'విద్యుత్‌'పై రెఫరెండానికి సిఎం సిద్ధమా?

హైదరాబాద్‌, 6 ఏప్రిల్‌ 2013: విద్యుత్ సమస్యపై రెఫరెండానికి సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి సిద్ధమా అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సవా‌ల్ ‌చేశారు. ప్రతిపక్షాల కన్నీరు వరదలై పారుతోందన్న కిరణ్‌ వ్యాఖ్యలు అర్థరహితమని ఆమె నిప్పులు చెరిగారు. ప్రజలపై పెనుభారం మోపుతూ విద్యుత్‌ ఛార్జీలు పెంచడం, విద్యుత్‌ కోతలు విచ్చలవిడిగా అమలు చేస్తున్న ప్రభుత్వం తీరుకు నిరసనగా ఐదు రోజులుగా శ్రీమతి విజయ్మతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సు ప్రాంగణంలో నిరవధిక నిరాహార దీక్ష (కరెంట్‌ సత్యాగ్రహం) చేస్తున్నారు. దీక్షా వేదిక నుంచి శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సిఎం కిరణ్‌ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజల కన్నీటి వరదలో ఇలాంటి ముఖ్యమంత్రులు కొట్టుకుపోతారని విజయమ్మ వ్యాఖ్యానించారు.

ధైర్యం ఉంటే విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదించి‌, ఆ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని శ్రీమతి విజయమ్మ డిమాండ్ చేశారు.‌ కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసమే తాము కరెంట్‌ సత్యాగ్రహం దీక్ష చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. తమ దీక్షను సిఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ఎగతాళి చేయడమేమిటని ఆమె ధ్వజమెత్తారు. కరెంట్ సమస్యలపై ప్రజల వద్దకు వెళ్దామని, ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో తేలుతుందని‌ శ్రీమతి విజయమ్మ సిఎంకు సవాల్‌ చేశారు.

రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు అంతా బాగున్నదని ముఖ్యమంత్రి ఎలా చెబుతారని శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. పల్లెలకు వెళితే కరెంట్ కష్టా‌లేమిటో ముఖ్యమంత్రికి తెలుస్తాయని ఆమె అన్నారు. ప్రజా బ్యాలట్కు మంచి స్పందన లభిస్తోందని‌ శ్రీమతి విజయమ్మ తెలిపారు. ఈ నెల 9న జరిగే రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని ఆమె ప్రజలను కోరారు. ‌కాగా దీక్ష చేస్తున్న పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాగా నీరసించిపోయారు.
Back to Top