ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి డిమాండ్‌

అసెంబ్లీ మీడియా పాయింట్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌తారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన ఆమె, ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని విమర్శించారు. అధికారంలోకి వస్తే పీఆర్సీ, ఐఆర్‌ ఇస్తామని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోను పక్కన పెట్టారని మండిపడ్డారు. 

ఉద్యోగులకు సంబంధించి దాదాపు రూ.35 వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని క‌ల్ప‌ల‌తారెడ్డి ఆక్షేపించారు. బకాయిలను పెంచుకుంటూ పోవడం సరికాదని, వెంటనే చెల్లింపులు చేయాలని కోరారు. చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్ల‌క్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సుమారు 20 నెలలు గడిచినా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని, శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ఉద్యోగుల సహకారం లేకుండా సక్రమంగా నడవలేవని ఆమె వ్యాఖ్యానించారు. ఉద్యోగుల ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి హామీలను నెరవేర్చాలని క‌ల్ప‌ల‌తారెడ్డి కోరారు. 

Back to Top