ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక బృందాలను పంపాలి

హైదరాబాద్ 20 జూన్ 2013:

ఉత్తరాఖండ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ యాత్రికులను వెంటనే ఆదుకోవాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ముఖ్యమంత్రికి ఓ లేఖ రాశారు. ఆచూకీ తెలియని యాత్రికుల కోసం రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపి అన్వేషించాలని ఆమె ఆ లేఖలో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖ పూర్తి పాఠం.

గౌరవనీయులైన ముఖ్యమంత్రిగారికి,
చార్‌ధామ్ యాత్రకు వెళ్ళి అక్కడే చిక్కుకుపోయిన తెలుగువారి గురించి మా పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. ఉత్తరాఖండ్‌లో సంభవించిన వరద బీభత్సం వందలాదిమంది ప్రాణాలను బలిగొందన్న వార్త ఎంతగానో కలిచివేసింది. అందులో అనేక తెలుగు కుటుంబాలుండడం మమ్మల్ని తీవ్రంగా బాధించింది. ఈ జల విలయం దేశం నలుమూలలనుంచి ఉత్తర కాశీ యాత్రకు వచ్చేవారి పాలిట పెను విషాదంగా మారటం విచారకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్తర కాశీ, కేదార్‌నాథ్, బదరీ నాథ్, గంగోత్రి, యమునోత్రి వంటి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్ళిన దాదాపు డెబైవేల మంది ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నారు. వారిలో చాలామంది మన రాష్ట్రానికి చెందిన వారు కావడం ఆందోళనకరం. సుమారు ఐదువేలమంది తెలుగు వారు వరదలో చిక్కుకుపోయి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ, కొందరు మరణించారనీ, వందలాదిమంది ఆచూకీ తెలియడం లేదనీ అందుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
హియాలయాల్లోని అడవుల్లో దాదాపు ఐదు డిగ్రీల చలిలో, తిండితిప్పలు, తాగే నీరు లేకుండా మన యాత్రికులు ప్రాణాలు అరచేత పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి తక్షణం సహాయం అందించాలి. వారి ప్రాణాలను కాపాడాలి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంతోనూ, ఉత్తరాఖండ్ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు చేసి త్వరితగతిన సహాయ చర్యలు చేపట్టి వారిని క్షేమంగా స్వస్థలాలకు చేర్చాలి. ఇది కనీస బాధ్యత.

ఉత్తరాఖండ్ వరద బీభత్సం వార్తలు వెలువడిన వెంటనే అప్రమత్తం కావాలని మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఉంటే ఇన్ని వందల కుటుంబాల్లో ఈరోజున ఇంత ఆందోళన ఉండేది కాదు. సహాయ చర్యల్లో జాప్యం కారణంగా ప్రాణనష్టం ఎక్కువ వాటిల్లింది. ఎంతమంది రాష్ట్రవాసులు వరదల్లో చిక్కుకుపోయారన్న సమాచారం కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేకపోవడం దిగ్భ్రాంతికరం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలి. వరదల్లో చిక్కుకున్న తెలుగువారి ప్రాణాలను కాపాడాలి.

విపత్కర పరిస్థితిలో ఉన్న తెలుగువారిని గుర్తించి సహాయమందించడం కోసం రాష్ట్రం నుంచి ఉత్తరాఖండ్‌కు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపాలనీ, బాధితులైన తెలుగు యాత్రికులకు అవసరమైన నాణ్యమైన వైద్య సదుపాయాలు ఉచితంగా అందించాలనీ, మృతదేహాలను తెచ్చేందుకు ప్రభుత్వమే చొరవ చూపాలి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలనీ, మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసంగా రూ. పది లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించాలనీ శ్రీమతి విజయమ్మ ఆ ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.

Back to Top