విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడీ 

గీతం యూనివర్సిటీ ఓ దోపిడీ సంస్థ

లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ... 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా

అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమైన ప్రభుత్వం

ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

దీనికోసం రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి పోరాడుతాం

స్పష్టం చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

కూటమి భాగస్వామ్యు పార్టీలు ఈ దోపిడీపై స్పందించాలి

మీరు ఈ దోపిడికీ అనుకూలమా?వ్యతిరేకమా?

బీజేపీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి

సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ.

విశాఖపట్నం: విశాఖలో సీఎం చంద్రబాబు కుటుంబం భూదోపిడీకి పాల్పడుతోందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఫీజులు వసూలు చేస్తూ...54.79 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గీతం విద్యాసంస్థలకు ఈ భూమని అడ్డగోలుగా రెగ్యులరైజ్ చేయడానికి సిద్దమైన ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో కలిసి విశాఖ జీవీఎంసీ కమిషనర్, మేయర్ లకి వినతిపత్రం సమర్పించారు.  అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... రాజకీయ పార్టీలు, మేధావులతో కలిసి పోరాడుతామని తేల్చి చెప్పారు. మరోవైపు కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న బీజేపీ నేతలతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...

● బొత్స సత్యనారాయణ, శాసనమండలి విపక్ష నేత. 

విశాఖపట్నంలో రూ.5వేల కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి.. దాన్ని రెగ్యులరైజ్ చేయడం ద్వారా ఎంపీ భరత్ చేస్తున్న భూదోపిడీకి వ్యతిరేకంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్దమైంది. దీనికోసం ఒక కార్యాచరణ రూపొందించాం. అందులో బాగంగానే ఇవాళ విశాఖ జీవీఎంసీ మేయర్, కమిషనర్, ప్రిన్సిపల్ సెట్రకరీకి  వినతిపత్రం సమర్పించి.. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న భూదోపిడీని ఆపాలని విజ్ఞప్తి చేశాం. గీతం విద్యాసంస్థల కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని.. వారికి రెగ్యులరైజ్ చేసే ప్రతిపాదనను ఈ నెల 30 వ తేదీన జరగనున్న జీవీఎంసీ కౌన్సిల్  మీటింగ్ అజెండాలో పెట్టొద్దని కోరాం. నగరంలో మేధావులు సైతం ఈ భూదోపిడీని వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ బద్దమైన పదవిలో ఉంటూ... నిష్పక్షపాతంగా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఇలా భూదోపిడీకి పాల్పడ్డం  దుర్మార్గం. అందుకే ఇవాళ అధికారులకు వినతి పత్రం సమర్పించి.. భూదోపిడీని ఆపాలని కోరాం. రేపు వైయ‌స్ఆర్‌సీపీ నేతలంతా గీతం సంస్థల కబ్జాలో  ఉన్న 54 ఎకరాల స్థలాన్ని కూడా పరిశీలిస్తాం. మరలా 30 వ తేదీన జరగబోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఈ భూమి రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తాం. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటే తప్ప... పోరాటం ఆగదు. మరింత ఉధృతంగా పోరాటం కొనసాగిస్తాం. 

అధికార పార్టీ ఎంపీ భూ కబ్జాపై కూటమి భాగస్వామ్యులుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, జనసేన తమ పార్టీల వైఖరేంటో చెప్పాలి. ఈ దోపిడీని సమర్ధిస్తున్నారా? లేదా దీన్ని తప్పని వ్యతిరేకిస్తారా? తమ వైఖరేంటో స్పష్టం చేయాలి. స్పీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్ అంటే విశాఖలో వేలాది కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు దోచుకోవడంలో స్పీడా? మీకు చేతనైతే విశాఖను అభివృద్ధి చేసి చూపించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ నీతి ప్రవచనాలు చెపుతుంటారు. రూ.5వేల కోట్ల ప్రభుత్వ భూమిని దోచుకోవడం నీతివంతమైన పాలనా? ఇది థర్మమా? సమాధానం చెప్పాలి. వైయ‌స్ఆర్‌సీపీ ఈ భూ దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఐదేళ్ల పాలనలో వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పుడూ ఈ తరహా కార్యక్రమాలకు పాల్పడలేదు. 

 ఓ సెంటో, ఓ పది గజాలో పేదల ఆక్రమణలో ఉంటే దాన్ని రెగ్యులరైజ్ చేయడం పరిపాటి. కానీ ఏకంగా ముఖ్యమంత్రి బంధువులు, స్థానిక ఎంపీ అయి ఉండి ఏకంగా 54 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయమనడం, ప్రభుత్వం దానికి సిగ్గు లేకుండా ఆమోదించడం ధర్మమా? ఇంత భారీ దోపిడీయా? విజ్ఞులైన విశాఖ ప్రజలు, మేధావులు దీనిపై ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే సీఎం చంద్రబాబు కుటుంబం విశాఖను పూర్తిగా కబ్జా చేయడం ఖాయం. వారికున్న ధనదాహం రాష్ట్రంలో ఎవరికీ లేదు.. ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా వామపక్ష పార్టీలతో మా పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వారితో కలిసి పనిచేయడానికి ఎలా భేషజాలు లేవు. 
భారతీయ జనతాపార్టీ, జనసేన పార్టీ నాయకులు, జీవీఎంసీ కౌన్సిల్ లో ఉన్న ఆ పార్టీ సభ్యులతో మాట్లాడుతాం. మీరు ఈ భూకబ్జాను సమర్ధిస్తున్నారా? లేదా అని ప్రశ్నిస్తున్నాం. వాళ్లు కూడా ఈ దోపిడీలో భాగస్వామ్యులు కావాలనుకుంటే ప్రజలే వారికి తగిన జవాబు చెబుతారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి.. ఈ రాష్ట్రం మీద, విశాఖపట్నం మీద, ప్రజల మీద  అభిమానం, ప్రేమ ఉంటే రెగ్యులరైజ్ ప్రక్రియను నిలిపివేయాలి. అయితే ఇంత పెద్ద భూకబ్జాకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు ఆ పనిచేస్తారని భావించడం లేదు. వారి తత్వం అలాంటిది. అందుకే మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

● పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ...

గతంలో విశాఖ భూదోపిడీపై వేసిన సిట్ ను మరలా మరోసారి ఓపెన్ చేయాలని కోరుతున్నాం. గతంలో టీడీపీ హయాంలో ఈ సిట్ ఏర్పాటు చేశారు. మరలా మీ హయాంలో దాన్ని పూర్తి చేయాలని కోరుతున్నాం.
వాస్తవాలు భయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
కొత్త పరిశ్రమలకు భూమిలివ్వడం సాధారణ విషయమే కానీ.. కాని లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్న గీతం ఓ దోపిడీ సంస్థ. అలాంటి సంస్థ కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని తిరిగి వారికి  ఎలా  రెగ్యులరైజ్ చేస్తారని మేం ప్రశ్నిస్తున్నాం. విద్యాసంస్థ పేరుతో సామాన్యుల దగ్గర ఫీజుల పేరుతో ఎలా దోచుకుంటున్నారా ప్రజలందరికీ తెలుసు. ఆ సంస్థల చైర్మనే తన కాలేజీల ఫీజు గురించి అంగీకరించారు. 1998-99 లోనే గీతం ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని పదవీ విరమణ చేసిన అధికారులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబు కుటుంబం చేస్తున్న భూదోపిడీని అడ్డుకోవడమే మా లక్ష్యం.

● కేకే రాజు - విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు.

కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ... గీతం యూనివర్సిటీకి ఐదువేల కోట్ల భూములు అప్పనంగా కట్టబెడుతోంది. ఈ భూ కేటాయింపు అన్యాయం. విశాఖ ఎంపీ భరత్ కు చెందిన గీతం విద్యాసంస్థల ఆక్రమణలో ఉన్న భూమిని వారికి రెగ్యులరైజ్ చేయడం అప్రజాస్వామికం. కూటమి ప్రభుత్వం విశాఖలో భూములను పప్పు బెల్లాల్లా రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండళ్లలోనే దాదాపు రూ.30 వేల కోట్ల భూములను తమకు నచ్చిన వారికి కట్టబెట్టింది.  జీవీఎంసీ కౌన్సిల్ అజెండాలో గీతం యూనివర్సిటీకి 54.79 ఎకరాలను రెగ్యులరైజ్ చేయాలన్న ప్రతిపాదనను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ జీవీఎంసీ కమిషనర్ కి  వినతిపత్రం సమర్పించాం. విశాఖలో జరుగుతున్న భూదోపిడిపై మేధావులు, విద్యావంతులు ఆలోచించాలి. ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది. దీనిపై పోరాటం చేస్తాం.

Back to Top