తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రత విషయంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ గూండాల దాడికి గురైన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను పూర్తిగా గాలికొదిలేశారని పార్టీ నాయకులు ఆరోపించారు. జోగి రమేష్ నివాసం వద్ద పరామర్శ కార్యక్రమం ముగిసిన తర్వాత జగన్ కాన్వాయ్‌ను పోలీసులు గ్రామాలు, ఇరుకైన రహదారుల మీదుగా మళ్లించారని వైయస్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. సాధారణంగా ఉపయోగించే ప్రధాన రహదారి మీదుగానే తీసుకువస్తామని ముందుగా చెప్పి, చివరకు కాన్వాయ్‌ను వేరే మార్గాల్లోకి మళ్లించారని ఆరోపించారు. అంతేకాకుండా, ఈ మార్పుల గురించి జగన్ భద్రతా సిబ్బందికి లేదా వ్యక్తిగత సిబ్బందికి కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. ఈ ఉదయం పోలీసులు చేసిన విజ్ఞప్తి మేరకు వైయస్ఆర్‌సీపీ పూర్తిగా సహకరించిందని పార్టీ నాయకులు తెలిపారు. విజయవాడ ప్రధాన రహదారుల మీదుగా కాకుండా పోలీసులు సూచించినట్టుగా వెస్ట్రన్ బైపాస్ మార్గంలోనే జగన్ ఇబ్రహీంపట్నం వెళ్లారని వెల్లడించారు. అయితే తిరుగు ప్రయాణంలో మాత్రం ఎటువెళ్తున్నామనే సమాచారం కూడా ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించడం తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు. జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రికి తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని వైయస్ఆర్‌సీపీ ఆరోపించింది. భద్రతా ప్రమాణాలను పాటించకుండా వ్యవహరించడం అత్యంత ప్రమాదకరమని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. ఈ ఘటనను కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామని వైయస్ఆర్‌సీపీ స్పష్టం చేసింది. మాజీ ముఖ్యమంత్రుల భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు వ్యవస్థ బాధ్యతగా వ్యవహరించాలని పార్టీ నేతలు డిమాండ్ చేశారు.