ప్రతి పేదవాడికి భరోసా ఇస్తున్నా


– చంద్రబాబు పాలనలో పేదల జేబులు ఖాళీ
– ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు.
– వైయస్‌ఆర్‌ హయాంలో గాలేరు–నగరి ప్రాజెక్టుకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు.
– నాలుగేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కనీసం కాల్వలు తవ్వలేకపోయారు
 – చేనేత, పవర్‌లూమ్‌ కార్మికుల పరిస్థితి అధ్వానం
– ఎన్ని లక్షలు ఖర్చైనా మీ పిల్లలను నేను చదివిస్తా
– అమ్మ  ఒడి పథకం కింద రూ.15 వేలు ఇస్తాం
– వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకుండా చూస్తాం
– ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తాం
– దీర్ఘకాలిక రోగులకు పింఛన్‌ రూ.10 వేలు చెల్లిస్తాం
 
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని, ఏ ఒక్క సామాజిక వర్గం కూడా సంతోషంగా లేరని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. మనందరి ప్రభుత్వం రాగానే ప్రతి పేదవాడికి భరోసా కల్పిస్తానని, విద్యా, వైద్యం కోసం పేదవాడు అప్పుల పాలు కాకూడదన్నదే తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలోనే పెట్రోలు, డీజిల్‌ ధరలు ఉన్నాయని, ప్రజల జేబులను నాలుగేళ్లుగా చంద్రబాబు ఖాళీ చేస్తున్నారని వైయస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 63వ రోజు నగరి నియోజకవర్గంలోని వడమాలపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అశేషజనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే..

పేరు పేరున కృతజ్ఞతలు
నడిరోడ్డును లెక్క చేయకుండా చిరునవ్వుతో ఆప్యాయతలు, ప్రేమానురాగాలు పంచుతున్నారు. ఆత్మీయతను చూపుతున్నారు. మీ అందరికి ముందుగా హృదయపూర్వక కృతజ్ఞతలు.  

బాబు ఎప్పుడు సీఎం అయినా..
ఈ రోజు ఉదయం నుంచి పాదయాత్రగా ఈ నియోజకవర్గంలో అడుగులో అడుగులు వేస్తుంటే చాలా మంది రైతులు వచ్చి అన్నా..ఇదే నియోజకవర్గంలో రేణిగుంట షుగర్‌ ఫ్యాక్టరీ ఉంది. మాజిల్లాలో ఆరు చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి. మా ఖర్మ ఏంటో తెలియదు కానీ చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా సహకార ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సహకార ఫ్యాక్టరీలు నడిస్తే రైతులకు మంచి రేట్లు వస్తాయి. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా ఈ ఫ్యాక్టరీలు మూత పడుతున్నాయి. గతంలో 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. రైతులు  అవస్థలు పడే పరిస్థితి వచ్చింది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆ చక్కెర ఫ్యాక్టరీ బకాయిలు కట్టి తెరిపించారు. నాన్నగారి పుణ్యమా అంటూ పదేళ్ల పాటు రైతులు సంతోషంగా ఉన్నారు. మళ్లీ చంద్రబాబు సీఎం కావడం, ఆ రెండు చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటం జరిగింది. ఆశ్చర్యం ఏంటో తెలుసా ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు మాత్రం లాభాల మీద లాభాలు వస్తున్నాయి. రైతులు వాళ్లకు ఇష్టం ఉన్నా..లేకున్నా ప్రైవేట్‌ పరిశ్రమలకు అమ్ముకోవాల్సి వస్తుంది. బెల్లం చేసేందుకు రైతులు ముందుకు వెళ్తే నల్లబెల్లం అంటూ ఆంక్షలు విధించి ఎగుమతులను అడ్డుకుంటున్నారు. ఇదే జిల్లాలో ఓ మహిళ ఓ బెల్లం ముద్ద చూపించింది. ఈ బెల్లం నల్లగా ఉంటే నేనేం చేయాలన్నా..నా భూమి నల్లగా ఉందన్నా..నేనేం చేయాలన్నా అని అడిగింది. ఇదే చంద్రబాబు నల్లబెల్లానికి ఆంక్షలు పెట్టి దుర్భిద్దుతో వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు దగ్గరుండి రైతులను నాశనం చేస్తున్నారు. 

చంద్రబాబు దగ్గరుండి రైతులను మోసం చేస్తున్నారు
 చిత్తూరు డయిరీ పరిస్థితి అంతే. సహకార రంగంలోని డయిరీలు రైతులకు మంచి రేట్లు ఇస్తాయి. ఇదే చంద్రబాబుకు రైతులు సంతోషంగా ఉండటం ఇష్టం లేదు. దగ్గరుండి హెరిటేజ్‌ పాల డయిరీ పెట్టించి దగ్గరుండి చిత్తూరు, విజయ డయిరీని మూత వేయించారు. రైతులు చిత్తూరు డయిరీకి పాలు పోస్తే మూడు, నాలుగు నెలల పాటు పేవ్‌మెంట్లు నిలిపివేశారు. ఓ అక్క నా వద్దకు వచ్చి ఓ లీటర్‌ బాటిల్‌ చూపించి అన్నా..ఈ లీటర్‌ బాటిల్‌ నీళ్లు రూ.22 అమ్ముతున్నారు. ఇదే బాటిల్‌లో పాలు పోస్తే రూ.20 అంటున్నారు. ఎలా బతకాలన్నా అని ఆ అక్క అడుగుతోంది. ఇంత దారుణంగా చంద్రబాబు దగ్గరుండి రైతులను మోసం చేస్తున్నారు.

వైయస్‌ఆర్‌ హయాంలో 85 శాతం పనులు పూర్తి
ఇదే జిల్లా రైతులు సస్యశ్యామలంగా బతకాలంటే హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులే కారణం. ఈ ప్రాజెక్టులకు వైయస్‌ఆర్‌ హయాంలో 85 శాతం పనులు పూర్తి చేశారు. ఇదే నగరి ప్రాజెక్టు అంతర్‌భాగంగా సమ్మర్‌ స్టోరేజీ కట్టారు. చంద్రబాబు నాలుగేళ్లుగా కాల్వను తవ్వలేకపోతున్నారు. ఇది చంద్రబాబుకు రైతుల మీద ఉన్న ప్రేమ.

బాబుకు ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తుకు వస్తున్నారు..
చంద్రబాబుకు మాటి మాటికి బీసీలపై ప్రేమ అంటుంటారు. ఎన్నికలు వచ్చేసరికి ఆయనకు బీసీలు గుర్తుకు వస్తారు. జిల్లాలోనే బీసీలు అధికంగా ఉన్న కుప్పంలో మాత్రం చంద్రబాబు పోటీ చేస్తారు. చంద్రగిరిలో పోటీ చేయడం లేదు. నగరిలో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులు ఎక్కువగా ఉన్నారు.వీరికి ప్రభుత్వం తోడుగా నిలవాలి. కానీ ఇవాళ వారికి సమయానికి సబ్సిడీ రావడం లేదు. రెండు నెలలు ఇస్తే, పది నెలలు ఎగుర గొడుతున్నారు. పక్కనే తమిళనాడులో పవర్‌లూమ్‌ కార్మికులకు ఆ ప్రభుత్వం ఏమి ఇచ్చేది అందరికి తెలుసు. కానీ చంద్రబాబుకు తెలియదు. పక్క రాష్ట్రంలో పవర్‌లూమ్‌ కార్మికుల కోసం ఏం చేస్తున్నారన్న దానిపై తానే ఓ అధ్యాయనం చేయించాను. వాళ్లు చేస్తున్న దాంట్లో మన రాష్ట్రంలో పది శాతం కూడా చేయడం లేదు. ఇదే నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిలో కనిపిస్తుంది. ఆ ఆసుపత్రిలో వసతులు లేవు, డాక్టర్లు ఉండరు. సీఎం సొంత జిల్లాలో ఇదీ పరిస్థితి. అగ్ని గుండ క్షత్రీయులు ఉన్నారు. నాలుగేళ్లుగా వారు బీసీ సర్టిఫికెట్ల కోసం సీఎంకు మొరపెట్టుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేడు. 

బాబు సీఎం కాకముందు..
చంద్రబాబు పాలనపై ఒక్కసారి ఆలోచన  చేయండి. ఏడాదిలో ఎన్నికలు జరుగబోతున్నాయని చంద్రబాబు చెబుతున్నారు. మీరంతా కూడా చంద్రబాబు పాలన గురించి ఆలోచన చేయండి. సీఎం అయ్యేందుకు చంద్రబాబు ఏమన్నారు..కరెంటు బిల్లులు షాక్‌కొడుతున్నాయి. అధికారంలోకి రాగానే కరెంటు బిల్లులు తగ్గిస్తా అన్నాడు. గతంలో రూ.50, 100 లోపు కరెంటు బిల్లులు వచ్చేవి. ఇప్పుడు రూ.500, 600, 1000 చొప్పున వస్తున్నాయి. గతంలో రేషన్‌షాపుల్లో 9 రకాల సరుకులు దొరికేవి. ఇవాళ బియ్యం తప్ప మరేమి ఇవ్వడం లేదు. పండుగొచ్చిందంటే చాలు ఆర్టీసీ బస్సులు ఎక్కేందుకు ప్రజలు భయపడుతున్నారు. విఫరీతంగా పెట్రోలు చార్జీలు పెంచారు. ప్రతి పేదవాడికి మూడుసెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామని చంద్రబాబు అన్నాడు. నాలుగేళ్ల తరువాత అడుగుతున్నాను..ఒక్క ఇల్లైనా కట్టించాడా? . నాడు బ్యాంకుల్లో పెట్టిన రుణాలు ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. నాలుగేళ్ల తరువాత మీ బంగారం ఇంటికి వచ్చిందా?. బ్యాంకుల నుంచి వేలం నోటీసులు ఇంటికి వస్తున్నాయి. జాబు కావాలంటే బాబు రావాలన్నారు. జాబు ఇవ్వకపోతే ప్రతి ఇంటికి రూ. 2 వేల నిరుద్యోగ భృతి అన్నారు. ప్రతి ఇంటికి రూ.90 వేలు చంద్రబాబు బాకీ పడ్డాడు. ఎప్పుడైనా ఆయన కనిపిస్తే నా రూ.90  ఇవ్వమని నిలదీయండి. పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మల రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు మాట ఇచ్చాడు. నాలుగేళ్ల తరువాత మీ రుణాలు మాఫీ అయ్యాయా? రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ప్రతి పేజీలో నుంచి ఒక కులాన్ని ఎలా మోసం చేయాలో టీడీపీ మేనిఫెస్టోలో కనిపిస్తుంది. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత, నిజాయితీ అనే పదాలు రావాలి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారు. నమ్మరని చంద్రబాబుకు తెలుసు అందుకే ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తామంటారు. 

మీ అందరి తోడు కావాలి
చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం పోరాడుతున్న తనకు మీ అందరి తోడు, చల్లని దీవెనలు కావాలి. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి, మీ అందరి దీవెనలతో మనందరి ప్రభుత్వం వచ్చాక మనం ఏం చేస్తామన్నది నవరత్నాలు ద్వారా ప్రకటించాను. ఇందులో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే సూచనలు, సలహాలు ఇవ్వమని మిమ్మల్ని కోరుతున్నాను. పేదవాడు పేదరికంలోకి ఎçప్పుడు వెళ్తాడని మీరందరూ ఆలోచన చేయండి.  రెండు కారణాల వల్ల పేదవాడు అప్పులపాలు అవుతాడు. ఒక్కటి ఆ పేదవాడు తన పిల్లాడిని చదివించేందుకు అప్పులపాలు అవుతాడు. రెండోవది ఆ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం పాలు అయితే దిక్కుతోచని స్థితిలో ఆసుపత్రికి చేరినప్పుడు అప్పులపాలు అవుతాడు. ఈ రెండే పేదవాడు అప్పులపాలు అయ్యేందుకు కారణంగా ఉంటున్నాయి. పేదవాడికి మేలు చేయడమంటే ఎన్నికలప్పుడు మాత్రమే తనకు బీసీలపై ప్రేమ ఉందని చంద్రబాబులా చెప్పడం కాదు. 

వైయస్‌ఆర్‌ ఒక్కరే పేదవాడికి మేలు చేశారు..
పేదవాడికి మేలు చేసింది ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి మాత్రమే. ఎవరైనా ఇంజినీరింగ్, డాక్టర్‌ కోర్సులు చదవాలంటే నేను తోడుగా ఉంటానని నాన్నగారు భరోసా కల్పించారు. నాన్నగారు చనిపోయిన తరువాత ఇవాళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంజినీరింగ్‌ చదవాలంటే ఫీజులు లక్షల్లో ఉన్నాయి. చంద్రబాబు ఇచ్చేది మాత్రం రూ.30 వేలు మాత్రమే. మిగతా డబ్బులు ఆ పేదవాడు ఎక్కడి నుంచి తెస్తాడు. ఒక్కసారి గుండెలమీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి. మన పిల్లలను ఇంజినీరింగ్, డాక్టర్లుగా చదివించే పరిస్థితి లేదు. పేదవాడు పూర్తిగా అతలాకుతలం అయ్యే పరిస్థితి వచ్చింది. పేదవాడి కోసం వైయస్‌ఆర్‌ ఒక అడుగు ముందుకు వేశాడు. మహానేత కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీ పిల్లలను ఏం చదివిస్తారో చదివించండి, ఎన్ని లక్షలు ఖర్చు అయినా మన ప్రభుత్వమే భరిస్తుంది.  అంతేకాదు హాస్టల్‌ మెస్‌ చార్జీలు, బోర్డింగ్‌ చార్జీలు కూడా ప్రతి ఏటా రూ.20 వేలు చెల్లిస్తాం. పేదవాడు ఇంజినీర్, డాక్టర్‌ కావాలన్నా చిన్న పిల్లల నుంచి పునాదులు పడుతాయి. ఆ చిట్టి పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయితేనే మన తలరాతలు మారుతాయి. అందుకే చెబుతున్నాను. నాన్నగారి కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. మీరు మీ పిల్లలను బడికి పంపించండి. బడికి పంపించినందుకు ప్రతి తల్లికి ఏడాదికి రూ. 15 వేలు ఇస్తాను.

ఆరోగ్యశ్రీ పరిస్థితి దారుణం..
పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే అప్పులపాలు అవుతుంటారు. ఆ పేదవాడి ఆసుపత్రి ఖర్చుల కోసం లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. నాన్నగారి హయాంలో పేదవాడికి ఆరోగ్యం బాగోలేకపోతే 108 నంబర్‌కు ఫోన్‌ కొడితే కుయ్‌ కుయ్‌ అంటూ 20 నిమిషాల్లోనే ఆ పేదవాడి ఇంటి ముందు చేరి ఆసుపత్రికి తీసుకెళ్లి ఆరోగ్యంగా ఇంటికి చేర్చేవారు. ఇవాళ 108 ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ వస్తుందా? ఇవాళ డ్రైవర్లకు జీతాలు ఇవ్వడం లేదన్న సమాధానం వస్తుంది. అంబులెన్స్‌కు టైర్లు బాగోలేవని,పెట్రోలు, డీజిల్‌ లేదని చెబుతున్నారు. ఇవాళ ఏదైనా గుండెపోటు, అంతకన్న పెద్ద రోగం వస్తే పెద్ద ఆసుపత్రికి వెళ్లాలి. అందరం కూడా హైదరాబాద్‌కు వైద్యం కోసం వెళ్తాం. ఇవాళ మన ఖర్మ ఏంటో తెలుసా..హైదరాబాద్‌కు వెళ్తే ఆరోగ్యశ్రీ వర్తించదట. చిన్నపిల్లలకు మూగ, చెవుడు ఆపరేషన్‌ చేయించాలంటే రూ.6 లక్షలు ఖర్చు అవుతుంది. నాన్నగారి పాలనలో ఆ పిల్లలకు ఉచితంగా ఆపరేషన్‌ చేయించేవారు. ఇవాళ అలాంటి ఆపరేషన్లు చేయించడం లేదు. ఇవాళ క్యాన్సర్‌ వస్తే కీమోథెరపీ చేయించడం లేదు. డయాలసిస్‌ చేయించడం లేదు.  ఇవాళ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం లేదు. ఇదే చంద్రబాబు హయాంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది.

మీ అందరి చల్లని దీవెనలకు..
నాన్నగారు పేదవారి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన కొడుకుగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎంత పెద్ద ఆపరేషన్‌ అయినా కూడా ఉచితంగా చేయిస్తాను. మంచి ఆసుపత్రిలో ఆపరేషన్‌ చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపిస్తాను. ఆ ఆపరేషన్‌ చేయించినప్పుడు ఆ పేదవాడు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెబితే..ఆ సమయంలో పేదవాడి కుటుంబం ఆకలితో అలమటించకుండా డబ్బులు ఇస్తామని భరోసా కల్పిస్తున్నాను. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారి కోసం చెబుతున్నాను. పెద్ద పెద్ద రోగాల వల్ల ప్రతి పేదవాడు మందులకు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వారికి ప్రతి నెల రూ.10 వేల పింఛన్‌  ఇస్తాం. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటానని మీ అందరి సమక్షంలో చెబుతున్నాను. మీరు ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే నా వద్దకు రావచ్చు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు బయలుదేరిన మీ బిడ్డకు తోడుగా ఉండమని కోరుకుంటూ..మీ అందరి చల్లని దీవెనలకు, అప్యాయతలకు మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నాను. 


 
Back to Top