ప్రజలకు మౌలిక వసతుల కల్పనలోనూ రాజకీయ వివక్ష భావ్యమేనా?

07–07–2018, శనివారం 
పసలపూడి, తూర్పుగోదావరి జిల్లా 

రామచంద్రాపురం నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రలో అశేష జన సమూహంతో పాటు.. వర్షమూ వెన్నంటి అనుసరిస్తూనే ఉంది. ఈ రోజు కూడా వర్షపు చినుకుల మధ్యనే ఆత్మీయులను పలకరిస్తూ అడుగు ముందుకేశాను.  

అధికారంలో ఉన్నవారి సంకుచితత్వం తమకు శాపమైన వైనాన్ని వివరించారు.. నెలపర్తిపాడు పంచాయతీ ప్రజలు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడల్లా తమకు ఇక్కట్లు తప్పడంలేదన్నారు. 1994 నుంచి 2004 వరకూ పదేళ్ల పాటు ఆ గ్రామాలకు కనీసం రహదారి సౌకర్యమే కల్పించలేదట. 2005లో నాన్నగారు వేయించిన రోడ్డు.. అత్యధికంగా బలహీన వర్గాలు, నిరుపేదలు నివసించే ఆ గ్రామాలన్నింటికీ వరంగా మారింది. ఆ గ్రామాల వారు ఆ రహదారికి నాన్నగారి పేరు పెట్టుకుని.. ఆయన పేర ఆర్చీ కూడా ఏర్పాటుచేసుకున్నారట. టీడీపీ నేతలకు అది కంటగింపుగా మారింది. జీపీసీఎల్‌ చమురు సంస్థ భారీ వాహనాల రాకపోకలతో ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. 2014లో ఆ చమురు సంస్థ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ నిధులు రూ.కోటి మంజూరు చేసి.. రహదారి పునర్నిర్మాణ పనులు ప్రారంభించింది. ఆ ఏడాది టీడీపీ అధికారంలోకి రావడమే ఆ గ్రామాల పాలిట శాపమైంది. కక్షగట్టి రహదారి పనులను ఆపివేయించారట. వైఎస్సార్‌ ఆర్చీ ఉందని, రహదారికి నాన్నగారి పేరు పెట్టారని.. పది గ్రామాలను, ఏడెనిమిది వేల మంది ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వ వివక్షకు పరాకాష్ట. మౌలిక వసతుల కల్పనలోనూ కక్షలు, రాజకీయ వివక్షలు భావ్యమేనా? ఓట్లేయనంత మాత్రాన ప్రజలను పరాయివారిగా చూస్తారా? శత్రువులుగా పరిగణిస్తారా? 


చంద్రబాబు తమను మోసం చేశాడని.. చర్మకారుల సంఘం ప్రతినిధులు, రాజకీయ లబ్ధికోసం ఎంత దారుణానికైనా ఒడికడతాడని.. మాదిగ పోరాట సమితి సభ్యులు బాబుగారి కుటిల రాజకీయాలపై కన్నెర్రజేశారు. ‘అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టాడు.. విద్వేషాన్ని రగిలించాడు. ఓట్లను చీల్చడానికి దుర్మార్గపు రాజకీయాలకు ఒడిగట్టాడు. మాలమాదిగలిద్దరినీ మోసం చేశా డు. ఎన్నికలకు ముందు డప్పు కొట్టి, చెప్పులు కుట్టి.. నేనే పెద్ద మాదిగనని చెప్పుకున్నాడు. అధికారపీఠం ఎక్కాక.. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అంటూ అహంకారపూరిత వ్యాఖ్యలతో మమ్మల్ని అత్యంత హీనంగా అవమానించి తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు’అంటూ వాపోయారు.  

ఇంజనీరింగ్‌ చదువుతున్న చెల్లెమ్మ సాయిత్రివేణికి ఇటీవలే ఓటు హక్కు వచ్చిందట. నా దగ్గరకు సంబరంగా వచ్చి ‘అన్నా.. నా మొదటి ఓటు మీకే వేస్తాను’అంది. ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న మీకు యువత బాసటగా నిలుస్తుంది.. అంటూ విశ్వాసంగా పలికింది. 

ఈ రోజు వర్షంలో సైతం దివ్యాంగులు చాలామంది కలిశారు. వారి బాధలు వింటుంటే.. పాలకుల వివక్షకు పాపం పుణ్యమనేవే లేవనిపించింది. మారిశెట్టి రూతమ్మ అనే సోదరి.. నేను ఓదార్పు యాత్రలో ఉన్నప్పుడు తన కుమారుడికి నాతో నాన్నగారి పేరు పెట్టించుకుంది. అది జరిగి ఏళ్లు గడిచిపోయినా.. ఆ దివ్యాంగురాలిపై పాలకుల ఆగ్రహం మాత్రం చల్లారలేదు. ఆమెకు పింఛన్‌ రాకుండా చేయడమే కాకుండా.. రేషన్‌కార్డు కూడా తొలగించేశారట. ఆ అరాచకాన్ని తలచుకుంటూ ఆ ఆడపడుచు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. 80 శాతం వైకల్యం ఉన్న అబ్బాయమ్మ పింఛన్‌ రావడం లేదంటూ కన్నీటిపర్యంతమైంది. వారి బాధ నన్ను కలచివేసింది. అర్హులైన నిరుపేదలు తమకు పింఛన్‌లు ఇవ్వడం లేదంటూ రోజూ నన్ను కలిసి.. కష్టాలు చెప్పుకుంటున్నారు. బాబుగారు మాత్రం హామీలన్నీ నెరవేర్చేశానని, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేశానని.. పచ్చ మీడియాలో బాకాలూదడం విడ్డూరమనిపించింది.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. నచ్చిన వారికి ఓటేయడం.. ప్రజాస్వామ్యం ప్రజలకిచ్చిన హక్కు. ఆ హక్కును మీకు వ్యతిరేకంగా వినియోగించుకున్నారన్న నెపంతో ప్రజలపై కక్ష సాధిస్తూ.. వివక్షకు గురిచేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా? మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను అవినీతి డబ్బుతో సంతలో పశువుల్లా కొని.. వారిలో కొందరికి మంత్రి పదవులిచ్చిన మీ నుంచి.. ప్రజలు ఇంతకన్నా ఏం ఆశించగలరు?!  
-వైయ‌స్‌ జగన్‌   




Back to Top