ఒంగోలు, 3 డిసెంబర్ 2012: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురద చల్లడమే పనిగా టిడిపి పెట్టుకుందని వైయస్‌ఆర్‌సిపి విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. ఖమ్మం జిల్లా బయ్యారం గనుల విషయంలో తమ పార్టీ చాలాసార్లు వివరణ ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి దాని గురించే పదే పదే మాట్లాడడం సిగ్గుచేటు అని బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ప్రత్యేకంగా సమావేశంమైన అసెంబ్లీలో ఆదివారంనాడు రేవంత్‌రెడ్డి మళ్ళీ అవే ఆరోపణలు చేయడాన్ని బాలినేని తప్పుపట్టారు. ‘తప్పు మీద తప్పు మీరు చేస్తూ నిత్యం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిపై నిందలు వేస్తూ కాలం గడుపుతారా’ అని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపిలను శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఒంగోలులోని తన నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైయస్ కుటుంబమంటే ఎందుకంత భయం?:శ్రీ జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశపూర్వకంగా వేధించి, సిబిఐని అడ్డుపెట్టుకుని కనీసం బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు. తాజాగా ఇపుడు షర్మిలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. మహానేత కుటుంబమంటే మీకు ఎందుకంత భయం? నిజంగా మీ వద్ద ఆధారాలుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవచ్చని విజయమ్మ స్పష్టం చేశారుకదా! ఇంకెందుకీ దుర్మార్గపు చర్యలు? అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న అఖండ ఆదరణను చూసిన టిడిపికి భయంతో గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని శ్రీనివాసరెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ అసమర్థ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టమని తమ పార్టీ ఎన్నిసార్లు డిమాండ్ చేసినా టిడిపిలోను, దాని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిలోనూ చలనం లేదని ఆయన విమర్శించారు. తాను రాష్ట్ర గనుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎపిఎండిసితో రక్షణ స్టీల్సు ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఫార్సుచేసిన విషయాన్ని బాలినేని గుర్తుచేశారు. బయ్యారం గనులు మహానేత వైయస్ కుటుంబానికి చెందినవైతే తాను ఎందుకు రద్దుకు సిఫార్సు చేస్తానని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఇప్పుడు బయ్యారం గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రస్తుత ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ అంశంపై అసెంబ్లీ లాబీల్లో తాను చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించిందని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ ఎప్పుడొస్తుందన్న ప్రశ్నకు.. ఆయన బెయిల్‌కు సీబీఐ కావాలని అడ్డుపడుతోందని, బెయిల్ ఎప్పుడొస్తుందో చెప్పలేనన్నాను తప్ప మార్చి తర్వాత అని చెప్పలేదు అని బాలినేని వివరణ ఇచ్చారు. అవినాష్, షర్మిల కడప లోక్‌సభ సీటు కోసం పోటీ పడుతున్నారట కదా! అని అడిగినపుడు షర్మిలమ్మ ఒంగోలు, విశాఖ, విజయవాడలతో పాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీచేసి గెలవగలరు. రాజశేఖరరెడ్డి కుమార్తెగా ఆమెకు ఆ ఛరిష్మా ఉందని మాత్రమే చెప్పా అని బాలినేని తెలిపారు.