకేష్ తమ తీరు అస్సలు మార్చుకోవడం లేదు. ఆ కమిషన్‌కు విలువ ఉండదు: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు వక్రబుద్ధి, అబద్ధాలపై వైవీ సుబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్‌ను ఏర్పాటు చేసింది. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ఎవరూ తప్పుపట్టలేరు. ఇవాళ చంద్రబాబు తన స్వార్థం కోసం వన్‌మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. వాటికి ఎలాంటి ప్రామాణికత ఉండదు. తనకు అనుకూలంగా రిపోర్టు రాకపోతే మళ్లీ కొత్త కమిషన్ ఏర్పాటు చేసుకుని, తనకు అనుకూలమైన రిపోర్టు కోసం కుట్ర చేస్తున్నాడు. చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలి: అనిల్ సింఘాల్‌ను చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే టీటీడీ ఈవోగా నియమించారు. మా ప్రభుత్వం ఆయనను కొనసాగించింది. ఇప్పుడు మళ్లీ ఆయన్నే తీసుకువచ్చారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక శ్యామలరావును టీటీడీ ప్రక్షాళన కోసం తెచ్చానని ఆయనే చెప్పారు. కానీ ప్రక్షాళనకు ముందే ఎందుకు ఆయన్ను టీటీడీ ఈవోగా తొలగించారు? శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు కొన్ని నెయ్యి ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి. అదే ట్యాంకర్లు మళ్లీ టీటీడీకి మరో డెయిరీ పేరుతో తిరిగి వచ్చినట్టు సీబీఐ సిట్ ధృవీకరించింది. మరి పాపం చేసింది ఎవరు చంద్రబాబు? అందుకే చంద్రబాబుకు ఇకనైనా బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బీసీలంటే చంద్రబాబుకు చులకన: మాజీ మంత్రి జోగి రమేష్‌పై చంద్రబాబు ప్రభుత్వం 12 కేసులు పెట్టింది. తంబళ్లపల్లిలో నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీని టీడీపీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఏర్పాటు చేశాడు. కమీషన్ల పంపకాల్లో తేడా రావడంతో ఆ వ్యవహారం బయటపడింది. ఆ కేసులో జయచంద్రారెడ్డిని అరెస్టు చేయాల్సింది పోయి, సంబంధం లేని జోగి రమేష్‌ను కేసులో చేర్చారు. చంద్రబాబు రాజ్యంలో జోగి రమేష్ లాంటి వ్యక్తి నకిలీ లిక్కర్ తయారు చేయగలడా? ఆ లిక్కర్‌ను బెల్ట్ షాపుల్లోకి జోగి రమేష్ సరఫరా చేయగలరా?. చేయని నేరానికి 83 రోజులు జోగి రమేష్‌ను జైలులో పెట్టారు. ఆయన కుమారుడు రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారని చిన్న పిల్లాడిపై కూడా ఏడు కేసులు పెట్టారు. జోగి రమేష్ భార్యపై పోలీసులే దౌర్జన్యం చేసి, ఆమెనే దౌర్జన్యం చేసినట్లు కేసులు పెట్టారు. బీసీలపై చంద్రబాబుకు ఉన్న చులకనకు జోగి రమేష్‌పై నమోదైన కేసులే నిదర్శనం అని శ్రీ వైయస్ జగన్ వివరించారు. అదే అభిమానం: శ్రీ వైయస్ జగన్, తాడేపల్లి నుంచి వారధి, కనకదుర్గమ్య ఫ్లైఓవర్ మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్తారని స్పష్టంగా ముందుగానే తెలియజేసినా కూడా పోలీసులు అనుమతించలేదు. నగరంలో ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపి, రూట్ మార్చుకోవాలని అకస్మాత్తుగా నోటీస్ ఇచ్చారు. దీంతో తాడేపల్లి నుంచి బయలుదేరి మంగళగిరి బైపాస్, ఖాజా వెస్ట్ బైపాస్, నల్లగుంట, గుంటుపలి మీదుగా శ్రీ వైయస్ జగన్ ఇబ్రహీంపట్నం చేరుకున్నారు. అయినా అడుగడుగునా ఆయనకు ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో తాడేపల్లి నుంచి ఆ రూట్‌లో 50 కి.మీ దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం చేరుకోవడానికి 5 గం.కు పైగా పట్టింది. మరోవైపు ఎక్కడికక్కడ పోలీసులు అభిమానులు, పార్టీ కార్యకర్తలను అడ్డుకున్నారు. బారికేడ్లు పెట్టడంతో పాటు, వాహనాల్లో వస్తున్న వారిని బలవంతంగా దింపేశారు. జిల్లాలోని పలు చోట్ల నుంచి ఇబ్రహీంపట్నం బయలుదేరిన వారిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. శ్రీ వైయస్ జగన్ పర్యటనకు విశేషంగా పోటెత్తుతున్న జనవాహినిని చూస్తున్న ప్రభుత్వం తట్టుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతోంది.