చెప్పులేయించిన ఘ‌న‌త మీదే..మ‌ర్రి

గుంటూరు : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించిన చరిత్ర చంద్రబాబునాయుడిదని వైయ‌స్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలో వారు ఏర్పాటు చేసుకున్న మహానాడు కార్యక్రమంలోనే వారి పార్టీకి చెందిన మహిళా కార్యకర్త చంద్రబాబుకు చెప్పు చూపడం అన్ని పత్రికలు, టీవీల్లో వచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు.  ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు చేసే సూచనలు పాటిస్తూ తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి అధికార పార్టీ నేతలు ఎదురు దాడులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని దిష్టి బొమ్మలు దహనం సాస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఎన్నికలకు ముందు సాధ్యం కాని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన చంద్రబాబును ఏమనాలో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు.
 రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముందని ఆయన ప్రశ్నించారు. తాము మాత్రం ప్రజాసమస్యలపై పోరాడేందుకు రోడ్లపైకి వస్తే కేసులు పెట్టడం, దిష్టి బొమ్మలు లాక్కెళ్లడం వంటివి చేసే పోలీసులు ఇప్పుడు వారికి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు.
Back to Top