అనంతపురం:రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాయ చేస్తున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం అనంతపురంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు పొంతన లేదని మండిపడ్డారు. “అప్పుడు పంది అన్నది ఈరోజు నంది అయింది… అప్పుడు నంది అన్నది ఈరోజు పంది అవుతోంది” అంటూ చంద్రబాబు రాజకీయ వేషధారణను తీవ్రంగా ఎండగట్టారు. రాష్ట్ర ప్రజల చెవుల్లో చంద్రబాబు పూలు పెడుతూ, అబద్ధపు ప్రచారాలతో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. అమరావతి పేరుతో రూ.14 లక్షల కోట్ల దోపిడీ అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు రూ.14 లక్షల కోట్ల దోపిడీకి తెరలేపారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు లెక్కల ప్రకారమే ఎకరాకు 2,800 గజాలు, ఒక్కో గజం లక్ష రూపాయల విలువ ఉంటే, ఎకరానికి రూ.28 కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. అలా చూస్తే 50 వేల ఎకరాలకు రూ.14 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రావాల్సి ఉందన్నారు. కానీ ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేసి, 28 గ్రామాల్లోని కొందరు భూస్వాములు, చంద్రబాబు బంధువులు, అనుచరులకు మాత్రమే లబ్ధి చేకూర్చేలా వ్యవస్థను రూపొందించారని ఆరోపించారు. ఈ ల్యాండ్ పూలింగ్ కారణంగా రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ.14 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. వైయస్ జగన్ ఆలోచన – ప్రజల సంపద ప్రజలకే వైయ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన పూర్తిగా ప్రజాహితమేనని ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు. వైయస్ జగన్ చెప్పినట్లుగా భూములు కొనుగోలు చేసి రాజధాని నిర్మించి ఉంటే, అమరావతి నుంచి వచ్చే ప్రతి రూపాయి రాష్ట్ర ప్రజలకే చెందేదన్నారు. ప్రభుత్వ భూముల్లో లేదా భూసేకరణ ద్వారా రాజధాని నిర్మించాలని జగన్ సూచించారని గుర్తు చేశారు. రాజధానికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, అమరావతి ప్రాంతంలో రాజధాని పెట్టడానికీ వైయస్ఆర్‌సీపీ అంగీకారమేనని స్పష్టం చేశారు. అయితే లక్షల కోట్ల దోపిడీకి దారి తీసే ల్యాండ్ పూలింగ్ యాక్ట్‌కు మాత్రమే జగన్ వ్యతిరేకమని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను వైయస్ జగన్ కొత్తగా తీసుకువచ్చినట్టుగా చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. వాస్తవానికి ఈ చట్టాన్ని 2019–24 మధ్య కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేసిందని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించే చట్టమని వివరించారు. ఈ చట్టం సమర్థంగా అమలు చేసినందుకుగాను రాష్ట్రానికి దాదాపు రూ.400 కోట్ల ఇన్సెంటివ్ కూడా వచ్చిందన్నారు. తిరుమల లడ్డూపై దుస్ప్రచారం – క్లీన్‌చిట్‌ను దాచిపెట్టిన పచ్చమీడియా ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు పెరిగిన వేళ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడ్డారని, అందులో భాగంగానే పవిత్రమైన తిరుమల లడ్డూపై దుస్ప్రచారం చేశారని ఆరోపించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ జరిపి తిరుపతి లడ్డూపై క్లీన్‌చిట్ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ఈ విషయంపై పచ్చమీడియా నోరు మెదపడం లేదని మండిపడ్డారు. “నిజంగా చంద్రబాబు హిందువు అయితే ఒక నిమిషమైనా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత ఉందా?” అని ప్రశ్నించారు. ఈ అంశంపై బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వ హిందూ పరిషత్ స్పందించి, చంద్రబాబు హిందుజాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాయలసీమకు చంద్రబాబు ద్రోహం రాయలసీమకు లక్ష కోట్లతో గోదావరి–పనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. గుండ్రేవుల వంటి ప్రాజెక్టులు రాయలసీమకు లబ్ధి చేకూర్చేవని తెలిసినా వాటిని పక్కన పెట్టారని అన్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, హంద్రినీవా, గాలేరు–నగరి, తుంగభద్ర హైలెవల్, లోలెవల్ కెనాళ్లు వంటి అనేక ప్రాజెక్టులను చేపట్టి దాదాపు రూ.40 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వైయస్ రాజశేఖరెడ్డి కలల ప్రాజెక్ట్ అయిన వెలిగొండను వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధితో పూర్తి చేసి జాతికి అంకితం చేశారని ప్రశంసించారు. చంద్రబాబు మాత్రం తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తూ రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు.