ఆంధ్ర రాష్ట్రాన్నే ఎందుకు విడదీస్తున్నట్టు?

న్యూఢిల్లీ, 13 నవంబర్ 2013:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవటం లేదని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌ఆరోపించింది. విభజన అనంతరం ఉత్పన్నమయ్యే సమస్యల గురించి ఆలోచించాలని సూచించింది. దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో విభజన వాదాలు ఉన్నాయని అయితే వాటి గురించి పట్టించుకోకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ ను మాత్రమే ఎందుకు విడదీయాలనుకుంటున్నార‌ని జీఓఎంను నిలదీసింది. ఏకపక్షంగా, నిరంకుశంగా రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని కేంద్ర మంత్రుల బృందానికి (జీ‌ఓఎం) సుస్పష్టంగా చెప్పింది. సరైన హేతుబద్ధత, గట్టి ప్రాతిపదిక లేకుండా రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విభజించడం సమంజసం, సమర్థనీయం కానే కాదని తెలిపింది. సమైక్యాంధ్రప్రదేశ్ అనే తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే మూడు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని పేర్కొంది. సమైక్యాంధ్రప్రదే‌శ్‌ను యథాతథంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. జీఓఎం ఆహ్వానం మేరకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ తరఫున‌ డాక్టర్ ఎం‌వీ మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు బుధవారం ఉదయం హోం శాఖ కార్యాలయంలో  జీఓఎం సభ్యులతో భేటీ అయ్యారు.

విభజనపై పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్, కేంద్రం నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. సమైక్యాంధ్రనే కొనసాగించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాసిన ఎనిమిది పేజీల లేఖను మైసూరారెడ్డి జీఓఎంకు అందజేశారు. జీఓఎం సభ్యుల్లో ముగ్గురు మాత్రమే.. సుశీల్‌కుమార్‌ షిండే, జైరాం రమేశ్, వీరప్పమొయిలీ పాల్గొన్న ఈ భేటీ 20 నిమిషాల పాటు కొనసాగింది. వీరు కూడా మైసూరా బృందం చెప్పిన అంశాలను వినడానికే పరిమితమయ్యారు తప్ప ఏమీ మాట్లాడలేదని సమాచారం. చివరిలో షిండే మాత్రం ‘మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు’ అని వ్యాఖ్యానించినట్లు ‌తెలిసింది.

మొదటి నుంచీ సమైక్యవాదానికే కట్టుబడి ఉన్న వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్ విభజనకు వ్యతిరేకంగా తన వాదన‌ను వినిపించింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే ఎదురయ్యే సమస్యలను జీఓఎం దృష్టికి తీసుకువెళ్లింది. జీఓఎంతో సమావేశమైన అనంతరం మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను విడదీసేటప్పుడు చేయాల్సిన ఆలోచనలు చేయటం లేదని మైసూరారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. 70 శాతం మంది వీధుల్లోకి వచ్చి సమైక్యాంధ్ర ఆందోళన చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. విభజన వల్ల మూడు ప్రాంతాలూ నష్టపోతాయన్నారు. విభజన దేశ సమగ్రతకు సరి కాదన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి రాసిన 8 పేజీల లేఖలో సమైక్యాంధ్రప్రదేశ్‌నే ఉంచాలని ప్రధానంగా పేర్కొన్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన ఏకపక్షంగా, నిరంకుశంగా చేశారని, ఒక ప్రాతిపదిక లేదని కూడా చెప్పామన్నారు. సోనియా పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణను బహుమతిగా ఇస్తారని కొందరు నాయకులు అన్నారని, అదేనా రాష్ట్ర విభజనకు ప్రాతిపదిక అని ప్రశ్నించినట్లు మైసూరా అన్నారు. రాష్ట్రాల విభజనపై ఓ కమిషన్ లేదా కమిటీ వేసి విభజనపై నిర్ణయాలు తీసుకోవాలన్నారు.

సమైక్య రాష్ట్రాన్ని విడదీయాలంటే ఒక ప్రాతిపదిక ఉండాలన్నారు. ఓట్లు‌, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని మైసూరారెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే ఆదాయాన్ని కోల్పోతే సంక్షేమ పథకాలు నిర్వీర్యం అవుతాయన్నారు. నదీ జలాల సమస్యే చాలా చిక్కు సమస్య అన్నారు. నీటి వివాదాలపై ఇప్పటికే ఉన్న పలు ట్రిబ్యునళ్ళు ఇచ్చిన ఆదేశాలను పాటించని వైనాన్ని మైసూరా గుర్తుచేశారు. మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేస్తే ప్రభుత్వం ఏమి చేయగలిగిందని ప్రశ్నించారు. మిగులు జలాలను ఏ విధంగా పంచాలన్న దూరదృష్టి కేంద్రానికి లేదన్నారు.

సోనియా గాంధీ భారతదేశ పౌరసత్వం తీసుకుని 30 ఏళ్ళు అయిందని.. పార్లమెంటులో బిల్లు తీసుకువచ్చి ఆమె పౌరసత్వం చెల్లదు అంటే.. దేశం విడిచిపోవడానికి ఆమె ఎంత బాధపడతారో.. హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రావారిని ఒక్కసారే వెళ్లిపొమ్మంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకోవాలని మైసూరారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్‌ మీద ఆధారపడిన వ్యవసాయ పంపెసెట్లు అత్యధికంగా 20 లక్షలకు పైగా తెలంగాణలోనే ఉన్న వైనాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రం విడిపోయినప్పుడు చిన్న రాష్ట్రాలకు విద్యుచ్చక్తిని ఏ విధంగా ఇవ్వగలుగుతారని అన్నారు.  రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విడదీయడం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌కు ఏమాత్రమూ సమ్మతం కాదని జీఓఎంకు స్పష్టంగా చెప్పామన్నారు.

జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను జగన్ ‌కలుస్తారు :
అధికారంలో ఉన్న పార్టీ బలహీనంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించడానికి పూనుకుంటే అది దేశ సమగ్రతకు ముప్పు కలిగిస్తుందని పేర్కొంటూ.. దేశ ప్రయోజనాల కోసం, సమాఖ్య వ్యవస్థ పరిరక్షకు విభజన బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలను కలుస్తారని మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏకాభిప్రాయాన్ని కూడగడతారన్నారు. విభజనపై తమ నిరసనలు, పోరాటం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ‘ఇప్పటివరకు అధికార పార్టీ ఇష్టానుసారం చేసింది. ఇకమీదట కుదరదు. బిల్లుకు వ్యతిరేకంగా మేం మద్దతు కూడగడతాం’ అని చెప్పారు. హైదరాబాద్ విషయంలోనూ కేంద్రం ఆలోచన సరికాదన్నారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ ఎప్పుడూ సమైక్యమే :
‘ఆర్టికల్ 3 ప్రకారం అధికారం ఉందని మాపై పెత్తనం చేయొద్దు. మీరు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి. అందరికీ న్యాయం జరిగేటట్టు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్టు మీ ఆలోచన ఉండాలని మేం చెప్పాం. ఆ రోజున మేం చెప్పినదాని అర్థం విభజన చేయాలని కాదు. సమస్యను పరిష్కరించలేరు కనుక యథాతథంగా ఉంచాలని అర్థం స్ఫురించేలా మేం మా వైఖరి చెప్పాం. దానికి మీరు వక్రభాష్యం చెప్పడం సరికాదు. మేం ఆ రోజున చెప్పింది సమైక్యమే.. ఇప్పుడు చెప్తున్నదీ సమైక్యమే’ అని స్పష్టం చేశారు.

Back to Top