వైయస్ విగ్రహానికి 'కృష్ణా'భిషేకం

అనంతపురం:

అనంతపురం జిల్లాకు హంద్రీ-నీవా ద్వారా కృష్ణా జలాలు అందడం మహానేత దివంగత వైయస్ఆర్   చలవేనని జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తెలిపారు. ఈ జలాలతో ఇడుపులపాయలోని మహానేత విగ్రహాన్ని ఈ నెల 28న కృష్ణా జలాలతో అభిషేకించనున్నట్లు వెల్లడించారు. జిల్లా అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి, ముఖ్యనేతలు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఆలూరి సాంబశివారెడ్డి మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. కృష్ణా జలాల రాకతో జిల్లా ప్రజ ల చిరకాల వాంఛ నెరవేరిందన్నారు.  చంద్రబాబు రెండుసార్లు అధికారంలో ఉన్నా శిలాఫలకాలతోనే సరిపెట్టారని విమర్శించారు.  వైయస్  సీఎం అయ్యాకే హంద్రీ-నీవా ఆచరణకు నోచుకుందన్నారు. జిల్లా ప్రజల కోసం పరితపించిన వ్యక్తి వైయస్ అని కొనియాడారు. మ్యాన్ ఆఫ్ ద హంద్రీ-నీవా వైయస్సేనని స్పష్టం చేశారు. 2009లో వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక హిందూపురం జరిగిన బహిరంగ సభలో ట్రిబ్యునల్ తీర్పు తర్వాత అదనంగా ఎనిమిది లక్షల ఎకరాలకు నీరిస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ హామీని నెరవేర్చాలన్నారు. ఈ నెల 28న  ఉదయం స్థానిక సుభాష్‌రోడ్డులోని వైయస్ విగ్రహానికి నివాళులర్పించి ఇడుపులపాయకు బయలుదేరుతామన్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, రైతులు, మహిళలు, కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతపురం రావడానికి వీలుకాని ఇతర ప్రాంతాల వారు నేరుగా ఇడుపులపాయకు చేరుకోవాలని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top