తాడేపల్లి: ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీని చంద్రబాబు నాయుడు అబద్ధాల వేదికగా మార్చేశారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, లడ్డూ వివాదం వెనుక ఉన్న అసలు కుట్రలను ఆధారాలతో సహా బయటపెట్టారు. ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఇంకా ఏం మాట్లాడారంటే..: చంద్రబాబు అబద్దాల నాయుడు: అసెంబ్లీ సాక్షిగా అబద్దాల సామ్రాట్, అసత్యాల కిరీటధారి చంద్రబాబు నాయుడు అబద్దాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కనీస ఆధారాలు లేకుండా, దేవుడంటే కనీసం భక్తి లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా, ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ సాక్షిగా అడ్డగోలుగా అసత్యాలు మాట్లాడారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన కూటమి నేతలు: అసత్యాల మూల విరాట్ చంద్రబాబుకు మరో ఇద్దరు అసత్యాల కిరీటధారులు తోడయ్యారు. ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన... ఫర్ఫార్మెన్స్ చూసి ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుంది. రోజుకొక మాట, పూటకొక వేషం వేస్తూ.. అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెబుతున్నారు. వైయస్.జగన్ ను నేను ఏం అనలేదని మాట్లాడుతున్నారు. మరో వ్యక్తి ధనార్జనే ధ్యేయంగా పులకేశిని మరిపించే మరో వ్యక్తి మంత్రి లోకేష్. విడ్డూరమైన ప్రకటలనకు, వింతలకు ఆయన కేరాఫ్ అడ్రస్. శాసనమండలిలో చర్చ పెట్టండి అని అడిగితే.. అసత్యాలు, అబద్దాలు, వేషాలతో శాసనసభలో సొంత డబ్బా కొట్టుకొంటున్నారు. అసెంబ్లీలో నాలుగు గంటలపాటు సాగిన వీళ్ల చర్చ... కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉంది. కనీస జ్ఞానం లేకుండా మాట్లాడారు. దోపిడీ కోసం వేసిన తప్పుడు విత్తనమే కల్తీ వ్యవహారం..: మా పార్టీ ఆధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్.జగన్ సీఎం చంద్రబాబు మీద ఆధార సహితంగా కొన్ని ఆరోపణలు చేశారు. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడానికి చంద్రబాబు అన్ని డెయిరీలతో లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారు. ఆ డెయిరీలకు లాభాలు చేకూర్చే విధంగా రూ.300 నెయ్యిని రూ.658కి అమ్ముకోవడానికి అడ్డదారుల్లో నిబంధనలు సడలించారు. 800 కిలోమీటర్లు లోపు ఉన్న కంపెనీలకే టెండర్లు ఇవ్వాలన్న నిబంధన ఉన్నా 850 కిలోమీటర్లు కంటే పైన ఉన్న తన భాగస్వామి, సొంత మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ కి అడ్డగోలుగా కట్టబెట్టాడు. గతంలో రూ.321 కే ఉన్న నెయ్యిని ఇవాళ రూ.658కి విక్రయిస్తున్నాడు. కేజీ మీద రూ.400 దోచుకుంటూ, దగా చేస్తున్నాడు. ఈ దగా కోసం వేసిన తప్పుడు విత్తనమే కల్తీ వ్యవహారం. దీనిపై ఎందుకు సమాధానం చెప్పలేదు? కల్తీ నెయ్యి పాపం మీదే చంద్రబాబూ..: హెరిటేజ్ ఇందాపూర్ యూనిట్ ల మధ్య ఉన్న సంబంధం గురించి ఎందుకు మాట్లాడలేదు. వెబ్ సైట్ లో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే తయారీ సంస్థ.. మీ తయారీ సంస్థ అయిన ఇందాపూర్ సంస్థ గతంలో రూ.321కే నెయ్యి సరఫరా చేసిన సంస్థకు ఇవాళ రూ.658కి ఎలా ఇచ్చారు? అంటే మీరు చెప్పినట్లు అప్పుడు ఇందాపూర్ డెయిరీ జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె సరఫరా చేస్తే ఇప్పుడు నెయ్యి సరఫరా చేస్తుందా? ఇదే కంపెనీ పక్క రాష్ట్రం హైదరాబాద్ లో లీటరు రూ.560కి అమ్ముతుంటే ఇక్కడ రూ.658 కి లక్షలాది లీటర్లు ఎలా ఇచ్చారు? డెయిరీ తీగ లాగితే నారావారి డొంక కదిలింది..: డెయిరీ అనే తీగలాగితే నారా వారి కుటుంబం డొంకంతా బయటపడింది. ఈ దేశంలోఅన్ని డెయిరీలతో కలిసి ఉన్నారు. చివరకు సంగం డెయిరీతో కూడా సంబంధం ఉంది. ఇందాపూర్ కి హెరిటేజ్ కి సంబంధం, ఇందాపూర్ కి బోలేబాబాకి, బోలేబాబాకి హెరిటేజ్ కి, సంగం డెయిరీకి వైష్ణవికి సంబంధం.. ఆక్రమాల కలయికే ఈ కల్తీ. లేకపోతే నాణ్యత లేదని వెనక్కి పంపించిన ట్యాంకులు రెండు నెలలు తర్వాత మరలా తిరుమలకు ఎలా వచ్చాయి? కల్తీ అని చెప్పిన నెయ్యిని మరలా లడ్డూ ప్రసాదంలో వాడ్డం వెనుక ఉన్న ఘనులెవ్వరు? శ్యామలరావుని ఈవోగా ఎందుకు తొలగించారు? శాంపిల్స్ ఆయన హయాంలో తీస్తే.. విచారణ టైంకి ఎందుకు మార్చారు? ముగ్గురు ఈవోలను ఎందుకు మార్చారు? హెరిటేజ్ సంస్థ మాన్యుఫ్యాక్చర్ యూనిట్ గా ఉన్న ఇందాపూర్ పేరును ఎందుకు వెబ్ సైట్ లో తొలగించారు? ఎందుకు వైష్టవి డెయిరీ సంగంతో కలిసిన ఫోటోలను తొలగించారు? రెండు సంస్థల లోగోలతో ఉన్న గేట్లు చూస్తే... అక్రమ ఈ డెయిరీల అక్రమ సంగమాలు బయటపడుతున్నాయి. మద్యమే కాదు పాలు, నీళ్లు, అన్నం సర్వం కల్తీమయం..: ఈ రాష్ట్రంలో కల్తీ మద్యంతో పాటు... చివరకి పాలు కల్తీ, నీళ్లు కల్తీ. డయేరియాతో 20 నెలల్లో దాదాపు 40 మందికి పైగా చనిపోయారు. కల్తీ నీళ్లు తాగి గిరిజన పిల్లలు చనిపోయారు. కల్తీ పాలు తాగి 6 మంది చనపోగా.. 20 మందికి పైగా అస్వస్థత. ఇంకా రిపోర్టు రాకముందే టీడీపీ నేతలు గ్యాస్ లీక్ కావడం వల్ల చనిపోయారని తేల్చేస్తున్నారు. యూరియా ఎక్కువ ఉండి, కెమికల్స్ వల్ల చనిపోయారు అంటే వీరు మాత్రం వేరే కారణాలు చెబుతున్నారు. ఇవన్నీ పక్కదారి పట్టించడానికి అసంబ్లీలో వైవీ సుబ్బారెడ్డిని, కరుణాకరరెడ్డిని దోషులుగా పెట్టాలని మాట్లాడుతున్నారు. సీబీఐ సెట్ చాలా స్పష్టంగా నెయ్యిలో జంతుకొవ్వు, చేప నూనె, పంది కొవ్వు లేదని చెప్పినా.. ఇంకా చంద్రబాబు ఎన్ డీ డీ బీ రిపోర్టులో జంతుకొవ్వు అని అంది ఈ రిపోర్టు చదివాను మాట్లాడుతున్నాడు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ముందు క్షమించమని లెంపలు వేసుకోవాలి. ఎన్ డీ డీ బీ రిపోర్టు చాలా స్పష్టంగా చెబుతూ... మా రిపోర్టు తప్పులు ఉండే అవకాశం ఉందని చెప్పింది. అయినా రాజకీయంగా వైయస్.జగన్ ని ఎదుర్కోలేకే.. మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేయాలనుకున్నాడు.ఇది ఓ భయంకరమైన అబద్దం. మతం పేరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలన్న కుట్రలో భాగమే ఇదంతా. హెరిటేజ్ సరఫరాపై అడ్డగోలు అబద్దాలు... మరోవైపు హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ ప్రభుత్వానికి, గుడులకు సరఫరా చేయదని చెప్పారు. కానీ హెరిటేజ్ సంస్ధే స్వయంగా ఇచ్చిన ప్రకటన చూస్తే... 2014–19 మధ్యలో చంద్రబాబు సీఎంగా ఉండగా... హెరిటేజ్ సంస్థ రూ.40 కోట్ల మజ్జని సరఫరా చేసిందనే ఆరోపణలు వచ్చాయి. కానీ హెరిటేజ్ కేవలం రూ.21 కోట్ల విలువైన టెండర్లలోనే పాల్గొన్నామని చెప్పారు. మరి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మంత్రి అచ్చన్నాయుడు, హోం మంత్రి అనిత మాట్లాడతారు. మరి హెరిటేజే స్వయంగా చెప్పినదానిపై ఏం సమాధానం చెప్తారు? రెండో అంశం హెరిటేజ్ ఎప్పుడూ దేవస్థానాలకు బల్క్ లో సరఫరా చేయలేదని చెప్పారు. హెరిటేజ్ 2002లో నెయ్యి సరఫరా కోసం టీటీడిలో బిడ్ వేసింది. టిన్లు ద్వారా రూ.117, ట్యాంకర్ల ద్వారా రూ.113కి సరఫరా చేస్తామని 2002, 2003,2004 లో టెండర్లలో పాల్గొంది. ఎంత అసత్యం మాట్లాడరు? అంటే హెరిటేజ్ టీటీడీ నెయ్యి సరఫరాకు బిడ్స్ వేసిందన్నది పచ్చి నిజం. కానీ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు ఒకరోజు ఇందాపూర్, మరో రోజు బోలేబాబా, సంగం పేరుతో మార్చింది. ఈ బాబాల వెనుకుండి నడిపిస్తున్నది మాత్రం చంద్రబాబానే. బోలేబాబా స్వయంగా తమకు హెరిటేజ్ తో సంబంధాలు ఉన్నాయని చెప్పంది. ఇవన్నీ చంద్రబాబా కనుసన్నల్లో జరుగుతున్న వ్యవహారాలే. నిజాలు బయటపడ్డంతో పేర్లు మార్పు... నిజాలు బయటపడ్డంతో ఒక్కసారిగా రంగులు మారుస్తున్నారు. ఈ నెల 10 నాటికి హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గా ఉన్న ఇందాపూర్ ను ఈ నెల 15న కో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గా మార్పు చేశారు. అదేవిధంగా సీబీఐ సిట్ రిపోర్టులో వైష్ణవి డెయిరీ పేరు రాగానే గేటు మీద తన బొమ్మలు చెరిపేసింది. కేవలం రంగులు మార్చిన దోపిడీ దొంగలు... వెబ్ సైట్స్ లోనుంచి తొలగించడంతో పాటు గేట్లు మీద పేర్లు కూడా మార్చారు. వైష్టవి డెయిరీ ఇవాల్టి విజువల్స్ చూస్తే వాస్తవాలు అర్ధం అవుతుంది. ప్రతి కంపెనీకి ఒక పేరుంటుంది.. అలాంటిది పేరు లేకుండా ఉందంటే... ఏంటి దానర్ధం? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. వైయస్.జగన్ అడిగిన ఒక్క ప్రశ్నకూ మీరు ఎందుకు సమాధానం చెప్పలేదు? ఇన్నేళ్లు హెరిటేజ్ లో సేల్స్ మేనేజర్ గా జాతీయస్ధాయిలో పనిచేస్తున్న వ్యక్తిని ఈనెల 14 న ఎందుకు తొలగించారు? అంటే ఇవన్నీ కావాలనే చంద్రబాబు ఆడిస్తున్న నాటకాలు. ఏడు కొండలుపై అడ్డంగా దొరికినా అడ్డగోలు అబద్దాలు.. చంద్రబాబు ఎన్ని చేసినా, ఆయన అసెంబ్లీలో మాట్లాడిన అంశాలపై అసెంబ్లీ గేటు దాటకముందే పట్టుబడ్డాడు. తిరుమల తిరుపతి కొండను 338 జీవో ఇచ్చి వైయస్.రాజశేఖర్ రెడ్డి కక్షగట్టి, తిరుమల ఏడుకొండలు కాదు రెండు కొండలు అని చెప్పాడని మాట్లాడారు. ఈ జీవో చూస్తే.. 2005లో టీడీపీ చెందిన ఓ నాయుడు గారు కోర్టుకు వెళ్లి తిరుమలలో ఎన్నికలు జరగాలి. ఇది రాజ్యాంగ విరుద్దమైన కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు కేసు వేయించారు. అప్పటి పంచాయితీరాజ్ శాఖ మంత్రి జే సీ దివాకర్ రెడ్డి తిరుమల టౌన్ షిప్ గా మరికొంత భాగాన్ని పొందుపరుస్తూ జీవో ఇచ్చారు. దేవాలయం అని చెబుతున్న అసెంబ్లీ సాక్షిగా పట్టుబడ్డ చంద్రబాబు వ్యవహారాన్ని అందరూ చూడాలి. అనేక సంవత్సరాల పాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకి తెలియదా? పరిధిని నిర్ణయించేది పంచాయితీరాజ్ శాఖా? రెవెన్యూశాఖా? ఈ జీవోలో ఎక్కడైనా రెండు కొండలే అని, ఏడు కొండలు కాదు అని ఎక్కడైనా ఉందా? మరి అలాంటప్పుడు చంద్రబాబు ఏడుకొండలపై రెండు కొండలే అని 2005 నుంచి ఏళ్ల తరబడి అసత్యాలు ఎలా ప్రచారం చేస్తున్నాడు. చేతిలో పచ్చ పత్రికలు ఉన్నాయని, పిచ్చిరాతలు ఎలా రాయగలగుతున్నాడు. ఏళ్ల తరబడి ఇన్ని అసత్యాలు, అబద్దాలు చెబుతున్నా.. నిలదీసే వ్యవస్థ లేకపోవడమే అలా మాట్లాడానికి కారణం. ఏడుకొండలపై వాస్తవాలివిగో.. టీటీడీ చరిత్రను వెనక్కి వెళ్లి పరిశీలిస్తే.. 1870లో బ్రిటిష్ ప్రభుత్వం టీటీడికి దాదాపు 10.33 చదరపు మైళ్లు అంటే 27.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని అప్పగించింది. బ్రిటీష్ ప్రభుత్వం అప్పగించిన ఈ భాగంలో కొంత భాగం గుడి ఉండేది.కొంతమంది వ్యాపారాలు చేసేవారు. కిందకి వచ్చే దగ్గర కొంతమంది నివాసం ఉండేవారు. ఎప్పుడైతే చంద్రబాబు మనిషి కోర్టులో కేసు వేశారో.. తిరుమలలో రాజకీయ ప్రచారం జరగకుండా ఉండాలంటే కొండమీద పూర్తి విస్తీర్ణాన్ని దేవుడి టౌన్ షిప్ గా చేయాలని జీవో 338 జారీ చేశారు. బ్రిటిష్ వారు ఇచ్చిన 10.33 చదరపు మైళ్లు స్థలాన్ని 1924లో ప్రభుత్వంలోకి వచ్చింది. 1965లో జీవో నంబరు 1–7–84 ప్రకారం హద్దులు నిర్ణయించుకున్నారు. 1986లో ఎన్టీరామారావు గారి హయాంలో జస్టిస్ చల్లా కొండయ్య గారు 10.33 చదరపు మైళ్లను కొండ ప్రాంతంగా గుర్తించారు. ఆ తర్వాత చంద్రబాబు ప్రోద్భలంతో మరో నాయుడు గారు కేసు వేస్తే.. గుడి తో పాటు కొండ మీద రాజకీయ ప్రచారం జరగరాదన్న లక్ష్యంతోనే వైయస్సార్ ఆ జీవో ఇచ్చారు. అక్కడితో ఆగకుండా 2007లో రెండు జీవోలను ఇచ్చి దాదాపు 332 చదరపు కిలోమీటర్ల పరిధిని మొత్తం టీటీడీ కింద గుర్తించారు. భక్తి ఛానెల్ నెలకొల్పి దేవదేవుడి ప్రసారాలను ప్రపంచంలోని ప్రతి హిందువు చూసేలా ఏర్పాటు చేశారు. దీనిపైనా పచ్చి అబద్దాలు అసెంబ్లీ లో చెప్పిన చంద్రబాబు తాను ఆ జీవోలను రద్దు చేస్తానని చెప్పలేదంటూ బుకాయించారు. మరోసారి అందరూ ఆయన మాటలు చూడాలి. కలలో కూడా చేయలేనని చెబుతున్నాడు. కానీ వాస్తవంగా అదే పని చేస్తున్నాడు. నీ తప్పులు ఎవరూ పట్టుకోలేరు అనుకుని ఇంత బాహాటంగా మాట్లాడుతున్నాడు. ఇంత కన్నా సాక్ష్యం కావాలా? ఆ రోజు 2005లో 338 జీవో పై చంద్రబాబు విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నాడు. ఆరోపణలు చేస్తున్నాడు. ఇది చాలా పాపం, ఈ జీవో జారీ చేసినప్పుడు తిరుమల పరిధి, విస్తీర్ణం గురించి మాట్లాడలేదు. బ్రిటీష్ హయాం నుంచి ఉన్న హద్దులనే ప్రస్తావించామని చాలా క్లారిటీగా అప్పడు జిల్లా కలెక్టర్ గా ఉన్న నారాయణశర్మ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇంత కంటే సాక్ష్యం కావాలా? బట్టకాల్చి ప్రతిపక్షం వేయడం, బురద జల్లి కడుక్కోమని చెప్పడం అలవాటుగా మారింది. బస్సు టిక్కెట్లపైనా దుర్మార్గమైన ప్రచారం.. ఇంకా దారుణంగా తిరుమల పవిత్రతను తగ్గించాలన్న ప్రయత్నం వైస్.రాజశేఖర్ రెడ్డి గారి నుంచే ఉందంటూ మరింత నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతూ... ఏడు కొండలతోపాటు తిరుమలకు వెళ్లే బస్సు టిక్కెట్ల మీద కూడా అన్యమత ప్రచారాలు జరిగాయని అత్యంత దుర్మార్గంగా ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 05–03–2019 నాడు ఆర్టీసీ తరపున ఆర్డర్ కాపీ విడుదల చేశారు. అప్పటికి మా ప్రభుత్వం ఇంకా అధికారంలోకి రాలేదు. మీరు మాత్రం వైయస్.జగన్ ప్రభుత్వం మీద నిందలు వేస్తూ... అసెంబ్లీలో కొన్ని టిక్కెట్లు కూడా చూపించారు. కానీ వాస్తవంగా మీ ప్రభుత్వ హయాంలోనే అప్పటి ఆర్టీసీ ఈడీ నెల్లూరు రీజియన్ లో ఆర్టీసీ టిక్కెట్ల మీద ప్రచారం చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారు. నెల్లూరు, తిరుపతి పక్కనే ఉండడంతో ఆ టిక్కెట్ల రూల్ తిరుమలలో వాడారు. ఆ జీవో ఇచ్చిందీ చంద్రబాబే, దాన్ని మాకు ఆపాదిస్తూ అడ్డగోలుగా అబద్దాలు ప్రచారం చేసిందీ ఈ శుద్దపూసలే. పాపం వారు చేసి... మా పై నిందలు మోపుతున్నారు. శ్రీవాణి ట్రస్ట్ తో ఆలయాలు అభివృద్ధి..: వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చిన డబ్బులతో 5263 ఆలయాలను మంజూరు చేసి వాటిని రూ.664 కోట్లతో నిర్మించారు. మీ బ్రతుకు మొత్తంలో ఎప్పుడైనా టీడీపీ ప్రభుత్వ హయాంలో కానీ, చంద్రబాబు గానీ ఓ రూ.200 కోట్లు పెట్టి ఆలయమైనా నిర్మించిన చరిత్ర ఉందా? రూ.664 కోట్లు మంజూరు చేసి, 939 ఆలయాల నిర్మాణం పూర్తిచేయడంతోపాటు మరో 1857 ఆలయాల నిర్మాణం వివిధ దశల్లో ఉండగా.. మిగిలిన 2214 ఆలయాల నిర్మాణం ఇంకా మొదలు పెట్టాల్సి ఉంది. ఇది కాదా హిందూమతాన్ని రక్షించడం? ఇది కాదా హిందూ మతాన్ని అభివద్ధి చేయడం? వేయికాళ్ల మండపాన్ని కూల్చడం హిందుత్వమా?.. హిందువులను గౌరవించడం అంటే వేయికాళ్ల మండపాన్ని కూలగొట్టడమా చంద్రబాబూ? హిందుత్వాన్ని పెంపొంచించడం అంటే చర్చిలకు వెళ్లినప్పుడు ఏడు కొండలు జీవోలను రద్దు చేస్తామని చెప్పడమా? ఇన్నేళ్లుగా మీరు చేస్తున్న నీచమైన రాజకీయాలను ప్రజలు ఛీకొడుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టుపైనా పచ్చి అబద్ధాలు: మరోవైపు వెలిగొండ ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబు అక్కడ కూడా అనేక అబద్దాలు చెప్పారు. వెలిగొండను మేమే మొదలుపెట్టాం.. మేమే పూర్తి చేస్తామని ట్వీట్ చేశారు. మీ బ్రతుకు మొత్తంలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేసిన చరిత్ర ఉందా? మీ సొంత నియోజకవర్గం కుప్పానికి సైతం వైయస్.జగనే నీళ్లిచ్చారు. గుక్కెడు నీళ్లు కోసం గొంతెండిపోతున్న రాయలసీమకు అవసరమైన రాయలసీమ ఎత్తిపోతలు పథకానికి నీ హాయంలోనే ఉరేస్తున్నావు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లాలూచీపడి, లోపాయికారీ ఒప్పందాలతో రాయలసీమను దగా చేస్తున్న చరిత్ర నీది చంద్రబాబూ.ఇవాళ టీడీపీ నుంచి 1996లో శంకుస్థాపన చేసి ఇవాళ పూర్తి చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఎన్నేళ్లకు ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు? ఎంత దగా చేశారు. రెండేళ్ల నుంచి విపరీతంగా పనులు జరుగుతున్నాయని చెబుతున్నారు. వెలిగొండలో తట్టెడు మట్టి కూడా తవ్వని చంద్రబాబు..: వెలిగొండ చరిత్ర చూస్తే... ఆ ప్రాంతానికి నీళ్లు రావాలంటే 845 అడుగుల ఎత్తులో శ్రీశైలంలో నీళ్లు నిల్వ ఉన్నప్పుడు అక్కడ నుంచి కొండల మధ్య నీళ్లు నింపాలని పూలసుబ్బయ్య ఆశపడ్డారు. 1983లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి అధికారం లాక్కొని అదే ప్రభుత్వంలో సీఎం అయిన బాబు 9 ఏళ్లు పరిపాలించారు. వెలిగొండ ప్రాజెక్టులు 2021లో శాంక్షన్ వచ్చిందని చెబుతున్నారు. అంటే దానర్థం మీరు ఆ ప్రాజెక్టును చేయలేదనే కదా అర్ధం. వెలిగొండకు దివంగత మహానేత వైయస్సార్ శంకుస్థాపన చేశారు. రూ.3,300 కోట్లు పైచిలుకు వెచ్చించి రెండు సొంగాల పనుల మొదలుపెట్టి, భూసేకరణ చేసి, పర్యావరణ అనుమతులు తెచ్చి ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టించాడు. వైయస్సార్ వచ్చే వరకు చంద్రబాబు తట్టెడు మట్టి కూడా తియ్యలేదు. 2004–10 మధ్యలో దాదాపు రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టారు. 18.5 కిలోమీటర్ల టన్నెల్ లో 11.5 కిలోమీటర్లు ఒకటి రెండో టన్నెల్ లో 4.5 కిలోమీటర్లు వైయస్సార్ పూర్తి చేస్తే..మొత్తం 37 కిలోమీటర్ల టన్నెల్ కాగా... ఆ తర్వాత చంద్రాబు వచ్చి కేవలం 6 కిలోమీటర్లు పూర్తి చేశారు.ఆ తర్వాత వచ్చిన వైయస్.జగన్ వేలకోట్ల రూపాయలు వెచ్చించి రెండు టన్నెల్స్ పూర్తి చేశారు. 2024లో కూడా వైయస్.జగన్ టన్నెల్స్ ని జాతికి అంకితం చేశారు. రెండో టన్నెల్ లో మిషన్ ఆగిపోతే అది కోర్టులో కేసు నడుస్తుంటే.. ఇవాళ చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇంకా ఆ కోర్టు కేసు పెండింగ్ లో ఉన్నా కూడా దాన్ని తీసేయించే పని చంద్రబాబు చేయలేదు. ఆర్ ఆండ్ ఆర్ క్లియర్ చేయలేదు. నిర్వాసితులు సమస్యలు తీర్చకుండా.. రెండేళ్ల నుంచి రెండు కిలోమీటర్లు లైనింగ్ వర్క్ చేసి... అంతా మేమే చేశామని చెప్పుకుంటున్నారు. హెడ్ రెగ్యులేటర్ వర్క్, ఫీడర్ కెనాల్ వర్క్స్ పూర్తి కాలేదు. టన్నెల్ వర్క్ ఏమీ చేయలేదు. అందులో మిషన్ ని డిస్ మెంటల్ చేసే పని కూడా చేయలేదు. తీగలేరు ద్వారా వెలిగొండకు నీళ్లు పోవాలి. ఇప్పటివరకు దానికి భూసేకరణ చేయలేదు. మీకు దమ్ముంటే వెలిగొండపై మీ హయాంలో కేటాయించిన నిధులెంత ? మీరు పెట్టిన ఖర్చెంత ? దానిపై శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఒక ఏడాది రూ.200 కోట్లు కేటాయిస్తూ రూ.100 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. మరో ఏడాది రూ.300 కోట్లు కేటాయించి రూ.100 కోట్లు ఖర్చు చేయలేదు. మరలా ఇప్పుడు రూ.400 కోట్లకు టెండర్లు పిలిచారు. మీరు అసెంబ్లీలో రూ.4000 కోట్లు పనులు పెండింగ్ లో అని చెప్పి.. రూ.వందల కోట్లు ఖర్చు పెడితే ఎప్పటికి మీరు ప్రాజెక్టు పూర్తి చేస్తారు ? ఎవరికి పుట్టిన బిడ్డకి మీరు పేరు వేసుకోవడం అలవాటు.