నంద్యాల జిల్లా: బనగానపల్లె పట్టణం ఎస్సార్బీసీ కాలనీలో ఉన్న ఈద్గా ను రెండు రోజుల క్రితం కూల్చివేయించిన ఘటన స్థానికంగా ఆందోళనలకు దారితీసింది. ఈ చర్యపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో సంఘటన స్థలాన్ని సందర్శించేందుకు బయలుదేరిన వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద కార్యకర్తలు, నాయకులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈద్గా కూల్చివేతపై మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.