పశ్చిమగోదావరి జిల్లా: తాడేపల్లిగూడెం మండలంలోని వీరంపాలెంలో జనసేన పార్టీకి భారీ షాక్ తగిలింది. పట్టింపాలెం గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు జంపల్లి సత్యవతి జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పి వైయస్ఆర్‌సీపీలో తిరిగి చేరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జి వడ్డి రఘురామ్ ఆధ్వర్యంలో ఆమె పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వడ్డి రఘురామ్ పార్టీ కండువా కప్పి జంపల్లి సత్యవతి, ఆమె భర్తను పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీగా గెలుపొందిన సత్యవతి, అనంతరం జరిగిన ఒత్తిళ్ల కారణంగా జనసేనలో చేరినట్లు తెలిపారు. అయితే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తనకు ఉన్న విశ్వాసం, వడ్డి రఘురామ్ నాయకత్వంపై నమ్మకంతో తిరిగి పార్టీలో చేరినట్లు వెల్లడించారు. ఇకపై పార్టీకి విధేయురాలిగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి వడ్డి రఘురామ్ నాయకత్వంలో శ్రమిస్తానని తెలిపారు.