విశాఖపట్నం: పెట్టుబడుల ముసుగులో చంద్రబాబు భారీ భూదోపిడీకి పాల్పడుతూ బినామీలకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపదను ధారాదత్తం చేస్తున్నాడని విశాఖ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు కెకె రాజు ధ్వజమెత్తారు. విశాఖ సిటీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇన్నాళ్లూ ఎకరం 99 పైసలకే కేటాయిస్తూ వచ్చిన చంద్రబాబు, ఇప్పుడు ఏకంగా రూ. 1500 కోట్లు విలువ చేసే 30 ఎకరాల భూమిని 99 పైసలకే ఏఎస్ఐపీ అనే కంపెనీకి కట్టబెట్టాడని చెప్పారు. రూ.30 కోట్లు కేపిటల్ లేని ఆ కంపెనీ రూ. 2,387 కోట్లు పెట్టుబడులు పెడుతుందని, వెయ్యి మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నాడని వివరించారు. తాను 99 పైసలకే భూములిచ్చిన సత్వా, ఉర్సా, కపిల్, రహేజా వంటి కంపెనీలు ఇప్పటివరకు పనులే ప్రారంభించలేదని గుర్తుచేశారు. చంద్రబాబుకి నిజంగా విశాఖ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే భూములకు బహిరంగ వేలం నిర్వహిస్తే నిజమైన కంపెనీలే వస్తాయని, అవి త్వరగా కంపెనీలు ప్రారంభించి స్థానిక యువతకు ఉద్యోగాలిస్తాయని వివరించారు. కానీ చంద్రబాబు మాత్రం పప్పుబెల్లాలకు భూములిస్తే ప్రజలకు ఏ మాత్రం మేలు జరగదని స్పష్టం చేశారు. చంద్రబాబు అడ్డగోలు భూదోపిడీకి వ్యతిరేకంగా వైయస్ఆర్‌సీపీ ప్రజలతో కలిసి పోరాతుందని కెకె రాజు హెచ్చరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... బహిరంగ వేలం ఎందుకు నిర్వహించడం లేదు? కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఉత్తరాంధ్ర ఎలాంటి అభివృద్ధికి నోచుకోకపోగా ఇక్కడున్న వేలాది కోట్ల విలువైన భూములను చంద్రబాబు తన బినామీలకు పప్పుబెల్లాల్లా కట్టబెట్టేస్తున్నాడు. ఉర్సా, సత్వా, ఏఎన్ఎస్ఆర్, రహేజా, కపిల్ వంటి కంపెనీలకు రూపాయికే ఎకరా భూమి ఇచ్చేసిన చంద్రబాబు ఇప్పుడు మరింత బరితెగించి అడ్వాన్స్‌డ్ సిస్టం ఇన్ ప్యాకేజ్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏఎస్ఐపీ) అనే సెమీ కండక్టర్ కంపెనీకి 30 ఎకరాల భూమిని 99పైసలకే కట్టబెట్టేశాడు. విశాఖపట్నంలోని తర్లువాడ గ్రామంలో ఉన్న ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్‌లో ఎకరా రూ.50 కోట్లకు పైనే పలుకుతోంది. అంటే రూ.1500 కోట్లు విలువ చేసే భూమిని చంద్రబాబు కేవలం 99పైసలకే రాసిచ్చేశాడు. గతంలో భూములందుకున్న లూలూ మాల్‌కి, సత్వా, రహేజా, కపిల్ వంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు చంద్రబాబు భూములు కేటాయించినా ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. ఇదే సత్వా కంపెనీ హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ వేలంలో ఎకరం రూ.174.60 కోట్లకు సొంతం చేసుకుంటే చంద్రబాబు మాత్రం విశాఖలో రూ. 3 వేల కోట్ల విలువైన భూమిని 99 పైసలకే అప్పనంగా ఇచ్చేశాడు. కమీషన్ల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా రాసిచ్చేస్తున్నారు. పెట్టుబడుల పేరుతో కట్టుకథలు చెప్పి బోగస్ కంపెనీల ముసుగులో విలువైన భూముల దోపిడీ జరుగుతోంది. ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగ భృతి ఇవ్వరు కూటమి ప్రభుత్వం 30 ఎకరాలు కేటాయించిన అడ్వాన్స్‌డ్ సిస్టం ఇన్ ప్యాకేజ్డ్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏఎస్ఐపీ) రూ. 2,387 కోట్లు పెట్టుబడులు పెడతారని, వెయ్యి ఉద్యోగాలు కల్పిస్తారని చెబుతున్నారు. 2017 నవంబర్‌లో తెలంగాణలో రిజిస్టర్ చేయబడిన ఈ కంపెనీ ఆథరైజ్డ్ కేపిటల్ కేవలం రూ.30 కోట్లు కాగా, పెయిడ్ అప్ కేపిటల్ రూ. 15.17 కోట్లు. 2023-24 బ్యాలెన్స్ షీట్‌లో ఆ కంపెనీ కేవలం రూ. కోటి మాత్రమే చూపించింది. 40 మంది మాత్రమే ఉద్యోగులున్న ఈ కంపెనీ రూ. 2,387 కోట్లు పెట్టుబడులు పెడతామని ముందుకొచ్చిందే ఆలస్యం అన్నట్టు రూ.1500 కోట్ల విలువైన 30 ఎకరాలు ప్రభుత్వం కట్టబెట్టేసింది. పెట్టుబడుల పేరుతో బినామీ కంపెనీలకు ఇష్టారాజ్యంగా భూములు కేటాయిస్తున్న చంద్రబాబు.. అధికారంలోకి వస్తానే 20 లక్షల ఉద్యోగాలిస్తామని లేదంటే నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. కానీ రెండేళ్లయినా ఇంతవరకు హామీని అమలు చేసిన పాపానపోలేదు. సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల పేరుతో చంద్రబాబు భారీ భూ దోపిడీకి పాల్పడుతున్నాడు. అమరావతి కోసం విశాఖ అభివృద్ధిపై వేటు విశాఖ అభివృద్ధి చెందితే అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతింటుందని చంద్రబాబు భయం. ఆ భయంతో ఫేక్ కంపెనీలను సృష్టించి విశాఖలో విలువైన భూములు పప్పుబెల్లాలకు రాసిచ్చేస్తున్నాడు. చంద్రబాబు 99పైసలకు రాసిచ్చేస్తున్న భూములకు వేలం నిర్వహిస్తే వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం అందుతుంది. నిజమైన కంపెనీలే వేలంలో పాల్గొంటాయి. వెంటనే కంపెనీలను ప్రారంభిస్తాయి. తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. విశాఖ మరింత అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ ఫేక్ కంపెనీల కారణంగా వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపద చంద్రబాబు బినామీల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బహిరంగ వేలం నిర్వహించకుండా 99 పైసలకే భూములు కేటాయించే విధానం తప్పని ప్రశ్నిస్తుంటే నా ఇష్టమని నారా లోకేష్ అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ ఆస్తులకు కస్టోడియన్‌లా ఉంటారని ప్రజలు వారికి అధికారమిస్తే ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రీకొడుకులు విలువైన భూములు కాజేస్తున్నారు. ఇది చాలదన్నట్టు చంద్రబాబు తన కొడుకు తోడల్లుడు భరత్ ఆక్రమించిన అసైన్డ్ భూములను గీతం కాలేజీకి క్రమబద్ధీకరించేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేస్తున్న అడ్డగోలు భూదోపిడీకి వత్తాసు పలుకుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కూటమి నాయకులను ప్రజలు క్షమించరు. చంద్రబాబు అక్రమ భూదోపిడీని వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటుందని కెకె రాజు హెచ్చరించారు.