చంద్రబాబులా దొంగ హామీలివ్వను

నెల్లూరు:

ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో దేశానికి చాటి చెప్పిన వ్యక్తి మహానేత డాక్టర్ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే అని వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచించిన ముఖ్యమంత్రి ఆయనొక్కరే అన్నారు. అందుకే ఆయన మరణిస్తే వందలాది గుండెలు ఆగిపోయాయని, ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయి నాలుగున్నరేళ్లవుతున్నా ప్రజల గుండెల్లో జీవించే ఉన్నారని తెలిపారు. అందుకే ఆ మహానేత ఎక్కడున్నారని అడిగితే... ప్రజల చేయి నేరుగా వారి గుండెల మీదకు వెళ్తుందని సగర్వంగా చెప్పారు. రాజన్న మా గుండెల్లో జీవించి ఉన్నారని వారు నినదిస్నారన్నారు. ఆ దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి నుంచి తనకు వారసత్వంగా ఏదైనా వచ్చిందీ అంటే అది ఒక్క విశ్వసనీయతే అని అన్నారు. విశ్వసనీయత ఉంది కనుకే తాను చంద్రబాబులా అబద్ధాల హామీలు ఇవ్వనని, చెప్పేదే చేస్తానని, చేసేదే చెప్తానని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు.

‘ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పుడు నా దగ్గరకు చాలామంది వచ్చి... అన్నా నువ్వు ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానని చెప్పన్నా అని సూచించారు. చంద్రబాబు రైతుల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించినప్పుడు కొందరు నా దగ్గరకొచ్చి... అన్నా నువ్వు కూడా రైతుల రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించన్నా అని సలహా ఇచ్చారు. కానీ నేను వైయస్ఆర్ కొడుకుని. ఓట్లు‌, సీట్ల కోసం చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసగించలేనని చెప్పాను’ అని శ్రీ జగన్ అన్నారు.

‘మరో 18 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జ‌రుగుతాయి. అవి మన తలరాత లు మార్చే ఎన్నికలు. జనం గుండె చప్పుడు ఏ వ్యక్తి వినేవాడో... పేద ప్రజల కోసం ఏ నాయకుడు ఆలోచిస్తాడో... చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో బతికుండాలని ఏ నాయకుడు కోరుకుంటాడో అలాంటి నాయకుడినే సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్ అందించిన విశ్వసనీయత, నిజాయితీ ఒకవైపు... చంద్రబాబు కుళ్లు కుతంత్రాలు మరోవైపు ఉన్నా యి. విశ్వసనీయతకే మీరు ఓటేయండి... వై‌యస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి’ అని ప్రజలకు శ్రీ జగన్ పిలుపునిచ్చారు.‌ నెల్లూరు నుంచి పార్టీ ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతంరెడ్డి, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలచెన్నయ్య. మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి ఈ సభల్లో పాల్గొన్నారు.

ఐదు సంతకాలతో రాష్ట్రం దశను మారుస్తా :
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వేదికపైనే తాను చేసే ఐదు సంతకాలతో ఈ రాష్ట్ర ప్రజల దశ, దిశ కచ్చితంగా మారుస్తానని శ్రీ జగన్‌ ఓటర్లకు హామీ ఇచ్చారు. 'అమ్మ ఒడి పథకం'పై తొలి సంతకం చేస్తానని ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ చెప్పారు. అవ్వాతాతల బతుకు భరోసా కోసం నెలకు రూ.700 చొప్పున పెన్షన్ ఇచ్చేలా రెండ‌వ సంతకం చేస్తానన్నారు. రైతులకు మద్దతుధర, గిట్టుబాటు ధర కల్పించడం కోసం రూ. 3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసే ఫైలుపై మూడవ సంతకం చేస్తానన్నారు. కరవు, వరద వచ్చినప్పుడు వెంటనే  పరిహారం అందించి, రైతును ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో సహాయ నిధిని ఏర్పాటు చేస్తానన్నారు. రూ.20 వేల కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేయడం కోసం నాలుగవ సంతకం చేస్తానని చెప్పారు. గ్రామాల్లో రేషన్‌కార్డు, పెన్షన్‌కార్డు, ఏ కార్డు కావాలన్నా ఆ ఊర్లో ఆ వార్డులోనే 24 గంటల్లోగా కార్డు ఇప్పించే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఐదవ సంతకం చేస్తానని తెలిపారు.

అందరికీ అండగా ఉంటా :
వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే పేదల కోసం ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మిస్తానని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. 2019 నాటికి ఏ గ్రామంలోనూ ఇల్లు లేని వారు లేకుండా చేస్తానన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తానన్నారు. ప్రమాదాల్లో గాయపడి ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందినవారు డాక్టర్ సూచన‌తో వారు ఎన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటే అన్ని రోజులు నెలకు రూ. 3 వేల చొప్పున సహాయం అందిస్తానన్నారు. చెవుడు, మూగ పిల్లలకు  రూ.6 లక్షల ఖర్చయ్యే కాక్లియర్ ఆపరేషన్లను ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి తొలగించింది. వీటిని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చుతా. సీఎం అయ్యాక ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించి డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉండేలా చేస్తా‌నని తెలిపారు.

పేదల ఇళ్ళకు 150 యూనిట్ల విద్యుత్‌ను వంద రూపాయలకే అందజేస్తానని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడి తరహాలో ఇంటికో ఉద్యోగం ఇస్తానంటూ అబద్ధాలు చెప్పడం తనకు చేతకాదన్నారు. రాష్ట్రంలో ప్రతి స్కూలును ఇంగ్లిష్ మీడియంగా మా‌రుస్తానన్నారు. ముఖ్యమంత్రి అయ్యాక బెల్టుషాపులను మూసివేయిస్తానన్నారు. బెల్టుషాపులు లేకుండా చేసేందుకు ప్రతి గ్రామానికి పది మంది ఆడ పోలీసులను నియమిస్తానన్నారు.

Back to Top