హెరిటేజ్‌పై చర్చకు ప్రభుత్వం వెనకడుగు 

సభలో అడుగడుగునా ఆటంకాలు కల్పించారు

లఘు చర్చలో స్టేట్‌మెంట్‌ అంటూ కొత్త సాంప్రదాయం

కూటమి తీరుపై మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం  

సభను తెలుగుదేశం కార్యాలయంగా మార్చేశారు 

మంత్రి పయ్యావుల కేశవ్‌ సభను కనుసైగలతో శాసించారు

చర్చ జరగకుండా కూటమి సభ్యులు ఛైర్మన్‌ పోడియం చుట్టుముట్టారు

బీఏసీలో చర్చకు అంగీకరించి సభలో ఛైర్మన్‌తో అమర్యాదగా వ్యవహరించారు

వివరాలు వెల్లడించిన బొత్స సత్యనారాయణ 

మండలి సమావేశాల చరిత్రలో ఇది చీకటి రోజు 

ప్రభుత్వం బాధ్యత లేకుండా ప్రవర్తించింది

టీటీడీ నిధులు దోపీడీపై మా వద్ద ఆధారాలున్నాయి

డెయిరీ మాఫియాను సృష్టించి హెరిటేజ్‌ దోచుకుంది

శాసనసభలో చంద్రబాబు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు

వాటిని ఆధారాలతో సహా నిరూపిస్తామనే కూటమిలో భయం 

సమావేశాల ఆఖరి రోజు వరకు లడ్డూపై చర్చకు పట్టుబడతాం

స్పష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు 

అసెంబ్లీ మీడియా పాయింట్, వెలగపూడి:  ముఖ్యమైన రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్, కల్తీ నెయ్యి వ్యవహారంపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం.. సభలో మాత్రం సమాధానం చెప్పలేక ఉద్దేశపూర్వకంగా వాయిదా వేయించిందని, మంత్రి పయ్యావుల కేశవ్‌ అనుచితంగా వ్యవహరించారని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఇందాపూర్‌ ముసుగులో చంద్రబాబు కుటుంబ సంస్థ హరిటేజ్‌ చేసిన అవినీతి గురించి చర్చ జరగడం ఇష్టం లేకనే అడుగడుగునా ఆటకం కల్పించడంతోపాటు, సభా నియమాలను సైతం ఉల్లంఘించారని ఆరోపించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కూడా రేవంత్‌ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు పలికేలా మాట్లాడారని వెల్లడించారు. వారి సన్నిహిత సంబంధాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.
అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్సీలతో కలిసి మాట్లాడిన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఇంకా ఏమన్నారంటే..:

సభా గౌరవాన్ని కించపర్చడం సరికాదు:
    తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపిస్తూ, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం, జగన్‌గారిపై బురద చల్లి, చివరకు దేవ దేవుణ్ని కూడా రాజకీయాల్లోకి లాగి చంద్రబాబు చేసిన కుట్రలు, తిరుమల సొమ్మును దోచుకోవడానికి ఆయన చేసిన అవినీతి వ్యవహారం సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్, హెరిటేజ్‌–ఇందాపూర్‌ డెయిరీ బంధం వెలుగులోకి రావడంతో.. బట్టబయలయ్యాయి. అయినా ఇంకా నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈరోజు తప్పించుకుని ఉండొచ్చుగాక, కానీ వారు చేసిన అపచారాలకు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. మేము మాత్రం ఆ అంశాలపై చర్చ విషయంలో వెనుకంజ వేయబోము. సమావేశాల చివరి రోజు వరకు కల్తీ నెయ్యి, ఇందాపూర్‌–హెరిటేజ్‌ సంబంధాలపై చర్చకు పట్టుబడుతూనే ఉంటాం. కాగా, మీడియా పబ్లిసిటీ కోసం సభా మర్యాదలు, వ్యక్తుల గౌరవాన్ని కించపరచడం ఏ మాత్రం తగదు.

రేవంత్‌ రెడ్డి మాటలను ప్రభుత్వం సమర్థించింది:
    రాయలసీమ లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? అసలీ ప్రాజెక్టు ఎందుకు ఆగింది? తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పిన మాటలు నిజమా కాదా? అని మండలిలో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తే దానికి నేరుగా సమాధానం చెప్పకుండా పిట్టకథలతో డైవర్ట్‌ చేయాలని చూశారు. రాయలసీమ ప్రాంతానికి జీవనాధారం లాంటి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తూ కల్లబొల్లు మాటలతో కాలక్షేపం చేశారు. కీలకమైన ప్రాజెక్టు గురించి సమాధానం చెప్పే సత్తా లేక ప్రభుత్వం చేతులెత్తేసింది. రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ ప్రభుత్వం ఖండించలేకపోతోంది.
    ‘మీరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పం. మాకు నచ్చిన వాటి గురించి మాట్లాడతాం’ అనే విధంగా వ్యవహరించారు. నేరుగా సమాధానం చెప్పలేక మధ్యలో హరీశ్‌రావు పేరును, బీఆర్‌ఎస్‌ పార్టీని తీసుకొచ్చి చర్చను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. వారి రాజకీయ ప్రయోజనాల కోసం హరీశ్‌రావు, బీఆర్‌ఎస్‌ పార్టీ ఏం వ్యాఖ్యలు చేసి ఉన్నా వాటిని వైయ‌స్ఆర్‌సీపీఖండిస్తోంది. కానీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ కూడా రేవంత్‌ రెడ్డి మాటలను ఖండించకుండా వత్తాసు పలికేలా మాట్లాడారు. వారి సన్నిహిత సంబంధాలు, రాజకీయ ప్రయోజనాల కోసం రాయలసీమ ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారు.  

కొత్త సంప్రదాయం తీసుకొచ్చారు:
    దేవదేవుడి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని సీబీఐ సిట్‌ ఛార్జిషీట్‌ సాక్షిగా తేలిపోయింది. చంద్రబాబు తన వ్యక్తిగత స్వార్థం, రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా స్వామి వారిని రాజకీయాల్లోకి లాగాడని ఆధారాలతో సహా ప్రజలు అర్ధం చేసుకున్నారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ సొమ్మును హెరిటేజ్‌ కి దోచిపెట్టడానికే కల్తీ నెయ్యి పేరుతో దుష్ప్రచారం చేశాడు. తిరుమలకు నెయ్యి సరఫరాలో ఇందాపూర్, వైష్ణవి, సంగం డెయిరీల పాత్రపై కూలంకషంగా చర్చ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాం. బీఏసీ సమావేశంలో అన్నింటికీ అంగీకరించి మా సభ్యులు మాట్లాడటానికి చైర్మన్‌ అవకాశం కల్పిస్తే, క్వశ్చన్‌ అవర్‌ ముందు పెట్టాలని కొత్త సాంప్రదాయం తీసుకొచ్చారు. ఆ తర్వాత స్టేట్‌ మెంట్‌ ఇస్తామని చర్చ ప్రారంభం కాకుండానే ముగించారు.

సభను హైజాక్‌ చేసే ప్రయత్నం చేశారు:
    షార్ట్‌ డిస్కషన్‌లో స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఏంటి? ఛైర్మన్‌కు కూడా   తెలియకుండా సభను హైజాక్‌ చేసే ప్రయత్నం చేశారు. మండలిని టీడీపీ కార్యాలయం అనుకుంటున్నారేమో!. చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ అవినీతి బాగోతం బయటపడుతుందనే భయంతోనే ప్రభుత్వం చర్చ జరపకుండానే ముగించింది. చేతిలో అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్దకి వచ్చి గొడవ పెట్టి సభను వాయిదా వేయించడం ఎప్పుడూ జరగలేదు. చర్చకు భయపడి చైర్మన్‌ గురించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడటమే కాకుండా వైయ‌స్ఆర్‌సీపీ వాకౌట్‌ చేసిందని అధికార పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. ఎన్నాళ్లయినా కల్తీ నెయ్యిపై చర్చకు వైయ‌స్ఆర్‌సీపీ పట్టుబడుతూనే ఉంటుంది. 

హెరిటేజ్‌ అవినీతి బయటపడుతుందని భయం:
    ఇందాపూర్‌ డెయిరీ అనేది చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ అనే విషయం వారి వెబ్‌సైట్‌లోనే రాసుకున్నారు. ఇదే ఇందాపూర్‌ డెయిరీ బహిరంగ మార్కెట్‌లో కేజీ నెయ్యి రూ.560లకు విక్రయిస్తూ టీటీడీకి మాత్రం రూ.658లకు సప్లై చేయడం అవినీతి కాదా? వైష్టవి డెయిరీ, సంగం డెయిరీలు వేర్వేరు కాదనీ తేలిపోయింది. ఏఆర్‌ డెయిరీ పంపిన నెయ్యి ట్యాంకర్లను కల్తీ అని టీటీడీ తిరస్కరించి పంపితే, అవే ట్యాంకర్లు వైష్ణవి డెయిరీ పేరుతో మళ్లీ ఎలా టీటీడీపీలోకి ప్రవేశించాయి? ఆ నెయ్యిని లడ్డూ తయారీలో ఎందుకు వాడారు? ఇది కూటమి ప్రభుత్వంలోనే కదా జరిగింది? వాటన్నింటిపై చర్చకు డిమాండ్‌ చేస్తే ప్రభుత్వం పారిపోయింది.
    ఇప్పుడే కాదు గతంలో 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా హెరిటేజ్‌ డెయిరీకి మజ్జిగ సరఫరా కాంట్రాక్టు ఇచ్చి దోచుకున్నాడు. వీటన్నింటిపై మండలిలో సమాధానం చెప్పలేకపోయింది. దేవుడిని అడ్డం పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడిన చంద్రబాబు, దాన్ని కప్పి పుచ్చుకునేందుకు కల్తీ నెయ్యి పేరుతో రాజకీయ కుట్రకు తెర లేపిందే కాకుండా ఆ నెపాన్ని వైయ‌స్ఆర్‌సీపీ మీదకు నెట్టాడు.    

భవిష్యత్తులో వారికి మూల్యం తప్పదు:
    చిట్టచివరికి చంద్రబాబు పాపం పండింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగి ఆయన చేసిన కుట్రలు, తిరుమల సొమ్మును దోచుకోవడానికి చేసిన అవినీతి బయటపడింది. దేవుడి ముసుగులో చేయరాని తప్పులు చేశారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. దేవుడి సంపదను దోచుకోవడం కోసం ఆయన పవిత్ర ప్రసాదంపై నిందలేయడం క్షమించరాని తప్పు. అధికారంలోకి ఉంది కాబట్టి ఈరోజు తప్పించుకుని ఉండొచ్చుగాక, కానీ వారు చేసిన అపచారాలకు భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారు. మాయమాటలతో తిరుమల తిరుపతిని ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలందరికీ తెలియాలి. 
 
చంద్రబాబు కుట్రలను ఆధారాలతో బహిర్గతం చేశాం :
    దేవుడి ముసుగులో చంద్రబాబు చేసిన కుట్రలన్నీ బయట పడిపోతుంటే సమాధానం చెప్పుకునే ధైర్యం లేక దివంగత వైయస్సార్‌ గారిని తీసుకొచ్చి ఏడు కొండలను రెండు కొండలు చేశాడంటూ చంద్రబాబు మరో తప్పుడు ప్రచారానికి తెరలేపాడు. అది కూడా తప్పని జీవో నెంబర్లతో సహా రుజువు చేశాం. రాజకీయ లబ్ధి కోసం ఏడు కొండలను రెండు కొండలుగా చేస్తామని ప్రచారం చేసిన ఘనుడు చంద్రబాబేనని ప్రజల ముందు ఆధారాలు పెట్టాం. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కూటమి వచ్చాక, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలయాల్లో వరుసగా దుర్ఘటనలు జరిగి ఎంతోమంది అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోతున్నారు. తిరుమతి, సింహాచలం, కాశీబుగ్గ, కోటప్పకొండ ఆలయాల్లో జరిగిన దుర్ఘటనలే ఉదాహరణలు. శ్రీశైలం ఆలయంలో దర్శనానికి వచ్చిన భక్తులు అలమటించిపోయారు. ఆలయంలో భక్తులపై లాఠీచార్జి చేయడం ఏంటి? ఎప్పుడూ చూడని దారుణాలు కూటమి పాలనలోనే జరుగుతున్నాయి.
    గతంలోనూ పుష్కరాల పేరుతో ఆలయాలను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రచార పిచ్చికి 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగినా దుర్ఘటనలే. ప్రభుత్వం చేసిన హత్యలుగానే చూడాలి. కానీ ఏ దుర్ఘటనలోనూ నిందితులపై చర్యలు తీసుకోకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూనే ఉన్నారు. అందుకే, ఈ దుర్ఘటనలకు ఫుల్‌స్టాప్‌ పడటం లేదని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.

ఇంకా ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏమన్నారంటే..:
రాష్ట్ర చరిత్రలో చీకటి రోజు: లేళ్ల అప్పిరెడ్డి.

– ఏపీ శాసనమండలిలో ఈరోజు జరిగిన సంఘటన రాష్ట్ర చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం చేస్తే కల్తీ నెయ్యిపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం చర్చించకుండానే పారిపోయింది. లఘు చర్చలో మంత్రి స్టేట్‌మెంట్‌ తర్వాత సభ్యులు మాట్లాడటం ఎప్పుడూ జరగలేదు. ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ఏనాడూ హెరిటేజ్‌ ఫుడ్స్‌ పాల్గొనలేదని చంద్రబాబు పచ్చి అబద్దం చెప్పాడు. 1998 నుంచే హెరిటేజ్‌ పాల్గొన్నట్టు ఆధారాలు చూపిస్తున్నాం. వీటన్నింటిపై చర్చ జరిగితే తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌ అవినీతి బాగోతం బయటకొస్తుందనే భయంతో నారా లోకేష్‌ టీడీపీ సభ్యులను ఉసిగొల్పి ఆటంకాలు కల్పించాడు. హెరిటేజ్‌ – ఇందాపూర్‌ డెయిరీల అనుబంధంపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. మున్సిపాలిటీ పరిధిలో కడప మేయర్‌ కొడుకు కాంట్రాక్టు పనులు చేశాడన్న కారణం చూపించి సురేష్‌ గారిని పదవి నుంచి దించేసింది. అలాంటిది హెరిటేజ్‌ కాంట్రాక్టులపై ప్రజలకు చంద్రబాబు, లోకేష్‌లు ఏం సమాధానం చెబుతారు?  

మండలి ఛైర్మన్‌ను మంత్రి పయ్యావుల కేశవ్‌ అవమానించారు.
:మొండితోక అరుణ్‌కుమార్‌.

– లడ్డూ మీద చర్చ ఉండకూడదనే దురుద్దేశంతోనే టీడీపీ సభ్యులు మళ్లీ ప్రశ్నోత్తరాల సమయం పెట్టాలని శాసనమండలి చైర్మన్‌ పోడియంను చుట్టుముట్టి బెదిరింపులకు దిగారు. మండలి చైర్మన్‌ రూలింగ్‌నే తప్పుపడుతూ మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యవహరించిన తీరు దారుణం. ఇది దళితుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. మా సభ్యులు మాట్లాడుతుండగా మంత్రి పయ్యావుల మైకులు కట్‌ చేయించాడు. ఎవరికి మైకు ఇవ్వాలి, ఎప్పుడు కట్‌ చేయాలి, టీవీల్లో చూపించాలా వద్దా అనే విషయాలన్నీ చైర్మన్‌ కి ఉన్న అధికారాలైతే వాటిని కూడా పయ్యావుల హైజాక్‌ చేశాడు. సీసీ టీవీ ఫుటేజ్‌ తీస్తే పయ్యావుల కనుసైగలతో చూపించిన అహంకారం బయటకొస్తుంది. 

డెయిరీ మాఫియాను హెరిటేజ్‌ తయారు చేసింది.
:పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.

– లడ్డూపై చర్చజరగడం ఇష్టం లేకనే ఉద్దేశపూర్వకంగా టీడీపీ సభ్యులు సభలో ఆటంకాలు సృష్టించారు. దేవుడి ముసుగులో చంద్రబాబు, ఆయన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ చేసిన దారుణాలను ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతామని భయపడిపోయి చర్చను జరగనీయకుండా మంత్రి పయ్యావుల కేశవ్‌ దుర్మార్గంగా ప్రదర్శించారు. మేం చెప్పిందే వినాలన్నట్టు అధికార గర్వంతో రెచ్చిపోయాడు. ఇలాంటి చర్యలు ద్వారా దేవుడి ముసుగులో చంద్రబాబు అవినీతి చేశాడనే విషయం మరింత వేగంగా ప్రజల్లోకి వెళ్లింది. సొంత మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ కి డబుల్‌ రేట్‌కి నెయ్యి సప్లై కాంట్రాక్టు ఇచ్చుకునేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదంపైనే చంద్రబాబు నిందలేశాడు. ఏఆర్‌ డెయిరీ పేరుతో జరిగిన దారుణాలన్నీ వారి ప్రభుత్వంలో జరిగితే దానికి వైయ‌స్ఆర్‌సీపీ మీదకు నెట్టాలని చూశారు. వైష్ణవి డెయిరీ, ఇందాపూర్, బోలేబాబా, సంగం, ఏఆర్‌ డెయిరీలతో హెరిటేజ్‌ ఒక పెద్ద డెయిరీ మాఫియాను తయారు చేసింది. 

భక్తులకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
:కుంభా రవిబాబు.

– శాసనమండలిలో ఈరోజు టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యంలోనే చీకటి రోజు. పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదంపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం, చివరికి సమాధానం చెప్పుకోలేక పారిపోయింది. అనుక్షణం సభలో సమయం వథా చేసే ప్రయత్నమే జరిగింది. సభలో గందరగోళ వాతావరణం సష్టించారు. కల్తీ నెయ్యి పేరుతో తీవ్రమైన ఆరోపణలు చేసి భక్తుల మనోబావాలతో ఆడుకున్న చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, లోకేష్‌ ప్రజలకు సమాధానం చెప్పాలి. సీబీఐ సిట్‌ చార్జిషీట్‌లో వెల్లడించిన విషయాలన్నీ ప్రజల ముందుకి రావాలి. 

పయ్యావుల అరాచకం గురించి రాయగలరా?  
:పాలవలస విక్రాంత్‌.

– రాయలసీమ లిఫ్టు ఇరిగేషన్‌ స్కీమ్‌పై చర్చ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో ఏపీ సీఎం చంద్రబాబు చేసుకున్న చీకటి ఒప్పందం గురించి బయటకు రావాలని ఛైర్మన్‌ పోడియం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది. కానీ నేను దూషణలు చేశానని, దాడి చేశానని చెప్పడం సిగ్గుచేటు. కూటమి సభ్యుల అనాగకరిక చర్యలను ప్రస్తావించకుండా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులపై దుష్ప్రచారం చేయడం ఎల్లో మీడియా దిగజారుడుతనానికి నిదర్శనం. వాస్తవాలు రాయాలంటే ఈరోజు సభలో మంత్రి పయ్యావుల కేశవ్‌ వ్యవహరించిన తీరు గురించి రాయాలి. 

 

Back to Top