తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం

తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా సాగింది. ఈ సమావేశం నియోజకవర్గ సమన్వయకర్త  వడ్డే రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు, వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా అనురాధ  కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ కోసం కష్టకాలాల్లోనూ అండగా నిలిచిన కార్యకర్తలే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలైన బలం అని ఆమె పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేసిన వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అమలవుతున్నాయని, సంక్షేమ పథకాలు నిలిచిపోవడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు  ముదునూరి ప్రసాదరాజు  మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మాణం కీలకమని అన్నారు. మాజీ మంత్రి  కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పోరాట పటిమతో ముందుకు సాగాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు తానేటి వనిత , శ్రీ రంగనాథరాజు , ఎమ్మెల్సీ  వంక రవీందర్ , రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జున్నూరి బాబీ , మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. 

Back to Top