పోలీసుల ఎదుటే పచ్చబాబుల గూండాయిజం

 • నగరి మున్సిపల్ చైర్ పర్సన్ పై పచ్చనేతల దాడి
 • స్పృహతప్పి కిందపడిపోయిన శాంతకుమారి
 • చెన్నై అపోలో ఆస్పత్రికి తరలింపు
 • పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా కొట్టిన పచ్చగూండాలు
 • టీడీపీ అరాచకాలపై పెద్దిరెడ్డి ఆగ్రహం

 • తిరుపతి : రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఆగడాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి.  అధికారాన్ని అడ్డం పెట్టుకొని  పచ్చనేతలు వైయస్సార్సీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అండతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు గూండాల మాదిరి రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె శాంతికుమారిని చెన్నైకి తరలించారు. సోమవారం ఉదయం మెరుగైన చికిత్సకోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. 

  అంతకుముందు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శాంతకుమారిని వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  పరామర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. పథకం ప్రకారమే వైయస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.  పోలీసులు సమక్షంలోనే ఈఅమానుష సంఘటనలు చోటుచేసుకోవడం  దారుణమన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

  నగరి మున్సిపాల్టీలోని 23, 24 వార్డుల్లో ఆదివారం ‘రంజాన్ తోఫా’ పంపిణీకి అధికారులు ప్రొటోకాల్ ప్రకారం వార్డు కౌన్సిలర్లు పుష్ప, గౌరిలను కూడా ఆహ్వానించారు. వీరిద్దరితోపాటు ప్రత్యేక ఆహ్వానితురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్ శాంతకుమారి కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అరగంట తర్వాత టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు వచ్చారు. ‘ఈ కార్యక్రమం పూర్తిగా టీడీపీకి చెందింది. మీరెందుకొచ్చారు?’ అంటూ చైర్‌పర్సన్‌తోపాటు కౌన్సిలర్లను నిలదీశారు. తమ వార్డుల్లో జరిగే కార్యక్రమానికి తాము హాజరవకపోతే ఎలాగని వారు ఎదురు ప్రశ్నించారు. వెళ్లిపోవాలంటూ ముద్దుకృష్ణమనాయుడు ఆయన అనుచరులు, టీడీపీ కార్యకర్తలు మైకేల్, అమృత్‌రాజ్, బాల, మునికృష్ణారెడ్డి తదితరులు రెచ్చిపోయారు. 

  దీన్ని తట్టుకోలేని కౌన్సిలర్లు పుష్ప, గౌరి, చైర్‌పర్సన్ శాంతకుమారి దీనిపై ఫిర్యాదు చేసేందుకుగాను పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ నేపథ్యంలో 50 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్‌ఐ విక్రమ్ గదిలో కూర్చున్న కౌన్సిలర్లు, చైర్‌పర్సన్, ఆమె భర్త కేజే కుమార్‌లతో గొడవకు దిగారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు చైర్‌పర్సన్ శాంతకుమారిపై దౌర్జన్యానికి దిగారు. విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దుర్భాషలాడుతూ మోకాళ్లతో కడుపులో బలంగా పొడిచారు. దీంతో కిందపడిపోయిన చైర్‌పర్సన్ స్పృహ కోల్పోయారు. అడ్డొచ్చిన చైర్‌పర్సన్ భర్త కుమార్ పైనా దాడి చేశారు. 
Back to Top