టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయొద్దు

తిరుమల లడ్డూ అంశంపై చంద్రబాబు, పవన్ క‌ళ్యాణ్‌కు ఎస్వీ మోహన్ రెడ్డి హెచ్చరిక

 కర్నూలు: తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనవసరంగా వివాదాలు సృష్టిస్తున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిప‌డ్డారు. రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పేరును వాడుకోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఎస్వీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఆదేశాలతో మూడు రాష్ట్రాలకు చెందిన సీబీఐ అధికారులు దర్యాప్తు నిర్వహించి లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా నివేదించినప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా వివాదాన్ని కొనసాగిస్తున్నారని అన్నారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో కూడా జంతు కొవ్వు లేదని తేల్చినప్పటికీ చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోకుండా మితాండవాద వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డిని హిందూ సమాజం నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వివాదాన్ని రేపుతున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిష్టాత్మకమైన తిరుమల వంటి పవిత్రక్షేత్రంపై సీఎం స్థాయిలో వివాదం సృష్టించడం బాధాకరమని అన్నారు. కూటమి నేతలు పనిగట్టుకుని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తిరుపతి లడ్డూను దైవ ప్రసాదంగా భావిస్తారని, అలాంటి పవిత్రమైన ప్రసాదంపై అనుమానాలు రేకెత్తించడం టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే చర్య అని పేర్కొన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి శ్రీ వెంకటేశ్వరస్వామి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉందని, అయితే చంద్రబాబు మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సిట్ నివేదికలో జంతు కొవ్వు లేదని తేలిన నేపథ్యంలో విలేకరులు ప్రశ్నిస్తే చంద్రబాబు వారిని దబాయిస్తున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. దేవుడి పట్ల అపచారం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించడం సరైనది కాదని హెచ్చరించారు.

వైయ‌స్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని మోహన్ రెడ్డి పేర్కొన్నారు. టీటీడీ ఉద్యోగులకు జీతాల పెంపు, ఇళ్ల పట్టాలు అందజేయడం వంటి అనేక సంక్షేమ చర్యలు చేపట్టారని చెప్పారు. దేశంలోని పలు ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి కూడా జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని గుర్తుచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుమల లడ్డూ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని మోహన్ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన అంశాలపై నీచ వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి హయాంలో తిరుమల పవిత్రత కాపాడేందుకు అనేక చర్యలు తీసుకున్నారని, అన్యమత ప్రచారం నిరోధానికి జీవోలు జారీ చేశారని మోహన్ రెడ్డి తెలిపారు. వైయ‌స్ కుటుంబం ఎప్పుడూ ఏ మతాన్నీ కించపరిచేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు.

ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇలాంటి వివాదాలను రేపుతున్నారని ఆరోపించిన మోహన్ రెడ్డి, ప్రసాదం అంశాన్ని రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని సూచించారు. గతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నక్సలైట్ల దాడి నుంచి చంద్రబాబు బయటపడ్డ విషయాన్ని గుర్తుచేసుకుంటే, దేవుడి పట్ల మరింత గౌరవంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

Back to Top