ప్రజల అభ్యున్నతికి వైఎస్ జీవితం అంకితం: విజయమ్మ


హైదరాబాద్:తెలుగునేలపై కులం, మతం, ప్రాంతం తేడాలు లేకుండా.. ప్రజలందరి ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి తన జీవితాన్ని అంకితం చేశారని వైఎస్ విజయమ్మ అన్నారు. ప్రతి రైతుకు, పేదవాడికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందాలని ప్రతిక్షణం తపించారని ఆమె గుర్తుచేశారు. రాష్క్ట కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించిన అనంతరం విజయమ్మ మాట్లాడారు. వైఎస్‌సీఎంగా బాధ్యతలు చేపట్టేనాటికే అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను సిద్ధం చేసుకున్నారని తెలిపారు. తన 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాష్ట్రంలోని ప్రతి జిల్లా, ప్రతిగ్రామం సందర్శించారని.. వారి కోసం దీక్షలు, పోరాటాలు చేశారని పేర్కొన్నారు. తల్లీ, తండ్రి మాదిరిగా ప్రజల బాగోగుల గురించి అనుక్షణం తపించారని, తానున్నానని భరోసా ఇచ్చారని విజయమ్మ చెప్పారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే మళ్లీ అలాంటి ప్రభుత్వం వస్తుందని.. దానిని సాధించుకుని నిజం చేసకోవచ్చునని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఏదీ సాధ్యం కాదని చెప్పారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లలో 67 సీట్లను కేజ్రీవాల్ సాధించారని.. మనలో ధీమా, విశ్వాసం ఉంటే దేనినైనా సాధించవచ్చని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఖమ్మం జిల్లాలో శ్రీనివాసరెడ్డి ఎంపీ సీటుతోపాటు నాలుగు ఎమ్మెల్యే సీట్లను సాధించగలిగామని.. అని జిల్లాల్లో పార్టీకి అటువంటి స్ఫూర్తి రావాలని కోరుకుంటున్నామని విజయమ్మ చెప్పారు. కాగా.. ఇప్పుడు ఇరు రాష్ట్రాల్లో సాగుతున్న పాలన ప్రజలను మోసం చేసి, మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శించారు. అప్పట్లో వైఎస్సార్ ప్రజలపై ఒక్క రూపాయి భారం మోపకుండా, ఛార్జీలను పెంచకుండా బ్రహ్మాండంగా పాలన చేస్తే.. ఇప్పుడు ప్రతిదానిలో కోతలే కనినిస్తున్నాయన్నారు. వైఎస్‌సంక్షేమ కార్యక్రమాలను మళ్లీ బతికించుకోవాలని విజయమ్మ పిలుపునిచ్చారు. మనకు ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయని, దేవుడు కూడా ఇస్తాడని.. ప్రతి ఒక్కరూ పోరాడి, సాధించుకోవాలని సూచించారు. పార్టీ తెలంగాణ కమిటీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని..పార్టీ కోసం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, షర్మిల ఎప్పుడూ అందుబాటులో ఉంటారని, తాను కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని విజయమ్మ చెప్పారు.
Back to Top