తాడేపల్లి: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శివస్వాములు, భక్తులపై పోలీసుల లాఠీచార్జికి బాధ్యత వహిస్తూ హోంశాఖ, అటవీ, దేవాదాయ శాఖల మంత్రులు బహిరంగ క్షమాపణలు కోరాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు. తాడేపల్లి లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 41 రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసుకుని కాలినడకన 40 కిలో మీటర్లకు పైగా నడిచొచ్చిన శివ స్వాములకు వేగంగా దర్శనం చేయించి పంపించాల్సిందిపోయి.. వేల మందిని గంటలకొద్దీ కంపార్ట్‌మెంట్లలో కుక్కి వేధించారని చెప్పారు. భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. క్యూలైన్లలో ఊపిరందక, తాగడానికి నీళ్లు కూడా దొరక్క భక్తులు అలమటించారని వివరించారు. ఆలయాల్లో వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం మేల్కోవడం లేదని మండిపడ్డారు. క్యూలైన్లలో ఉండలేక మహిళా భక్తులు గోడలు దూకి బయటకొస్తున్న వీడియోలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయని వివరించారు. "ఓం నమఃశివాయ" అంటూ పులకించాల్సిన శ్రీశైల క్షేత్రం "దేవుడా కాపాడూ" అంటూ భక్తుల హాహాకారాలతో దద్ధరిల్లిందని, వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు లాఠీచార్జి చేయడం దుర్మార్గమన్నారు. సాక్షాత్తు ఏఎస్పీ సైతం మాల ధరించిన శివ భక్తులపై లాఠీలు జులిపించడం హిందూ ధర్మాన్ని అవమానించడమేనని స్పష్టం చేశారు. ఆలయాల్లో జరుగుతున్న వరుస దుర్ఘటనలు చూస్తే సామాన్యులు ఆలయాలకు వచ్చే స్వేచ్ఛను కూడా ఈ కూటమి ప్రభుత్వం హరించివేసినట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● సామాన్య భక్తులకు దర్శన భాగ్యం లేదా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలు అభివృద్ధి, సంక్షేమ రంగాలకే పరిమితం కాలేదు. 20 నెలల పాలనలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలను సైతం పూర్తిగా భ్రష్టుపట్టించారు. సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని అధికారంలోకి వచ్చి ఆలయాలకు భక్తులు రావాలంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. ఆఖరుకి దేవుడి ప్రసాదం తినాలంటే.. అందులో బొద్దింక, బీడీ ముక్కలు, నత్తలు రాకుండా చూడు స్వామీ అని ప్రార్థించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఆలయాల్లో ఏర్పాట్లుండవు. ప్రసాదంలో నాణ్యత ఉండదు. వీవీఐపీలు, వీఐపీల సేవల్లో తరించిపోతున్న అధికారులు.. సామాన్య భక్తులకు కల్పించాల్సిన రక్షణను పూర్తిగా గాలికొదిలేస్తున్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగినా, సింహాచలం ఆలయంలో గోడ కూలినా, కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. ఏది చూసినా అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వారి తీరులో మార్పు కనిపించడం లేదని రుజువు చేస్తూ శ్రీశైలం పుణ్య క్షేత్రంలో జరిగిన ఘటన రుజువు చేసింది. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఆలయ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయకపోవడం దుర్మార్గం. శివ భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెట్టింది. వారికి తాగునీరు, ఆహారం అందించలేదు. చిన్నారులకు పాలు, బ్రెడ్డు దొరక్క అలమటించారు. ఈ నేపథ్యంలో సౌకర్యాల లేమిపై ప్రశ్నించిన శివభక్తులపై అమానవీయంగా లాఠీ చార్జి చేసి పోలీసులు అహంకారం ప్రదర్శించారు. దాదాపు 45 కిలోమీటర్లు చెప్పులు లేకుంగా ఇరుముడితో నడిచి వచ్చిన శివ స్వాములకు కనీస ఏర్పాట్లు కూడా చేయకుండా తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. 41 రోజులు కఠిన దీక్షలు పూర్తి చేసి ఇడుముడితో వచ్చిన శివస్వాములను లాఠీలతో చావబాదడం చూసి హిందూ సమాజం నివ్వెరపోయింది. విజనరీనని, టెక్నాలజీ గురించి గొప్పులు చెప్పుకునే సీఎం చంద్రబాబు.. దశాబ్దాలుగా ఆలయంలో జరిగే కార్యక్రమాన్ని సైతం నిర్వహించలేక చేతులెత్తేశాడు. ● దర్శనాలు వారం రోజులకు పరిమితం చేయడం వల్లే... గతంలో శివ స్వాములకు 30 రోజుల పాటు దర్శన భాగ్యం కల్పించే ఏర్పాట్లు జరిగేవి. కానీ కూటమి ప్రభుత్వం దాన్ని ఏడు రోజులకే పరిమితం చేసి, అందుకుతగ్గ ఏర్పాట్లు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారని తెలిసీ భద్రతను పూర్తిగా గాలికొదిలేసింది. వీఐపీ దర్శనాల కోసం సామాన్య భక్తులు, శివస్వాములను క్యూలైన్లలో గంటల కొద్దీ ఆపేశారు. క్యూలైన్లలో ఊపిరందక, ఎక్కువసేపు నిలబడలేక మహిళా భక్తులు సైతం గోడలు దూకుతున్న వీడియోలు చూస్తుంటే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఓం నమఃశివాయ అనే మంత్రోఛ్చారణలతో పులకించాల్సిన మల్లన్న గిరి దేవుడా కాపాడు అనే హాహాకారాలు చేసే దుస్థితికి తీసుకొచ్చారు. పండగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాల్లో వీఐపీలకు ఇచ్చిన ప్రాధాన్యత సామాన్య భక్తులకు ఇవ్వకపోవడం వల్ల వరుస దుర్ఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వంలో మెలకువ రావడం లేదు. దేవుడంటే భయం, భక్తి ఉన్న ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పూనుకోదు. మాలధారణలో ఉన్న శివస్వాముల మీద ఏకంగా అడిషనల్ ఎస్పీ లాఠీ చార్జీ చేయడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. సామాన్యులు ఆలయాలకు వచ్చి దేవుడ్ని ప్రార్థించే స్వేచ్ఛను కూడా కూటమి ప్రభుత్వం హరించివేస్తోంది. భక్తులకు మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా? తిరుపతిలో తొక్కిసలాట జరిగినప్పుడు నిజాయితీగా విచారణ చేసి అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి ఉంటే సింహాచలం, కాశీబుగ్గ, శ్రీశైలం ఆలయాల్లో ఇలాంటి ఘటనలు జరిగేవి కావు. సామాన్య భక్తుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని వరుస ఘటనలతో స్పష్టమవుతోంది. రెడ్ బుక్‌ని ఆలయాలకు వర్తింపజేస్తున్నారు. శ్రీశైలంలో జరిగిన ఘటనకు హోంశాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రులు బాధ్యత వహింంచాలి. తక్షణం శివ స్వాములకు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. భక్తులపై లాఠీచార్జి చేసిన పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శివశంకర్ డిమాండ్ చేశారు.