వంద రోజుల్లో ఎన్నికల షెడ్యూల్

హైదరాబాద్, 18 నవంబర్ 2013:

మరో వంద రోజుల్లో కాస్త అటూ ఇటూగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. సాధారణ ఎన్నికల కోసం సర్వసన్నద్ధంగా ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని ఖాజా మాన్షన్ ఫంక్షన్ హా‌ల్లో ‌సోమవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వంద రోజుల సమయంలో ఏయే పనులు చేశాం, ఇంకా మనం చేయాల్సిన పనులేంటీ? అని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.‌ రాజకీయాల్లో నాన్నను చూసినప్పుడు ఆయనలాగా ఉండాలని అనుకునేవాడినని చెప్పారు. ఫలానావాడు తమ నాయకుడని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునేలా ఉండాలని కలలు కనేవాడినని తెలిపారు. కానీ, నాన్న చనిపోయిన తరువాత ఈ వ్యవస్థను చూస్తే బాధ కలుగుతుందన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే అత్యంత కీలకమని, దానిలో మరింత ముఖ్యమైన ఓటర్ల నమోదు ప్రక్రియపై దృష్టిపెట్టాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రేణులకు ఉద్బోధించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదు చేసుకునేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు నడుం బిగించాలని సూచించారు. గడప గడపకూ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ వెళ్లాలని,‌ మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పథకాలను అమలు చేస్తామ‌నే విషయాన్ని ప్రజలకు తెలియ‌జేయాలని ఆయన సూచించారు. సోమవారం ఉద్యం హైదరాబాద్‌లో ప్రారంభమైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో శ్రీ జగన్‌ మాట్లాడారు. రాష్ట్రం విడిపోతే వచ్చే నష్టాలు, కష్టాల గురించి రానున్న100 రోజుల్లో గ్రామగ్రామాన తిరిగి ప్రజలలో చైతన్యం కల్పించాలని సూచించారు.

నిత్యం ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలన్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయండని చెప్పారు. ప్రతి గ్రామంలో కమిటీలు ఏర్పాటు చేయండన్నారు. 20 మందితో బూత్ కమిటీలు వేయండి అని దిశానిర్దేశం చేశారు. ప్రతి కో ఆర్డినేటర్ పనితీరునూ పర్యవేక్షిస్తామని, జిల్లా స్థాయిలో ఒక యూని‌ట్‌గా, రాష్ట్రమంతా ఒక యూనిట్‌గా ఈ పర్యవేక్షణ జరుగుతుందని చెప్పారు. ‘మీరంతా నాతో పాటుగా భుజం భుజం కలిపి అడుగులో అడుగు వేసి నడిచారు. నాకు తోడుగా నిలబడ్డారు. నా ప్రతి పోరాటంలోనూ వెంట నడిచారు. మనమంతా కలిసికట్టుగా పోరాటం చేశాం. కానీ ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో కొన్ని విషయాలు కచ్చితంగా మీతో చెప్పదలిచాను. ఇది మనకు చాలా కీలకమైన సమయం. 2014 మే 20 నాటికి ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది.

ఈ వ్యవస్థలో నిజాయితీ కనిపించడంలేదని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లు, సీట్ల కోసం ఎవరైనా, ఏదైనా చేయడానికి కూడా వెనుకాడని పరిస్థితి వచ్చిందన్నారు. మనం చేసే పనులను బట్టి ఓట్లూ, సీట్లూ మనకూ రావాలన్నారు. ఓట్లూ, సీట్ల కోసం రాజకీయ పార్టీలు గడ్డి అయినా తినడానికి సిద్ధమైపోయాయని శ్రీ జగన్‌ విమర్శించారు. దివంగత మహానేత ఒక్కరే అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని, అందుకే ఆయన హయాంలో పంచాయతీ సర్పంచ్‌ మొదలు ఎమ్మెల్యే వరకూ ఓటర్ల వద్దకు వెళ్ళి సగర్వంగా ఓటు అడిగే అవకాశం ఉండేదన్నారు. కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. మూడేళ్ళ క్రితం రచ్చబండ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ఎన్నికలు మరి కొద్ది నెలల్లో వస్తున్నాయనగా ఇప్పుడు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబులను ప్రజల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా నిలదీయాలని పార్టీ శ్రేణులకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విభజన విషయంలో వారిద్దరూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. సమైక్యానికి అనుకూలంగా కేంద్రానికి లేఖ ఎందుకు ఇవ్వడంలేదో నిలదీసి చంద్రబాబును నిలదీయాలని‌ శ్రీ జగన్ సూచించారు. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి చేస్తున్న మోసాలను ఎండగట్టాని హితబోధ చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేయాలని అన్నారు. సమైక్యం అంటే మూడు ప్రాంతాలూ కావాలన్నదే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నినాదం అని చెప్పారు. మూడు ప్రాంతాలకూ న్యాయం చేస్తామన్నదే మన నినాదం అని పార్టీ కేడర్‌కు శ్రీ జగన్‌ ఉద్బోధించారు.

దేశంలో హిందీ మాట్లాడే వారి తర్వాత అతి పెద్ద సంఖ్యలో తెలుగు జాతి ఉందని శ్రీ జగన్ గుర్తుచేశారు. రూ.1.75 లక్షల కోట్ల అతి పెద్ద బడ్జె‌ట్‌తో బలంగా ఉన్న రాష్ట్రాన్ని ఓట్లు, సీట్ల కోసం బలహీనపరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘17కన్నా ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రాలు 12 ఉన్నాయి. 25 స్థానాలున్నవి 8 ఉన్నాయి. విభజన జరిగితే జాబితాలో మన రాష్ట్రం 9, లేదా 14వ స్థానానికి దిగజారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సమైక్యం కోసం పోరాడుతున్నది వైయస్ఆర్‌ కాంగ్రెస్, సీపీఎం మాత్రమే. విభజనను అడ్డుకోవాల్సిన బాబు, కిర‌ణ్ ప్రజలను మోసం చేస్తున్నారు. కేంద్రం చెప్పినట్టల్లా చేస్తూ, విభజనకు పూర్తి సహకరిస్తూనే మరోవైపు ప్రజలను గందరగోళపరుస్తూ మోసపుచ్చుతున్నారు. వారి మోసాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. సమైక్యం కోసం ఇకపై కూడా ముందుండి పోరాడాలి’ అని నిర్దేశించారు.

మన ఎమ్మెల్యేలు గర్వకారణం :
‘మనది కొత్త పార్టీ. చాలామందికి అంతగా ఎన్నికల అనుభవం లేదు. మన పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు కూడా తక్కువే. మన ఎమ్మెల్యేల గురించి గర్వంగా చెప్పుకోవాలి. పదవులు పోతాయని, అనర్హులం అవుతామని తెలిసినా అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసి మన వెంట నిలిచారు. వారి గురించి గొప్పగా చెబుతూ ఉంటాను. మన పార్టీలో కొత్తవాళ్లు, గట్టివాళ్లని నమ్మిన వాళ్లకే  బాధ్యతలు అప్పగించాం. వారంతా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే. ఎన్నికల నిర్వహణ (ఎలక్షనీరింగ్) చాలా ముఖ్యం. ప్రతి బూత్‌కు 20 మందితో కమిటీలు వేసుకోకపోతే, ఆ కమిటీలో పదిమందినైనా పేర్లు పెట్టి పిలవలేకపోతే ఎన్నికలు చేసుకోలేరు. అందుకే గ్రామాలకు తరలండి. ప్రజలు ఏ మేరకు అభిమానం చూపిస్తున్నారో అప్పుడే అర్థమవుతుంది. వంద శాతం బూత్ కమిటీలు వేసిన వారికే టికెట్లిస్తాం’ అని శ్రీ జగన్ అన్నారు.

పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధం నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి విస్తృతస్థాయి సమావేశం ఇదే కనుక అనేక ప్రధానమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చాయి. రానున్న రోజుల్లో సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో ప్రధానంగా చర్చించారు. ఆరు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో.. ప్రత్యేకంగా ఆ అంశంపైన కూడా చర్చించారు. పార్టీ శ్రేణులకు ఈ విషయంపై అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు.

ఇన్నాళ్లూ పార్టీని ముందుండి నడిపించిన గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ కూడా‌ ఈ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఇంతకాలం జిల్లాల పర్యటనలు, నాయకులతో భేటీలు, పోరాటాలు, ఆందోళనలతో పార్టీని నడిపించడంతో పాటు జిల్లాల పరిస్థితులు బాగా తెలియడంతో శ్రీమతి విజయమ్మ సైతం వివిధ జిల్లాల నాయకులకు తన సూచనలు, సలహాలు అందించారు.

Back to Top