జగన్‌కు నిమ్సులో విజయమ్మ పరామర్శ

హైదరాబాద్, 11 అక్టోబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని ఆయన మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ శుక్రవారం ఉదయం పరామర్శించారు. ఉదయాన్నే ‌నిమ్సుకు చేరుకున్న ఆమె శ్రీ జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దని, సమైక్యంగానే కొనసాగించాలంటూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేసిన ఆమరణ నిరాహార దీక్షను బుధవారం అర్థరాత్రి భగ్నం చేసిన పోలీసులు ఆయనను నిమ్సు ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అక్కడ వైద్యులు జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై మీడియాతో మాట్లాడిన వైద్యులు వెంటవెంటనే రెండుసార్లు నిరాహార దీక్ష చేయడం ఆయన ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపిందని తెలిపారు. శ్రీ జగన్‌ శరీరంలో ప్రస్తుతం కీటోన్సు ఎక్కువగా ఉన్నాయని, అవి తగ్గడానికి మరికొంత సమయం పడుతుందన్నారు. వైద్య పరీక్షల తర్వాత చక్కెర స్థాయి 113కు పెరిగిందన్నారు. సాధారణ స్థాయికి చేరుకునేందుకు మరికొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రస్తుతానికి ఐవీ ఫ్లూయిడ్సు ఎక్కిస్తున్నామని, పళ్లరసాలు తీసుకోవాలని శ్రీ జగన్‌కు సూచించామని చెప్పారు.

శ్వాస తీసుకోవడం, పల్సు రేటు, రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని వైద్యులు వెల్లడించారు. కాగా శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే విషయంపై శుక్రవారం ఉదయం నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Back to Top