బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానానికి పట్టుబట్టిన వైఎస్సార్‌సీపీ

ఐటీడీఏలో పాలకవర్గ సమావేశం బాక్సైట్ వ్యవహారంతో చివరకు అర్ధంతరంగా ముగిసింది. తవ్వకాలకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు సంతకాలు చేసి తీర్మాన పత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం మళ్లీ మొదలైంది. బాక్సైట్‌కు వ్యతిరేకంగా తీర్మానించినట్టు ప్రకటించాలని మంత్రి, జిల్లా కలెక్టర్లను అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, ముంచంగిపుట్టు ఎంపీపీ త్రినాథ్‌లు కోరారు. ప్రజా ప్రతినిధులందరూ పోడియంను చుట్టు ముట్టి బాక్సైట్ తీర్మానం కోసం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనికి మంత్రి, కలెక్టర్ అంగీకరించలేదు.

సుమారు రెండు గంటలపాటు మంత్రి రావెల కిశోర్‌బాబు, కలెక్టర్, పాలకపక్ష ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు, అరకు, పాడేరు ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం సాగింది. దీంతో ఏజెండా అంశాలు కొనసాగలేదు. బాక్సైట్‌పై తీర్మానం చేయకపోవడంతో ఎమ్మెల్సీ సాగి సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరి, బూడి ముత్యాల నాయుడుతోపాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చేశారు. ఐటీడీఏ ఎదుట అరగంటసేపు బాక్సైట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ధర్నా చేపట్టారు.

సమావేశంలో ఎమ్మెల్యే ఈశ్వరి మాట్లాడుతూ మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా వ్యవహరిస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను కూడా ఇచ్చింద ని, దీనిని మన్య ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇప్పుడు బా క్సైట్‌పై పాలకవర్గ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారని కచ్చితంగా బాక్సైట్ తవ్వకాల అనుమతులను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని పట్టుబట్టారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మాట్లాడుతూ గిరిజన సలహా మండలి (టీఏసీ)లో ఎటువంటి తీర్మానం చేయకుండా బాక్సైట్ తవ్వకాలకు దొడ్డిదారిన ప్రభుత్వం అనుమతులివ్వడం దుర్మార్గమన్నారు.

బాక్సైట్ తవ్వకాలతో గిరిజనులకు ఎటువంటి ప్రయోజనం ఉండదని, వేలాది కుటుంబాలు నిర్వాసితులవుతాయని, గిరిజన జాతి అంతరించే ప్రమాదం ఉందన్నారు. పర్యావరణానికి కూడా తీవ్ర ముప్పు ఉందని, బాక్సైట్ త వ్వకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాకే సమావేశం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ సాగి సూర్యనారాయణరాజు తోపాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా దీన్ని బలపరిచి ఈ తీర్మానం కోసం తమ ఏకాభిప్రాయాన్ని తెలిపారు. చోడవరం ఎమ్మెల్యే కెఎస్‌ఎన్ రాజు మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాల వల్ల మైదాన ప్రాంతాల్లోని రిజర్వాయర్లు కూడా కలుషితం అవుతాయని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని తాము గత కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నుంచి దీనిని వ్యతిరేకిస్తున్నామన్నారు.

ఇప్పుడు కూడా ఇదే మాటకు కట్టుబడి గిరిజన ప్రాంతం, గిరిజన ప్రజల శ్రేయస్సుకోసం బాక్సైట్ తవ్వకాలను ఆపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. దీనిపై ఐటీడీఏ చైర్మన్, జిల్లా కలెక్టర్ యువరాజ్ స్పందిస్తూ ఇప్పటికిప్పుడు తీర్మానం చేయడం సాధ్యం కానిదని, బాక్సైట్ అంశాలను పూర్తిగా పరిశీలించేందుకు ఐటీడీఏ పీవో, ఏపీఎండీసీ అధికారులు, పాలక మండలి సభ్యులతో ఒక సబ్‌కమిటీని ఏర్పాటు చేసి చర్చించిన మీదట పాలకవర్గ తీర్మానాన్ని రూపొందించి ప్రభుత్వానికి నివేదించ వచ్చునని చెప్పారు.

దీనికి ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఎప్పటికప్పుడు బాక్సైట్ పై వ్యతిరేకంగా తీర్మానం చేసే అంశంపై దాట వేస్తుండటం, అనుమతి పనులు ముందుకు సాగుతుండటం వల్ల గిరిజనుల్లో ఆందోళన నెలకొందని, దీనిపై ఇప్పటికైనా ఐటీడీఏ పాలకవ ర్గ నిర్ణయాన్ని వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉందన్నారు. కచ్చితంగా పాలకవర్గం తీర్మానించి ప్రభుత్వానికి పంపించాల్సిందేనని పట్టుబట్టారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ, ఎంపీపీలు సంతకాలు చేసిన తీర్మాన పత్రాన్ని కలెక్టర్‌కు అందించారు.

బాక్సైట్ తీర్మాన వ్యవహారం ముగిసిన తర్వాత సమావేశానికి కాస్త ఆలస్యంగా వచ్చిన సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిశోర్‌బాబు బాక్సైట్ గురించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, గిరిజనుల సంస్కృతికి, వారి అభీష్టానికి వ్యతిరేకంగా ఎటువంటి చర్యలు తీసుకోదని, దీనిపై అనవసరమైన ఆందోళనలు, అపోహలను వీడాలని ముక్తాయింపుగా చెప్పారు.
Back to Top