అన్నమయ్య జిల్లా: నాలుగు 104 వాహనాలను ధ్వంసం చేసి వాటి విడిభాగాలను తరలించి అమ్మిన ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల హక్కుగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో 104 వాహనాల దోపిడీని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవలు అందించే నాలుగు 104 వాహనాలను చిన్నపాటి మైనర్ రిపేర్లు కోసం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో ఉంచారు. తర్వాత వాటిని పట్టణానికి దూరంగా ఉన్న డంపింగ్ యార్డుకు తరలించి, యంత్రాలతో ధ్వంసం చేసి విడిభాగాలను పెద్ద మొత్తంలో అమ్మి నష్టపరిహారం పొందారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని సస్పెండ్ చేసి ప్రభుత్వ నష్టాన్ని రికవరీ చేయాలి`అని డిమాండ్ చేశారు. ఆరోగ్య వ్యవస్థపై నిర్లక్ష్యం కూటమి ప్రభుత్వం 104, 108 సర్వీసులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ ఇన్స్యూరెన్స్ కంపెనీలకు అప్పగిస్తున్నట్లు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. సుమారు రూ.3,000 కోట్ల బకాయిలను పెండింగ్‌లో ఉంచడం వల్ల పేద, వనరుల్లేని ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకంలో 1059 రకాల జబ్బులకు వైద్యం అందిస్తూ, వైయస్ జగన్ ప్రభుత్వం ఆ పరిమితిని 3257కి పెంచిన విధానాన్ని గుర్తు చేశారు. అలాగే, ఆరోగ్యశ్రీ కార్డు పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం, శస్త్రచికిత్స అనంతరం రోజుకు రూ.225 జీవనాధారాన్ని అందించడం వంటి పద్ధతులను కూటమి ప్రభుత్వం ఎత్తేసిందని తెలిపారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు, అధికార పార్టీ ఒత్తిళ్లకింద అక్రమార్కులకు అండగా నిలవడం దారుణమన్నారు. చట్టానికి వ్యతిరేకంగా, అన్యాయంగా కేసులు పెట్టే వారు ఎక్కడున్నా, చట్టం నుంచి తప్పించుకోలేరని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.