సత్తెనపల్లి కేసులో అంబటి రాంబాబుకి రిమాండ్ 

గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబుపై చంద్రబాబు సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. జైలు నుంచి బయటకు రాకుండా కూటమి కుట్రలు చేస్తోంది. అంబటిపై ఉన్న పాత కేసు తిరగతోడిన కూటమి సర్కార్‌.. ప్రజా సమస్యలపై గళం విప్పకుండా అంబటిపై కుట్రలకు తెరలేపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు బాబు సర్కార్‌ కుట్రలు పన్నుతోంది.  సత్తెనపల్లి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు.. 14 రోజులు రిమాండ్ విధించింది. గుంటూరు నుంచి అంబటి రాంబాబును రాజమండ్రికి తరలిస్తున్నారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ పిటిషన్‌, జైల్లో వసతులు కల్పించాలంటూ మరొక పిటిషన్‌ను అంబటి రాంబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేశారు.

కాగా, అంబటి రాంబాబుకు ఒక కేసులో న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేస్తుంటే మరో కేసు ముందుకు తెస్తున్నారు. పీటీ వారెంట్లు జారీ చేస్తున్నారు. మెడికల్‌ ఉద్యమం సందర్భంగా అధికారులను బెదిరించారంటూ అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి బి.మేరీ సారధనమ్మ బుధవారం(ఫిబ్రవరి 11) బెయిల్‌ మంజూరు చేశారు.  నేడు (గురువారం) ఆయన విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్‌ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన ఓ పెట్టీ కేసులో ఇపుడు పీటీ వారెంట్‌ జారీచేశారు.

ఇలా వరుస కేసులతో బాబు సర్కార్‌.. ఇబ్బందులకు గురిచేస్తోంది. పొరపాటున మాట తూలినా క్షమాపణ కోరిన అంబటిని సెంట్రల్‌ జైలులో నిర్బంధించిన కూటమి ప్రభుత్వం అంబటి ఇంటిపై పెట్రోలు బాంబులు విసిరి, మారణాయుధాలతో భయానక దాడులు చేసిన వారికి మాత్రం స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి సాగనంపింది. ప్రశ్నిస్తున్నందునే అంబటిని ఇలా దుర్మార్గంగా హింసిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంబటికి మరోసారి 14 రోజుల రిమాండ్
అంబటి రాంబాబుపైకి దాడికి తెగబడటమే కాకుండా, ఇంటిపైన , కార్యాలయంపైన దాడి చేసి కార్యాలయానికి, కార్లకు నిప్పు పెడితే ఆ కేసులో ఒక్కరిని కూడా ఇప్పటి వరకూ అరెస్టు చేయలేదు. పైగా దాడికి గురైన అంబటి రాంబాబుపైనే అక్రమ కేసు బనాయించి జైలుకు తరలించారు. ఈ కేసులో బెయిల్‌ వచ్చే సమయానికి కస్టడీ పిటీషన్‌తో పాటు మరో పాత కేసులో పీటీ వారెంట్‌ వేశారు.  రాష్ట్రంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సామాన్య ప్రజల ఆరోగ్య హక్కులను పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలలో భాగంగా గుంటూరులో జరిగిన ధర్నాలో పాల్గొన్న అంబటిపై అధికారులను బెదిరించారంటూ పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఆ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకూ రిమాండ్‌ విధించారు. ఈ కేసులో బుధవారం వాదనల అనంతరం  గుంటూరు ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి బి. మేరీ సార ధనమ్మ  బెయిల్‌ మంజూరు చేశారు. ఈ బెయిల్‌కు సంబం«ధించి షూరిటీలు అన్నీ సమర్పించిన  తరుణంలో.. సత్తెనపల్లిలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబంరాలపై జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు వేసిన కేసును బయటకు తీసారు. ఈ కేసులో ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. దీంతో ఆయనను ఇవాళ (గురువారం) గుంటూరు కోర్టులో మళ్లీ  హాజరుపర్చారు. ఈ కేసులో కోర్టు.. అంబటికి 14 రోజులు రిమాండ్ విధించింది.

Back to Top